Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండగ సంబరాల కని పల్లెటూర్లు వెళుతూ వెళుతూ నగర ప్రజలు ఒమిక్రాన్ వైరస్‌ను తీసుకువెళ్ళారు. పల్లె నుంచి పండగ ఆనందాలు అనుభవించి జ్ఞాపకాలు మోసుకొచ్చుకుంటూ, వాళ్ళకు వైరస్‌ను వదిలి వచ్చారు. పండుగ సంబరాలు మొదలైన ఈవారం రోజుల్లో వైరస్ బాధితులు జిల్లాల్లో ఎక్కువయ్యారు. ప్రతి ఇంటా తుమ్ములు, దగ్గులు, జ్వరాలే రాజ్యమేలుతున్నాయి. అది వైరస్సో, ఒమిక్రాన్ వైరస్సో అర్థం కాక ప్రజలంతా ఆర్టిపిసిఆర్ టెస్టుల వెంట పరిగెడుతున్నారు. కరోనా అని తేలినా స్వల్ప లక్షణాలుంటే హౌమ్ ఐసోలేషన్‌లోనే ఉండి జాగ్రత్తలు పాటించాలి. రెండు మూడు రోజుల్లో తగ్గకుండా శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతున్నపుడు లేదా ఆక్సిజన్ శాతం తగ్గుతున్నపుడు వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళాలి. పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్జిన్ శాతాన్ని పరీక్షించుకోవాలి. 92-96కు మధ్య రక్తంలో ఆక్సిజన్ శాతం ఉన్నట్లైతే వైద్యులను సంప్రదించాలి. నిమిషానికి 24 సార్ల కంటే ఎక్కువ శ్వాస పీల్చుకుంటున్నట్లైతే వ్యాధిలో సమస్య ఉన్నట్టే. వ్యాధి తీవ్రంగా ఉంటే స్పీరాయిడ్స్ ఇవ్వడం, రెమిడిసీవర్ ఇంజక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. అక్కడి వరకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటిద్దాం... క్షేమంగా ఉందాం!
చిక్కుడు గింజలతో...
నేను ఈ వారం కాలేయాన్ని అంశంగా తీసుకొని బొమ్మలు తయారు చేశాను. మీకందరికీ కాలేయం గురించిన వివరాలు తెలియజేయాలనుకున్నాను. మానవ శరీర అవయవాలలో కాలేయం ఎంత ప్రధానమైనదో తెలుసా? మనందరం ప్రాణప్రదం. అతి ముఖ్యం అని భావించే హృదయం కన్నా ప్రధానం. అత్యంత ప్రాధాన్యం గలిగిన కాలేయం గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈ మధ్య కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రమాద తీవ్రతను తగ్గిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల లోనూ వైద్యులు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు జరపడం ఎంతో ఆనందదాయకమైన విషయం. మానవులలో కాలేయం డయాఫ్రం కిందుగా కుడివైపు ఎగువ పొత్తి కడుపు భాగంలో ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఒక అనుబంధ అవయం జీర్ణక్రియకు, పెరుగుదలకు కావల్సిన జీవరసాయనాల సంశ్లేషణ వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తుంది. గ్లైకోజన్ నిల్వల నియంత్రణ, హార్మోన్ల ఉత్పత్తిని చేస్తుంది. శరీరంలో హెపాటిక్, ఆర్టరీ, హెపాటిక్ వీన్, హెపాటిక్ పోర్టర్ వీన్ ఉంటాయి. కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన పిత్తరసం చిన్నపేగుల్లోకి పంపబడుతుంది. ఇది జీర్ణక్రియకు సహకరిస్తుంది. అత్యంత ప్రధానమైన కాలేయాన్ని నేను చిక్కుడు గింజలతో తయారు చేశాను.
కుక్క ఆహారంతో...
కుక్కల ఆహారమైన 'పెడిగ్రీ'తో గతంలో ఎన్నో బొమ్మలు చేశాను. ఈరోజు కాలేయాన్ని తయారు చేశాను. ఈ విధంగా రకరకాల బొమ్మలు చేసి కాలేయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అనుకున్నాను. ఇంతకు ముందు శరీర అంగాల పొడుపు కథల్లో భాగంగా కాలేయం గురించి కూడా పొడుపు కథలు రాసి ప్రచురించాను. కాలేయం గురించి అనేక కవితలు రాశాను. 'మిఠాయిపొట్లం' అనే పొడుపు కథల పుస్తకంలో మానవ దేహంలోని అవయవాల పొడుపుకథలు రాశాను. కాలేయం చెడిపోతే వచ్చే సమస్యలను ముగ్గులుగా వేసి వాటికి మెడికల్ రంగోలి అని పేరు పెట్టాను. కాలేయంలోని రక్తనాళాలలో పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయబడుతుంది. శరీరంలో అధిక రక్త పరిమాణాలు ఉన్న సమయాలలో విలువైన ప్రముఖమైన రక్త రిజర్వాయర్‌గా పని చేస్తుంది. అదే విధంగా శరీరంలో రక్త పరిమాణం నిల్వలు తగ్గిన సమయంలో అదనపు రక్తాన్ని సరఫరా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది. శరీరానికి కావలసిన శోషరసంలో సగభాగం కాలేయంలోనే తయారవుతుంది. కాలేయం గ్లూకోరోనిడేషన్ ద్వారా 'బిల్రూబిన్'ను విచ్ఛిన్నం చేస్తుంది. ఇన్సులిన్ మరియు ఇతర హార్మోన్ల విచ్ఛినాన్ని కాలేయమే చేస్తుంది. శరీరంలోని లైపో ప్రోటీన్లలో ఎక్కువ భాగం సంశ్లేషణ చెందుతాయి. కొవ్వులను కరిగించటానికి కావల్సిన బైల్ జ్యూస్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది.
