Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీషా బోహ్రా... ప్రస్తుతం అందరి నోటా ఇదే పేరు. గణతంత్ర దినోత్సవం నాడు మొత్తం పురుషులతో కూడిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. రాజ్‌పథ్ పరేడ్‌లో పురుషుల బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ ఈమె. ఆ కుటుంబంలో మూడవ తరం ఆర్మీ ఆఫీసర్ తన ఆలివ్-గ్రీన్ యూనిఫాం, భుజంపై ఉన్న నక్షత్రాల పట్ల ఆమెకున్న ప్రేమ గురించి ఎంతో గర్వంగా చెబుతున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
ఈ ఏడాది జనవరి 15 ఆర్మీ నాడు లెఫ్టినెంట్ మనీషా బోహ్రా మొత్తం పురుషుల ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి అయ్యారు. ఇదే గౌరవం ఆమెకు ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో పునరావృతమయింది. పురుషుల బృందానికి మహిళ నాయకత్వం వహించడం అనేది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరాలకు సాధ్యమయింది. ''నా సీనియర్లు అలా చేయడం నేను చూశాను. ఇప్పుడు నాకు అదే అవకాశం రావడం గర్వకారణం'' అని మనీషా అంటుంది.
మూడవతరం అధికారి
ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని ఖునా బోరా గ్రామానికి చెందిన మనీషా ఆ గ్రామంలో ఆలివ్-గ్రీన్ యూనిఫాం ధరించిన మొదటి మహిళ. ఆ కుటుంబంలో ఈమె మూడవ తరం ఆర్మీ అధికారి. మనీషా తాత ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్లో ఉండి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ చేసారు. ఆమె తండ్రి కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో పని చేసి సుబేదార్‌గా పదవీ విరమణ చేశారు.
నా ప్రయాణం...
మనీషా తన పాఠశాల విద్యను సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఓటీఏ కోసం చెన్నైలో శిక్షణకు వెళ్లే ముందు ఉస్మానియా యూనివర్సిటీ నుండి బయోటెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ కెమిస్ట్రీలో బిఎస్సీ చదివింది. ''దళాలలో చేరే నా ప్రయాణం ప్రేరణతో నిండిపోయింది. నా ఎన్సీసీ రోజుల నుండి నేను మొత్తం ప్రక్రియను ఆస్వాదించాను'' అంటున్న 24 ఏండ్ల ఆమె ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పనిచేస్తుంది. ప్రస్తుతం లేV్‌ాలో బాధ్యతలు చూస్తుంది.
సైన్యంలో చేరడానికి ప్రేరణ
మనీషాకు చిన్నతనం నుండే ఆర్మీ నేపథ్యం ఉంది. ఆమె యూనిఫాంలో ఉన్న మగవారి మధ్య పెరిగినప్పటికీ చిన్నతనంలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు మాత్రమే ఆర్మీ యూనిఫాం ధరించడం చూసింది. ''ఆర్మీ స్కూల్లో చదువుతున్నప్పుడు చాలా మంది అబ్బాయిలు సైన్యంలో చేరడం నేను చూశాను. అది సాయుధ దళాలలో చేరడానికి నా మొదటి ప్రేరణ. ఇందులో స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ నేను ఫౌజీ నేపథ్యం నుండి వచ్చాను. నా పాఠశాల నాకు పురుషులతో సమానమైన అవకాశాలను అందించింది. అక్కడే నేను ప్రేరణ పొందాను. క్రీడలకు వైస్ కెప్టెన్‌గా, నా పాఠశాలకు ఎడిటోరియల్ కెప్టెన్‌గా కూడా ఉన్నాను. ఇవన్నీ నాలో ఆత్మ విశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంచాయి'' అని పాఠశాల, కళాశాలలో అథ్లెటిక్స్‌లో ఉన్న మనీషా చెబుతుంది. తాను కూడా ఓ ఆర్మీ ఆఫీసర్‌గా ఎదుగుతానని చాలా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు చెప్పినట్టు మనీషా గుర్తు చేసుకుంది. ''నేను స్కూల్లో స్పోర్ట్స్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా భుజంపై నక్షత్రాలు వచ్చినప్పుడు నేను చాలా గొప్పగా భావించాను. నా కెరీర్లో నేను విభిన్నంగా చేస్తానని నా తల్లిదండ్రులకు కూడా తెలుసు'' అంటుంది ఆమె.
సైన్యంలో పని ఆగదు
మార్చి 2020లో మనీషా సైన్యంలో చేరిన కొద్ది నెలల్లోనే దేశం కరోనావైరస్ విధించిన లాక్డౌన్లోకి వెళ్లింది. 2019 చివరలో ఆమె మొదటిసారిగా తన యూనిట్‌కి నివేదించినప్పుడు ఇది సాధారణ ప్రక్రియ అని ఆమె గుర్తుచేసుకుంది. అయితే త్వరలో ప్రతిదీ మారిపోయింది. ''అందరిలాగే మేము మాస్కులు ధరించాలి. సామాజిక దూరాన్ని కూడా పాటించాలి. కానీ సైన్యంలో పని ఎప్పుడూ ఆగదు. సిబ్బంది తగ్గిపోవడంతో ఒకేసారి ఎక్కువమందిని పంపలేకపోయాం. పోరాడే సైన్యం తన పనిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు మద్దతును అందించడానికి నా కార్ప్స్ బాధ్యత వహిస్తుంది. వారి ప్రతి అవసరాన్ని మేము చూసుకుంటాము'' అని ఆమె పంచుకుంటుంది.
