Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది బయటకు వెళితే వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటారు. ఇలా తీసుకెళ్లేందుకు వీలుగా అనేక రకాల డిజైన్లతో కూడిన వాటర్ బాటిల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బరువు తక్కువ, తీసుకెళ్లడం ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫైబర్, స్టీల్, కాపర్ బాటిల్స్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. సాధారణంగా చాలా మంది రీయూజబుల్ బాటిల్స్ వాడుతుంటారు. ఆరోగ్యానికి ఇవి అనుకూలంగా ఉండటమే కాదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్‌ను అరికట్టి పర్యావరణానికి ఇవి మేలు చేస్తాయి. అయితే తరచుగా ఉపయోగించే బాటిల్స్‌ను పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాటిల్స్ లోపలి భాగం తడిగా, చీకటిగా ఉంటుంది. బ్యాక్టీరియా, పాచి పెరిగేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అందుకే వీటిని కడుగుతూ ఉండటం చాలా ముఖ్యం.
వాటర్ బాటిల్లో రోజూ నీళ్లు నింపుతుంటే, ఉపయోగించిన ప్రతిసారి లేదా కనీసం రోజుకు ఒకసారి అయినా వాటిని కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎకో-ఫ్రెండ్లీ డిష్ సోప్ ఉపయోగించి బాటిల్ బ్రష్‌తో బాగా కడగాలి. బ్రష్ బాటిల్ అన్ని మూలలకు తిప్పాలి. బాగా వేడి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టాలి. అయితే వన్ టైమ్ యూజ్ వాటర్ బాటిల్స్‌ను రోజువారీ అవసరాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. క్వాలిటీ ఉండే బ్రాండెడ్, రీయూజబుల్ బాటిల్స్‌ను మాత్రమే వాడాలి.
మీ వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని ఎంత వీలైతే అంతా వేరు చేయండి. అంటే మూత, లోపల స్ట్రా, గ్యాస్కెట్ లాంటివి ఉంటే అన్ని బయటకు తీయండి. ఇప్పుడు ఆ బాటిల్లో వేడి నీళ్లు నింపి దాంట్లో కొంచెం డిష్ సోప్ వేయండి. వేరు చేసిన భాగాలు వేడి నీళ్లు, సబ్బు కలిపిన పాత్రలో నానబెట్టండి. ఇప్పుడు ఏదైనా పాత బ్రష్ తీసుకొని బాటిల్‌ను వేడి నీళ్లతో శుభ్రంగా కడగండి. బాటిల్ నుంచి తీసిన భాగాలను కూడా ఇలాగే బ్రష్‌తో రాసి కడగాలి. లోపలి భాగమే కాదు బాటిల్ వెలుపలి వైపు కూడా కడగటం చాలా ముఖ్యం. చెమట చేతులు, అవి ఇవి ముట్టుకొని అదే చేతులతో మనం చాలాసార్లు వాటర్ బాటిల్స్ పట్టుకుంటూ ఉంటాము కాబట్టి వెలుపలి వైపు కడగటం కూడా చాలా ముఖ్యం. బాటిల్ సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్స్‌ను తరచూ పరిశుభ్రంగా కడగాలని నిపుణులు సూచిస్తున్నారు.