Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్మార్ట్ టెక్నాలజీ యుగం ఇది. ఒక్క బటన్ నొక్కితే ఎన్నో పనులు జరిగిపోతాయి. కూర్చున్న చోట నుండే అన్నీ పూర్తయిపోతాయి. అలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతో మంది అభివృద్ది చెందుతున్నారు. వ్యక్తిగతంగా వృద్ధిలోకి వస్తున్నారు. అదే టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనుకున్నారు అమిత దేశ్‌పాండే. రీ-చర్కా - ది ఎకోసోషల్ ట్రైబ్ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
యుఎస్ఏలోని పర్డ్యూ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌లో గాడ్యుయేషన్ పూర్తి చేసిన అమిత దేశ భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె భారతదేశంతో పాటు యుఎస్ లోని అనేక బహుళజాతి కంపెనీలు, లాభాపేక్షలేని సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలకు చెందిన సిఎస్ఆర్ బృందాలు, ఎకోసోషల్ డెవలప్మెంట్స్తో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చారు. తర్వాత ఆమె తన భర్త అభిషేక్ పరాంజపేతో కలిసి రీచరఖాను స్థాపించారు.
వ్యర్థాల నుండి చేనేత
మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో విదేశీ వస్తువులను బహిష్కరించే సాధనంగా చరఖాను ఉపయోగించారు. 1905లో భారతీయులందరూ స్థానిక వస్త్రాలను ధరించాలని ప్రజలను ప్రోత్సహించారు. ఇప్పుడు 70 ఏండ్ల తర్వాత అమిత అదే చరఖాను ట్విస్ట్‌తో ఉపయోగించారు. ప్రస్తుతం ఆమె సాధారణ బట్టను ఉపయోగించడం లేదు. పూణే, దాద్రా నగర్ హవేలీలలో దొరికే చెత్త, పాలిథిన్ బ్యాగులు, రేపర్ల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. దీని నుండి ఆమె ముడిసరుకును తయారు చేయిస్తున్నారు. దీని కోసం దాద్రా నగర్ హవేలీలోని ప్రత్యేకంగా ఒక యూనిట్‌కి ఉంది. అక్కడే ఆ వ్యర్థాలను శుభ్రం చేసి కడిగి, శానిటైజ్ చేసి, ఎండబెట్టి నూలును తయారు చేస్తారు. ప్లాస్టిక్ నుండి చేనేతను తయారు చేసేందుకు అక్కడ దాదాపు 15 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ప్రకృతిపై ప్రేమతో...
దాద్రా నగర్ హవేలీలో పుట్టి పెరిగిన అమిత తన పాఠశాల రోజుల్లోనే ప్రకృతి పట్ల ఆమెకున్న ప్రేమను గుర్తించారు. పూణేలో అనేక ట్రెక్కింగ్ యాత్రలకు వెళ్లారు. అక్కడ వాతావరణ క్షీణత, మార్పు యొక్క తీవ్రమైన అవసరాన్ని ఆమె గ్రహించారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కొండచరియలు విరిగిపడినప్పుడు, అక్కడి నివాసులకు సరైన సహాయ సామాగ్రి ఎలా లేకుండా పోయిందని అమిత ప్రశ్నించేవారు. దీని గురించి ప్రచారాలను నిర్వహించడానికి ఆమె అనేక ఎంఎన్‌సి లతో పరిచయం పెట్టుకున్నారు. చివరకు వ్యర్థ పదార్థాల నిర్వహణ వైపు దృష్టి సారించింది.
గ్రామీణులకు జీవనోపాధి
ఈ స్టార్టప్ 'పర్యావరణ, సామాజిక అభివృద్ధి వైపు నడవడం', 'పర్యావరణాన్ని పరిరక్షించడానికి వ్యర్థాలను అప్‌సైక్లింగ్ చేయడం, గ్రామీణ జీవనోపాధిని ప్రారంభించడం, భూమిపై నివసించే పౌరులకు వీటన్నింటిపై అవగాహన కల్పించడం' అనే కార్యక్రమానికి నాంది పలికారు. రీచరఖా ద్వారా అమిత తన పరిసరాలు, పర్యావరణం, సమాజం, సంస్కృతి, వారసత్వంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు
ప్రారంభంలో అమిత వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను పంపిణీ చేయడానికి సరఫరాదారులను ఒప్పించే విషయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. అది వారికి అంతగా సరిపోదు. అయినప్పటికీ ఆమె తన వెంచర్, దాని ఉత్పత్తుల ప్రత్యేకతపై దృష్టి సారించారు. వాటిని మార్కెట్లో విక్రయించడం ప్రారంభించారు. తన కృషి ఫలించి మహమ్మారి దేశాన్ని తాకడానికి ముందు సుమారు 70 లక్షల లాభాన్ని పొందారు.
ఆవాసాలను కాపాడుతూ...
ఇప్పటివరకు రీచరఖా 7,00,000 ప్లాస్టిక్ వ్యర్థాలను అందమైన చాపలు, గృహాలంకరణ వస్తువులు, బ్యాగ్‌లు, బుట్టలతో పాటు మరెన్నో వస్తువులను తయారు చేయగలిగింది. వారు మునుపటి కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి వాటి నుండి హానికరమైన వ్యర్థాలను తొలగించడం, సహజ ఆవాసాలను కాపాడుకోవడంతో పాటు వాటి ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ వాసులకు మంచి జీవితాన్ని అందించి తద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించాలని యోచిస్తున్నారు. అమిత రీ చరఖాతో పాటు ఆమె లాభాపేక్ష లేని సంస్థ మై ఎకో సోషల్ ప్లానెట్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని కలలు కంటున్నారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తూ దేశాన్ని కాలుష్యం నుండి కాపాడుతూ సాధ్యమైనంత వరకు గ్రామాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
- సలీమ