ఏ రంగంలో పని చేస్తున్నా...
సైన్యంలో పని చేస్తేనే దేశానికి సేవ చేసినట్టు కాదు. ఏ రంగంలో పనిచేస్తున్న ప్రతి పౌరుడిలోనూ ఈ భావన నాటుకుపోవాలని మనీషా అభిప్రాయం. మొట్టమొదట బారాముల్లా తర్వాత జమ్మూ, కాశ్మీర్లో, ఇప్పుడు లడఖ్‌లోని లేV్‌ాలో పోస్ట్‌లో ఉన్న మనీషా మగవారితో భుజం భుజం కలిపి అత్యంత సంఘర్షణ ప్రాంతాలలో దేశానికి సేవ చేయడం గర్వంగా, గౌరవంగా ఉందని చెప్పింది.
మహిళలకు శాశ్వత కమిషన్
2020లో ఆర్మీలోని మహిళా అధికారులను శాశ్వత కమిషన్‌కు అర్హులుగా సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాత మనీషా కృతజ్ఞతతో ఉన్నారు. ''పోటీలో గెలవాలని, తమకూ సమాన అవకాశాలు కావాలని కోరుకునే అనేక మంది మహిళా అధికారుల సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించారు. ''ఇది ఎలాంటి మహిళా రిజర్వేషన్ లేకుండా అందరినీ సమానంగా పరిగణించడం లాంటిది. కాబట్టి మహిళలు ఉన్నత బాధ్యతలను పొందడానికి ఇది గొప్ప అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు మేము సైన్యంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగగలము'' అని మనీషా చెబుతుంది. ఇది మహిళలకు ఉద్యోగ భద్రతను కూడా కల్పిస్తుంది.
మహిళలను మరింత బలోపేతం
గత ఏడాది విడుదల చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం (మెడికల్ విభాగంలోని వారు మినహా) 0.56 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు కాబట్టి, శాశ్వత కమిషన్ ఆమోదం స్వాగతించదగిన చర్య. ఇది సైన్యంలో మహిళల సంఖ్యను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని మనీషా ధృవీకరించారు. ''ప్రస్తుతం సైన్యంలోని కార్ప్స్ కంటే పదాతి దళం లేదా ప్రధాన భూ పోరాట పాత్రలు సంఖ్యలో ఎక్కువగా ఉండగా, మహిళలు కార్ప్స్లో మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పుడు కార్ప్స్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ (సిఎంపి)లో కూడా మహిళా సైనికులు ఉన్నారని మనం చూడవచ్చు. కానీ మనం పురోగమిస్తున్న కొద్దీ మహిళలకు మరిన్ని మార్గాలు తెరుచుకుంటాయన్న నమ్మకం నాకుంది'' అని మనీషా అంటుంది.
పురుషుల బృందానికి నాయకత్వం
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆర్మీ డే పరేడ్‌లో మనీషా పురుషుల ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌ను గొప్ప సంకల్పంతో నడిపించింది. గణతంత్ర దినోత్సవం రోజున కూడా అదే సంకల్పంతో బృందాన్ని నడిపింది. ''నేను ఇంతకు ముందు ఎన్‌సిసిలో భాగమయ్యాను. దీని వలన ఇతర అధికారులతో పోల్చితే దళానికి నాయకత్వం వహించడానికి ఎంపిక కావడం నాకు అదనపు ప్రయోజనాన్ని కలిగించింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ తొమ్మిదేండ్ల తర్వాత రాజ్‌పథ్‌కు తిరిగి వస్తోంది. కాబట్టి నా దళాలు చాలా ఉత్సాహంగా పని చేశాయి. మేము అక్టోబరు నుండి ప్రతిరోజూ కమాండ్, మార్చ్, డ్రిల్ ఉద్యమాన్ని ప్రాక్టీస్ చేసాము. మేము రాజ్‌పథ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాము''అని ఆమె చెప్పింది.
పర్వతారోహణ చేస్తాను
ఆర్మీ అధికారులు వివిధ సాహస కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున మనీషా కూడా పర్వతారోహణ చేయాలనుకుంటుంది. ''నేను సైన్యంలో రెండేండ్లు పూర్తి చేసాను. ఈ సమయం మొత్తం దేశం కరోనా వైరస్ బారిన పడింది. నేను పర్వత ప్రాంతాల నుండి వచ్చాను కాబట్టి కోవిడ్-19 ఉదృతి తగ్గితే పర్వతారోహణ యాత్రను నిర్వహించాలనుకుంటున్నాను'' అంటేంది ఆమె.
ఆర్మీ కేవలం ఉద్యోగం కాదు
పర్వతాలను అధిరోహించడం పక్కన పెడితే మనీషా అతిపెద్ద లక్ష్యం ఆర్మీలో ఉండటం. తన యూనిఫాంలో ఎక్కువ నక్షత్రాలను కలిగి ఉండటం. ''ఎక్కువ నక్షత్రాలు అంటే మరింత బాధ్యత, మరిన్ని సవాళ్లు. ఆర్మీలో ఉండటం కేవలం ఉద్యోగం కాదు. ఇది ఒక జీవన విధానం. నా జీవితమంతా ఆలివ్-గ్రీన్ ధరించి జీవించడానికి ఇష్టపడతాను'' అని మనీషా చెప్పింది.
- సలీమ