Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగలను ప్రతి ఇంట్లో జరుపుకున్నట్టుగా, ఇప్పుడు ఇంటింటా జ్వరాల పండగ నడుస్తోంది. ఏ ఇంట చూసినా జ్వరంతో పడకేసిన వాళ్ళే. పండక్కి ఇంటిల్లిపాదీ బట్టలు కొనుక్కున్నట్టుగా ఇంటిలోని వారందరూ మందులు కొనుక్కోవాల్సి వస్తుంది. తుమ్ములు, దగ్గులు, ముక్కు కారడం, జ్వరం, ఒళ్ళు నొప్పులు లక్షణాలన్నీ ఒమిక్రాన్ వైరస్‌కు సంబంధించినట్టే ఉన్నాయి. ఇది మామూలు ఫ్లూ లాంటి జ్వరమా లేదా కరోనా వైరస్సా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులకు వాడే 'డోలో' టాబ్లెట్లు 'పోలో' తిమ్మిరి బిళ్ళల కన్నా ఎక్కువగా జనంలోకి పాకిపోయాయి. యాంటీబయోటిక్ అంటే చదువుకున్న వాళ్ళక్కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నోరు తిరగని వాళ్ళు కూడా మందుల షాపుల్లో అడిగి కొనుక్కుంటున్నారు. డాక్టర్లకు కూడా 'ఫలానా సెట్రిజిన్ వాడితే ముక్కు కారణం తగ్గుతుంది కదా! అది రాయండి' అని అడిగే స్థాయికి సాధారణ ప్రజలు వచ్చేశారు. కరోనా వైరస్ ప్రజల్లో మెడికల్ నాలెడ్జ్‌ను పెంచింది. కానీ కరోనా లేకుండా పోతే ప్రజలకు ఇంకా సంతోషం. అప్పటి వరకు మాస్కులు ధరించి క్షేమంగా ఉండండి. కళాత్మకంగా బొమ్మలు సృష్టించండి.
ప్లాస్టిక్ మూతలతో...
ప్లాస్టిక్ సీసాల మూతలతో ఈరోజు కాకిని తయారు చేశాను. ఇంజక్షన్ సీసాలను సీల్ చేస్తూ రంగు రంగుల ప్లాస్టిక్ మూతలు ఉంటాయి. నేను వాటిని సేకరించి పెట్టుకున్నాను. కాకి అనే పేరు పలకగానే కుండలో రాళ్ళేసి నీళ్ళు తాగింది అనే కథ గుర్తుకొస్తుంది. కాకికి ఒకసారి దాహం వేసి చుట్టూ చూస్తే ఒక కుండలో అడుగున ఉన్న నీళ్ళు కనిపించాయి. అప్పుడు కొన్ని రాళ్ళు ఏరుకొచ్చి అందులో వేయటం వలన నీళ్ళు పైకొస్తాయి. అప్పుడు ఆ కాకి ఆ నీళ్ళను తాగి దాహం తీర్చుకున్నది. చిన్నతనంలో ఈ కథను చదవని వాళ్ళు ఉండరు. అందుకనే ఈ కథను గుర్తు చేస్తూ నేనీ బొమ్మను చేశాను. కేవలం కాకి బొమ్మనే కాకుండా కుండ, నీళ్ళు, రాళ్ళు అన్నింటినీ చేశాను. కుండలో రాళ్ళను కూడా పెట్టాను. కాకుల గురించి సాహిత్యంలో ఎన్నో కథలు, పాటలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు ఉన్నాయి. తెలుగువారి సామాజిక జీవనంలో కాకులకు ఎంతో ప్రముఖమైన పాత్ర ఉంది. కాకుల గొంతు గురించి కూడా ఎన్నో కథలున్నాయి. కాకుల గొంతు కర్ణకఠోరమని చెప్తూ ఎంతో మంది కథలు అల్లారు.
ఎక్స్పైరీ మందులతో...
ప్రతి ఇంట్లోనూ ఏవో ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు మందులు వాడటం చూస్తూనే ఉంటాం. సమస్య తీరిపోయాక మిగిలిన మందుల్ని ఓ పక్కన పెడతాము. మరల అవసరానికి పనికొస్తాయని దాస్తాము. కానీ చాలాసార్లు వాటి ఎక్స్పైరీ డేట్ అయిపోయి బటయ పారవేయవలసి వస్తుంది. అలా పారవేసే మందులతో నేను ఈ రోజు కాకమ్మను తయారుచేశాను. బిళ్ళలు, గొట్టాలు రంగురంగుల్లో ఒక దగ్గర చేరి కాకి రూపు సంత రించుకున్నాయి. పూర్వం ఒక కాకి నెమలిని చూచి దానికున్నన్ని రంగులు నాకు లేవే అని బాధపడిందట. ఇక ఇప్పుడా బాధలేదు. ఎందుకంటే రంగురంగుల మందులతో కాకిని తయారు చేశాం కదా! చిన్ననాటి విషయం ఒకటి గుర్తువచ్చింది. నెమలి ఫించాలతో పాటుగా పుస్తకంలో కాకి ఈకలు, కోడి ఈకలు కూడా పెట్టుకుంటే కొన్నాళ్ళకు నెమలీకలై పోతాయని పెట్టుకునేవాళ్ళం. మధ్య మధ్యలో తెరిచి చూసి కొద్దిగా రంగు మారింది కొద్దిగా రంగు రింది చూడు! అనుకుంటూ మురిసేవాళ్ళం. ఈ కాకి శరీరాన్ని కిస్మిస్లతో నింపాను. పాపం తన గొంతు కర్ణకఠోరంగా ఉందని బాధపడుతున్నది కదా! తేనెల కిస్మిస్ల్ని తిని, పొట్ట నిండా నింపుకుని మధురమైన గొంతు వస్తుందేమో చూద్దాం. 'కాకి కర్రలిల్లు కట్టుకుంది, పిచ్చుక పిడకలిల్లు కట్టుకుంది. తుఫానుకు పిడకలిల్లు పడిపోయి కాకిని సహాయం కోరితే చెయ్యలేదు' అంటూ బాల్యంలో కాకుల గురించిన కథలెన్నో చదివాము. కాకి, నక్క రొట్టె కథ కూడా గుర్తుంది కదా! నేను కూడా కాకి కథలు రాశాను.
