Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెడ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది శాండ్విచ్ లేదా జాం, బటర్. ఇవి తినీ తినీ పిల్లలకు పెద్దలకు విసుగు పుట్టి పోతుంటుంది. అయితే బ్రెడ్‌తో ఎన్నో రకాల వంటకాలు చేస్కోవచ్చన్న విషయం కొందరికి తెలియక పోవచ్చు. వీటితో స్వీట్స్, స్నాక్ ఐటమ్స్ చేస్కోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం బ్రెడ్‌తో కొత్త కొత్త స్వీట్స్, స్నాక్స్ చేసుకుని తిందామా..
బ్రెడ్ హల్వా
కావలసిన పదార్ధాలు: బ్రెడ్ స్లైస్‌లు - ఆరు, నెయ్యి - అర కప్పు, పాలు - అరకప్పు, పంచదార - ఒక కప్పు, జీడీ పప్పు, కిస్మిస్లు - పదేసి చొప్పున, ఏలకుల పొడి - అర చెంచా.
తయారు చేయు విధానం: ముందుగా మందపాటి గిన్నె తీసుకుని దానిలో ఒక పావుకప్పు నెయ్యి పోసి అది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో బ్రెడ్డుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించాలి. వేగిన బ్రెడ్ ముక్కల్లో అరకప్పు పాలు పోసి బాగా ముద్దగా అయ్యేవరకు తిప్పుతో ఉండాలి. అది బాగా కలిసి పోయి ముద్దగా అయ్యాక పంచదార వేయాలి. పంచదార బాగా కరిగిన తర్వాత ఏలకుల పొడి, జీడీ పప్పు, కిస్మిస్ వేయాలి. పైనుంచి నెయ్యి కలపాలి. ఇది రెండు రోజులు బైట ఉన్న పాడవదు.(తీపి మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు). ఇష్టమున్న వారు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.
బ్రెడ్ ఉప్మా
కావలసిన పదార్ధాలు: బ్రెడ్ స్లైస్స్లు - ఎనిమిది, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచిమిర్చి, టమాటో, క్యారెట్, ముక్కలు, పల్లీలు - రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, నూనె, పోపు దినుసులు.
తయారు చేయు విధానం: మందపాటి బాండీలో కొంచం నూనె పోసి అది వేడెక్కాక అందులో పోపుదినుసులు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి, టొమాటో, క్యారెట్ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గాక తగినంత ఉప్పు వేయాలి. ఆ తర్వాత బ్రెడ్‌ని చేత్తో బాగా నలిపి పొడి పొడిగా చేసి బాండీలో వేసి బాగా కలియ బెట్టాలి. రెండు నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇష్టమున్న వారు నిమ్మకాయ పిండుకోవచ్చు. (సాధారణంగా బ్రెడ్ డేట్ అయిపోగానే పారేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉప్మా చేసుకుని తినవచ్చు)
బ్రెడ్ బజ్జీలు
కావలసిన పదార్ధాలు: బ్రెడ్ స్లిసెస్ - ఐదు (బ్రెడ్‌ని నాలుగ ముక్కలుగా చేసుకోవాలి.) శనగపిండి - కప్పు, ఉప్పు, కారం, వాము, నూనె, కొంచం బియ్యప్పిండి, తినే షోడ.
తయారు చేయు విధానం: శనగపిండిలో ఉప్పు, కారం, వాము, రెండు చెంచాల బియ్యపు పిండి, చిటికెడు తినే షోడ వేసి నీళ్లు పోస్తూ కొంచం జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాండీలో కొంచం ఎక్కువ నూనె పోసి అది వేడెక్కిలోపు బ్రెడ్ చుట్టూ ఉన్న గోధుమ రంగు అంచులను తీసేసి బ్రెడ్‌ని నాలుగు ముక్కలుగా చేసుకుని శనగపిండిలో ముంచి బాగా వేడెక్కిన నూనెలో వేసి, స్టవ్ సిమ్ చేయాలి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత నూనెలోంచి తీసి కొంచం చల్లారాక టమాటో సాస్‌తో తింటే చాలా బావుంటాయి.
బ్రెడ్‌తో స్వీట్
కావలసిన పదార్ధాలు: బ్రెడ్ ముక్కలు - పది( అంచులు తీసేసుకోవాలి), నెయ్యి, ఏలకుల పొడి - ఒక చెంచా, పంచదార.
తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీలో కొంచం ఎక్కువ నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. ఇవి చేస్తుండగానే మరో స్టవ్ మీద మంద పాటి గిన్నె పెట్టి దాంట్లో ఒక కప్పు పంచదార వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి సన్నని సెగ మీద తీగ పాకం రానివ్వాలి. పాకం అవ్వగానే ఏలకుల పొడి వేసి ఒక సారి బాగా కలిపేసి వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఆ పాకంలో ఒక సారి బాగా ముంచి తీసేయాలి. ఇది తినేటప్పుడు అంత తీపి అనిపించదు. స్లైసులుగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా వెరైటీగా ఉన్నాయని ఇష్టంగా తింటారు.