Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్వైతేషా బిర్లా... పద్దెనిమిదేండ్ల వయసులోనే నలుగురికీ ఉపయోగపడేలా తన జీవితం ఉండాలనుకుంది. అందుకే అమ్మాయిలకు రుతుస్రావ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తుంది. పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ శానిటరీ ప్యాడ్ల పంపిణీ, ప్యాడ్ల తయారీలో బాలికలకు శిక్షణ ఇవ్వడం దగ్గర నుండి బహిష్టు ఆరోగ్యం, పరిశుభ్రత గురించి విసృతంగా ప్రచారం చేస్తుంది. దీనికోసమే ఆమె 'ఉజాస్' అనే స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించింది. ఆ వివరాలంటే మనమూ తెలుసుకుందాం...
బిర్లా కుటుంబంలోని అతి చిన్న వయస్కురాలు, కుమార్ మంగళం బిర్లా కూతురు అద్వైతేషా బిర్లాకు ఇటీవలే 18 ఏండ్లు నిండాయి. అమ్మాయిలకు రుతుస్రావ శుభ్రతపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 2021లో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (అబెట్) కింద ఉజాస్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. దీని నిర్వహణ మొత్తం ఆమే సొంతంగా చూసుకుంటుంది.
కుటుంబ సభ్యులకు కూడా...
ఉజాస్ ఆధ్వర్యంలో అద్వైతేషా అట్టడుగు స్థాయిలోని అమ్మాయిలకు మరింత అవగాహన కల్పించడం ద్వారా రుతు ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణలో స్థిరమైన మార్పును తీసుకు రావాలనుకుంటుంది. అయితే కేవలం యువతీ యువకులను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ సమస్య చుట్టూ ఉన్న నిషేధాలు, కళంకాలను తొలగించాలని ఉజాస్ లక్ష్యంగా పెట్టుకుంది.
స్వయం సమృద్ధి సాధించేలా
''రుతుస్రావం, పరిశుభ్రత గురించి అవగాహన ప్రారంభించడానికి మేము వయసుకి తగిన వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాము. శానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో లేని వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మేము చేసే ఈ కార్యక్రమాల ద్వారా అమ్మాయిలకు రుతుస్రావ ఆరోగ్యంపై అవగాహన మాత్రమే కాకుండా వారు స్వయం సమృద్ధి సాధించేలా చేయాలి. భవిష్యత్‌లో వారు రుతు ఆరోగ్య నిర్వహణ కోసం మాలాంటి సంస్థలపై ఆధారపడవలసిన అవసరం లేకుండా చూడాలి'' అని ఆమె చెప్పింది. ఉజాస్ యువతులకు వారే సొంతంగా శానిటరీ నాప్కిన్లను తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తుంది. ఇది వారికి సంపాదన మార్గంగా కూడా మారుతుంది. సంస్థ 10,000 మంది బాలికలపై ప్రభావం చూపిందని పేర్కొంది.
ఉజాస్ వెనుక ప్రేరణ
ఈ సంవత్సరం తన పాఠశాల విద్యను పూర్తి చేసుకుని మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న అద్వైతేషా సమాజానికి తనవంతుగా తిరిగి ఇవ్వడానికి తాను ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతానని చెప్పింది. ''మహిళా సాధికారత, లింగ సమానత్వం గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఈ విషయంలో నా తల్లి అబెట్ కూడా నన్ను చాలా ప్రేరేపించింది. కొన్ని అనుభవాలు నాకు రుతుక్రమ ఆరోగ్యం కోసం పని చేయాలనుకునేలా చేశాయి. రుతుస్రావంపై పురాణాలు, కళంకాలు ఈకాలంలో ఉండవని చాలామంది భావిస్తున్నారు. కానీ అవి చాలా ప్రబలంగా ఉన్నాయి. నేను దీని గురించి మరింత పరిశీలించినప్పుడు నన్ను కదిలించిన ఆందోళనకరమైన గణాంకాలను నేను చూశాను. అందుకే నేను ఈ సమస్యపై పని చేయడం చాలా అవసరమని తద్వారా సమాజానికి దోహదపడాలని అనుకున్నాను'' అని ఆమె చెప్పింది.
రుతుస్రావంపై వర్క్‌షాప్‌లు
ఉజాస్ చేపట్టే ప్రాజెక్ట్‌లలో ఒకటి... తల్లులకు రుతుక్రమ ఆరోగ్యం, ఆ సమయంలో వారి బిడ్డలకు వారు అందించగల మద్దతు గురించి వారికి అవగాహన కల్పించడం కోసం వారితో సెషన్లను నిర్వహించడం. ఇది అమ్మాయిలకు సపోర్ట్ సిస్టమ్‌ను అందించడమే కాకుండా సమస్యను మూలాల నుండి పరిష్కారించేందుకు అవసరమైన, సరైన సమాచారాన్ని పొందడంలో వారికి సహాయపడుతుందని అద్వైతేషా అభిప్రాయపడ్డారు.
యువకులను కూడా చేర్చాలి
''మేము కమ్యూనిటీలతో కలిసి పనిచేసినప్పుడు చాలా మంది అమ్మాయిలకు వారి మొదటి రుతుస్రావం వచ్చే వరకు రుతుస్రావం అంటే ఏమిటో కూడా తెలియదని మేము తెలుసుకున్నాము. అది మారాలి'' అని ఆమె అంటుంది. పాఠశాలల్లో రుతుక్రమ ఆరోగ్య వర్క్‌షాప్‌లు కొత్తవి కావు. ఉజాస్ ఈ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది. అయితే వర్క్‌షాప్‌లలో యువకులను కూడా చేర్చాలని ప్రతిపాదించినప్పుడు వాళ్ళు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది'' అంటున్నారు అద్వైతేషా.
అస్సలు అవగాహన లేదు
''నేను మొదట ప్రతిపాదించిన విషయం ఏమిటంటే... రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అబ్బాయిలతో వర్క్‌షాప్ నిర్వహించాలని. కానీ ఈ విషయంలో మాకు సానుకూల స్పందన రాలేదు. దాంతో మేము మొదట బాలికలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాము. దీని తర్వాత అబ్బాయిలతో సెషన్ ఏర్పాటు చేస్తాము. దీనిపై మేము కచ్చితంగా పని చేయాలనుకుంటున్నాము. చిన్నపిల్లలు రుతుస్రావం గురించి అస్సలు ఏమీ తెలియకుండా పెరుగుతారు. ఈ పరిస్థితి మారాలి. ఇది లింగ సమానత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం పాఠశాలలతో సత్సంబంధాలను ఏర్పరచుకున్న తర్వాత బాలికలకు అవగాహన కల్పించాలి. వారికి సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు, పురుషులను చేరుకోవడం సులభం అవుతుంది. చాలా పాఠశాలల్లో దీనికి అంగీకరించరు. కానీ మా ప్రయత్నం మేము చేస్తాము'' అంటున్నారు ఆమె.
ఐదు నెలల్లోనే...
ఉజాస్ ప్రారంభించిన ఐదు నెలల్లోనే 2,00,000 శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేసింది. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణే, అమరావతి, వాషిం, యవత్మాల్, గడ్చిరోలి ప్రాంతాలలో పని చేస్తుంది. అయితే అద్వైతేషా దీనిని భారతదేశం అంతటా తీసుకెళ్లాలని యోచిస్తుంది.
- సలీమ