Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె ఓ మాజీ ఎమ్మెల్యే భార్య... కానీ ఆమెలో ఎలాంటి హంగూఆర్భాటం లేదు. ఓ సాధారణ కార్యకర్తగా వచ్చింది... ఇటీవలె తుర్కయంజాల్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో వాలెంటీర్‌గా పని చేసింది. ఆ సభలకు హాజరైన ప్రతినిధులకు మంచినీరు, టీ అందించింది. ఇలా ఎంతమంది ఉంటారు. ఇది తాను పార్టీ నుండి నేర్చుకున్నానంటుంది. తుదిశ్వాస విడిచే వరకు పార్టీలో ఉండి పేదల కోసం అహర్నిశలు పనిచేసిన తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళతానంటుంది. ఆయన ఎత్తిన జెండాను కడవరకు తన భుజాన మోస్తానంటుంది. ఆమె ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే(సీపీఎం) మస్కు నర్సింహ భార్య మస్కు అరుణ... ఉద్యమ బాటలో ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే...
కందుకూరు మండలం గుమ్మడవెల్లి అమ్లెట్ విలేజ్ కొర్రలగూడ గ్రామంలో పుట్టాను. అమ్మ దేవమ్మ, నాన్న పేరు అంజయ్య. మాది పార్టీ కుటుంబం. ఏడవ తరగతి మధ్యలోనే చదువు మానేశాను. 1989లో నా మేనబావ అయిన నర్సింహతో పెండ్లి జరిగింది. చిన్నవయసు కావడంతో అప్పట్లో పార్టీ గురించి పెద్దగా తెలియదు. నరసింహ మాత్రం చిన్నప్పటి నుండి పార్టీలో పని చేసేవారు. మా పెండ్లయ్యే నాటికి ఎస్ఎఫ్ఐలో ఉండేవారు. పెండ్లి తర్వాత కూడా ఆయన ఎస్ఎఫ్ఐలో బాగా యాక్టివ్‌గా పని చేసేవారు. 'చదువుకుంటే ఏదైన మంచి ఉద్యోగం వస్తుంది కదా.. ఎందుకు ఇవన్నీ' అంటూ అత్తమ్మ ఎప్పుడూ అంటుండేది. కానీ ఆయన మాత్రం పార్టీ కోసం పనిచేసేవారు. మామయ్య పెంటయ్య. ఆయన పార్టీలో ఉన్నారు. భూపోరాటం వంటి ఉద్యమాల్లో బాగా పని చేశారు. మామయ్య ఆయన జీవితాన్ని పార్టీకే అంకితం చేశారు. అత్తమ్మ, నేనూ కూలీ పనులకు వెళుతుండేవాళ్ళం.
పెండ్లయిన మూడోరోజే జైలుకి
పెండ్లయిన కొత్తలో నన్ను కలవర పెట్టిన సంఘటన ఒకటి ఉంది. అదేంటంటే పెండ్లయిన మూడో రోజు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు, బీజెపీ వాళ్ళకు గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో నర్సింహను పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. అప్పుడు ఆయన మూడు నెలలు జైల్లో ఉన్నారు. పెండ్లయిన మూడు రోజులకే ఇలా జరగడంతో చాలా భయం వేసింది. పొలం పనులకు వెళ్ళిన దగ్గర అందరూ అడుగుతుండేవారు. వాళ్ళకు ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడేదాన్ని. కానీ తర్వాత కాలంలో తెలిసింది ఆయన జైలుకు వెళ్ళింది ఓ మంచిపనికోసమని.
ఉద్యమంలో ఇబ్బందులు మర్చిపోయేదాన్ని
ఎస్.ఎఫ్.ఐ, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం, కేవీపీఎస్ ఇలా ఎన్నో సంఘాలలో ఆయన పని చేశారు. పెండ్లి తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. పెండ్లయిన సంవత్సరానికే బాబు పుట్టాడు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి. అయితే పార్టీ, ఐద్వా కార్యక్రమాలకు నేనూ కూడా వెళుతుండేదాన్ని. అక్కడ అందరినీ చూసేసరికి మా ఇబ్బందులన్నీ మర్చిపోయేదాన్ని.