చింతగింజలతో...
చింతగింజలతో నల్లని కాకి తయారయింది. ఇది ఒక చెట్టు కొమ్మ మీద నిలబడినట్టుగా చిత్రించాను. ఆ కొమ్మ కోసం రేలపూల కాయను వాడుకున్నాను. కాకులు 'కార్విడే' కుటుంబానికి చెందిన కూత పక్షులు. చిలకల్ని, నెమళ్ళని పెంచుకున్నట్టుగా కాకిని ఎవరూ పెంచుకోరు. దీనిని శాస్త్రీయంగా 'కార్వస్' అనీ సంస్కృతంలో 'వాయసం' అనీ అంటారు. పొడుగైన ముక్కు కలిగిన ఆసియా ఖండపు కాకిని 'మాలకాకి' అంటారు. 'కాకీ కాకీ కడవల కాకి, కాకి నోట్లో దీపం పెడితే', అన్న పాట కూడా పిల్లలందరూ పాడుకున్నటువంటి పాటలే. పల్లెటూర్లలో పిల్లలు తినే వస్తువులు తీసుకొని బయటికెళితే చాలు, కాకులు నెత్తిమీద ఒక్కటి తన్ని ఎత్తుకెళ్ళిపోయేవి. అలాగే నేతిగిన్నెలు, చెంచాలు బయట అంట్లలో కనిపిస్తే నోట కరచుకొని పారిపోయేవి. పంచతంత్రంలోని కథల్లో కూడా కాకి చాలా ప్రధానపాత్ర వహించింది. ఎవరైనా లోభిని వర్ణించేటపుడు 'వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు' అనే సామెతను ఉపయోగిస్తారు. అలాగే ఒక్క కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయని వాటి ఐకమత్యాన్ని గురించి గొప్పగా చెబుతారు.
గోధుమపిండితో...
ఈ కాకిని చూశారా..? తెల్లకాకి. ఆల్బుమినిజం వచ్చిన కాకిలా పూర్తిగా తెల్లగా కాదులే గోధుమ రంగులో ఉంది. దీని జననం చాలా విచిత్రంగా జరిగింది. మా చుట్టాలింటికి వెళ్ళినపుడు వాళ్ళ పాప గోధుమపిండి ముద్దతో ఆటలాడుతూ ఉంది. ఏదైనా బొమ్మ చేసియ్యమని నన్ను అడిగితే అనుకోకుండా ఈ కాకి పుట్టింది. నలుగు పిండి వినాయకుడిలా ఈ కాకి ఈ వ్యాసంలో ప్రాణం పోసుకుంది. పూర్వం మన కళ్ళెదుట తిరుగుతూ అంట్ల గిన్నెలలోని మెతుకుల కోసం కావు కావు మంటూ తిరిగే కాకులు ఇప్పుడు మన కండ్లకు కనబడటమే లేదు. ఇవి కూడా అంతరించిపోయే జీవుల లిస్ట్‌లో చేరుతున్నాయి.
చిక్కుడు గింజలతో...
లెగూమినోసి కుటుంబ మొక్కలైన చిక్కుడు మొక్కల గింజలతో నేను కాకిని చేశాను. చిక్కుడు చెట్టుకు కాకిని కాయించాము. మధ్య ఆఫ్రికాలో 'కార్వస్ ఆల్బమ్' అనే జాతి కాకులు జీవిస్తాయి. ఉత్తర అమెరికా, తూర్పు యూరోప్ లలో కార్వసÊ కార్నిక్స్' అనే కాకులు ఉంటాయి. కాకులు ఇతర జంతు వులతో సహవాసం చేస్తాయి. ఆవులు, ఎద్దులు వంటివాటి మీద ఎక్కి కూర్చుని ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. అలాగే వాటి శరీరం మీద ఉండే పురుగులను ఏరుకుని తింటాయి. రెండు జంతువులూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. 'ఎద్దు పుండు కాకికి ముద్దు' అనే సామెత రైతుల నోట ఎక్కువగా వినిపిస్తుంది. వీటి జీవిత కాలం పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటుంది. కాకుల మాంసం తినే వాళ్ళు కూడా ఉన్నారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్