వడ్ల గింజలతో...
మా పొలంలో వేసిన వరి పంటలో కొన్ని వరి కంకుల్ని తెచ్చి పిచ్చుకల కోసం గుమ్మానికి కట్టాను. అలాగే కొన్ని వడ్లను కూడా తెచ్చి ఇంటిలో పెట్టుకున్నాను. నేను పండించిన గింజలు ధాన్యాలను నా బొమ్మల్లో ఉప యోగించుకోవాలని నా కోరిక. అలా ఇంట్లో ఉన్న చెట్లే కాకుండా పొలంలో ఉన్న చెట్లు కూడా నా బొమ్మల కోసం తమ జీవితాలను ధారపోస్తున్నాయి. ఈరోజు 'ఆహార ధాన్యాల గిడ్డంగి' అని పిలవబడే కాలేయాన్ని ఆహార ధాన్యాలతో తయారు చేస్తున్నాను. అత్యంత పెద్దగ్రంధి, ఆహార ధాన్యాల గిడ్డంగి, రసాయన ప్రయోగశాల అయిన కాలేయం వడ్డ గింజలతో తయారైంది. రసాయన ప్రయోగశాల అయిన కాలేయం వడ్లగింజలతో తయారైంది. అత్యంత పెద్ద గ్రంధి, ఆహార ధాన్యాల గిడ్డంగి, రసాయన ప్రయోగశాల అయిన కాలేయం వడ్లగింజలతో తయారైంది. ఈ కాలేయానికి కిందుగా ఒక పల్స్ లాంటి గ్రంధి పిత్తాశయం ఉంటుంది. కాలేయానికి కూడా చాలా వ్యాధులు వస్తాయి. లివర్ ట్యూమర్స్, ఎసైటిస్, లివర్ సిర్రోసిన్, బాండీస్, హెపాటిక్ ఎన్కెఫలోపతీ, వివర్ సిస్ట్ వంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటుంది కాలేయం. ఇంకా రకరకాల క్యాన్సర్లు కూడా కాలేయానికి సోకుతుంటాయి. శరీరంలో అతి పెద్ద గ్రంధి అయినప్పటికీ అన్ని ఆటుపోట్లూ తగులుతూనే ఉంటాయి.
ఇంజక్షన్ మూతలతో...
ఎరుపు రంగు ఇంజక్షన్ మూతలతో కాలేయాన్ని రూపొందించాను. చిక్కని రక్తంలో ముంచినట్టున్న కాలేయం చాలా చక్కగా తయారయింది. దీనికి కిందగా 'గాల్ బ్లాడర్'ను ఆకుపచ్చ రంగుతో తయారు చేశాను. కాలేయం ఎరుపు గోధుమ రంగులలో ఉంటుంది. ఇది చిన్న చీలికతో రెండు తిత్తులుగా ఉంటుంది. ఇది సుమారు 1.5 కిలోల బరువుతో ఉంటుంది. మద్యం తీసుకునే వారిలో లివర్ ఎక్కువగా పాడవుతుంది. దీనికి సంబంధించి నేనొక బొమ్మను వేసి దానికి ఒక మినీ కవితను జత పరిచాను. ''పాడైందా లివర్.. పోతుంది పవర్.. వస్తుంది ఫివర్.. తప్పదు రిపేర్..'' అని.
పచ్చి శనగపప్పుతో...
పచ్చి శనగపప్పును బొమ్మల్లో చాలా తక్కువగా ఉపయోగించాను. ఈ కాలేయం పచ్చి శనగపప్పుతో పచ్చగా తయారైంది. పచ్చ కామెర్లు జబ్బు కాలేయ వ్యాధి కారణంగానే వస్తుంది. అధికమైన బిల్రూబిన్ కారణంగా చర్మము, కళ్ళలోని తెలుపు రంగు మారిపోయి పసుపురంగుకు దారితీస్తాయి. ఈ కామెర్లు పసివారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ''పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది'' అనే సామెత సాధారణంగా జనాలలో వినిపిస్తుంది. నవజాత శిశువులలో కామెర్ల వ్యాధికి కాంతి చికిత్సను చేస్తారు. ప్రతిరోజూ కొద్దిసేపు ఎండలో ఉండమని కూడా చెబుతారు. నిర్లక్ష్యం చేస్తే తీవ్రస్థాయికి వెళ్ళి మరణానికి కూడా దారి తీయవచ్చు. హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఇ అనే రకరకాల కామెర్లు ఉన్నప్పటికీ హెపటైటిస్ ఎ, బి లకు మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్