భయం వేసేది
పార్టీ ఎక్కడకి పంపిస్తే అక్కడకు వెళ్ళేవాళ్ళం. పిల్లలిద్దరినీ గవర్నమెంట్ హాస్టల్లో ఉంచి మేము పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. ఇబ్రహింపట్నం పార్టీ ఆఫీసులో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడే ఆఫీసు వెనుక ఓ హత్య జరిగింది. దీంతో రాత్రిపూట ఆఫీసులో ఉండాలంటే భయం వేసేది. ఊరికి వెళ్ళిపోదామని గొడవ చేసేదాన్ని. కానీ ఆయన నాకు ధైర్యం చెప్పేవారు. పార్టీ మనకు అప్పగించిన పని వదిలేసి ఊరికి వెళ్ళి ఉండటం కరెక్టు కాదని నచ్చజెప్పేవారు. కొంత కాలం పార్టీ ఇబ్బందుల్లో ఉండి అలవెన్స్ ఇవ్వలేకపోయింది. దాంతో ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత కొంతకాలం హైదరాబాద్ పంపిస్తే అక్కడ కొన్ని రోజులు ఉన్నాం. 2003లో కందుకూరు పంపించారు.
కమ్యూనిస్టులం ఇలాగే ఉంటాం
ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకు కూలీ పనులకు వెళుతూనే ఉండేదాన్ని. 2004లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా సాధారణ జీవితాన్నే గడిపాము. ఎమ్మెల్యే అనే ఆలోచన ఉండేది కాదు. ప్రజలతోనే ఉండేవాళ్ళం. మా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళందరూర ఎమ్మెల్యే భార్యవి ఇలా అందరిలా ఉంటే ఎలా అనేవారు. ఆయన గెలిచిన తర్వాత మా సొంత పొలంగా పని చేయడానికి వెళితే గన్మెన్లు పరేషన్ అయ్యి అడిగేవాళ్ళు. మా కమ్యూనిస్టు పార్టీలో అందరం ఇలాగే ఉంటామని సమాధనం చెప్పేదాన్ని.
ప్రతి పోరాటంలో ఉన్నాను
2020 జులై 27 ఆయన గుండెజబ్బుతో చనిపోయారు. ఆయన మాతో లేకపోయిన జీవితాంతం పార్టీ కోసమే పని చేయాలనుకుంటున్నాను. అందుకే ఇప్పటికీ కొనసాగుతున్నాను. పేదల కోసం పని చేసే పార్టీలో ఎప్పటికీ ఉంటాను. ఇతర పార్టీలకు కమ్యూనిస్టు పార్టీకి చాలా తేడా వుంది. పెండ్లయినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఆయన చేసే ప్రతి పోరాటంలో నేనూ భాగస్వామిని అయ్యాను. దళితుల సమస్యల పరిష్కారం కోసం కేవీపీఎస్ తరపున సైకిల్ యాత్ర చేస్తే అందులో పాల్గొన్నాను. పార్టీ తరపును జిల్లా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తే అందులో అన్ని రోజులూ పాల్గొన్నాను. ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీ చేస్తున్న కృషి చూస్తున్నాను కాబట్టి ఎంత కష్టం వచ్చినా పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఆశయాలను కొనసాగించాలి. ఆస్తులు అంతస్థుల కంటే ప్రజల కోసం నిబద్ధతో పని చేయడం నాకు బాగా నచ్చింది.
ఎర్రజెండా వదలిపెట్టను
నేను కానీ నా పిల్లలు కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతాము. ఆయన ఎప్పుడూ ఇంట్లో మనం కమ్యూనిస్టులం మామూలు కార్యకర్తల్లాగే ఉండాలి. జీవితాంతం ఎర్రజెండా వదలకూడదు అని చెప్పేవారు. పెద్దబ్బాయి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. చిన్నబ్బాయి చరణ్ ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శిగా పని చేస్తున్నాడు.
మరింత ఉత్సాహం వచ్చింది
పార్టీ రాష్ట్ర మహాసభలు మా రంగారెడ్డి జిల్లాలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ మహాసభల్లో నేనూ, మా చిన్నబ్బాయి ఇద్దరం వాలెంటీర్లుగా పని చేశాము. నన్ను వాలెంటీర్‌గా పని చేయమని అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాను. మహాసభల వాతావరణం చూసిన తర్వాత నాలో మరింత ఉత్సాహం వచ్చింది. ఆయన లేరనే బాధ తప్ప మరే ఇబ్బంది లేదు. మా బావగారి అమ్మాయి కూడా వాలెంటీర్‌గా పని చేసింది. నర్సింహ చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్ మాకు యాభై వేలు వస్తుంది. అందులో 25 వేలు పార్టీ మహాసభలకు ఫండ్‌గా ఇచ్చాను. ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం పార్టీ. కాబట్టి పార్టీకి ఇవ్వడం నా బాధ్యతగా భావించాను. ప్రస్తుతం మహిళాసంఘం(ఐద్వా) రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలిగా పని చేస్తున్నాను. భవిష్యత్‌లో పూర్తికాలం కార్యకర్తగా పని చేస్తాను. పార్టీ ఏ పని అప్పగించినా ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.
- సలీమ