Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చారిత్రాత్మక నావికా సాగర్ పరిక్రమ మిషన్‌లో భాగమైన భారత నావికాదళ మాజీ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి... సాయుధ దళాలలో చేరిన దశాబ్దంలోనే నౌకాదళ అధికారి హోదాను సాధించారు. 2018లో గ్యాలంట్రీ నావో సేన పతకాన్ని అందుకున్న మొదటి మహిళా నావికాదళ అధికారులలో ఆమె ఒకరు. 254 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన భారత నౌకాదళ నౌక తారిణి... నావికా సాగర్ పరిక్రమ మిషన్‌లో మొత్తం మహిళా సిబ్బందిలో భాగమైనందుకు నారీ శక్తి పురస్కారం, టెన్జింగ్ నార్గే అవార్డులను అందుకున్నారు. ఇటీవలే ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఈ సందర్భంగా నావికాదళంతో తన ప్రయాణం, శాశ్వత కమిషన్ కోసం దరఖాస్తు చేయడం... ఇలా ఎన్నింటినో ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె పంచుకున్న ఆ స్ఫూర్తిదాయక విషయాలేంటో మనమూ తెలుసుకుందాం...
హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య 2011లో భారత నౌకాదళంలో చేరారు. నౌకాదళ నిర్మాణం, యుద్ధనౌకల నిర్వహణ, ఎన్ఎస్పి కి సంబంధించిన పాసేజ్ ప్లానింగ్‌తో సహా అనేక విభాగాలలో ఆమె పనిచేశారు. జూన్ 2021లో పర్మినెంట్ కమిషన్ కోసం రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
నౌకాదళంలో చేరడం
ఎప్పటి నుంచో ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావాలనుకునే ఐశ్వర్య.. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివారు. చదువు పూర్తి చేసిన తర్వాత మహిళా మెటలర్జికల్ ఇంజనీర్లందరూ ఫీల్డ్‌వర్క్‌లో పాల్గొంటున్నందున వారికి ఉద్యోగాలు అందుబాటులో లేవని ఆమె గ్రహించింది. ఆ సయంలోనే వార్తాపత్రికలో ఒక ప్రకటన వచ్చింది. భారతీయ నావికాదళం పురుష, స్త్రీ అభ్యర్థుల కోసం వెతుకుతోంది. దానికి ఆమె కూడా దరఖాస్తు చేసి అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిందింది. 2011లో భారత నౌకాదళంలో చేరింది. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇప్పటికీ సవాలుగా ఉన్నప్పటికీ సాయుధ దళాలలోకి ప్రవేశించడం మాత్రం కాస్త సులభమైంది. దీని గురించి ఐశ్వర్య మాట్లాడుతూ తన బ్యాచ్‌లో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉన్నారని, మొత్తం 256 మంది అధికారులలో 70 మంది మహిళలని చెప్పారు.
సముద్రయానం తెరవెనుక
2016లో నావికా సాగర్ పరిక్రమ మిషన్‌లో భాగంగా ఐశ్వర్య ఎంపికయ్యారు. ఈ ప్రయాణంలో నౌకాదళ అధికారులు ఐదు దేశాలను తాకి, రెండుసార్లు భూమధ్యరేఖను దాటారు. నాలుగు ఖండాలు, మూడు మహాసముద్రాల మీదుగా ప్రయాణించారు. సెప్టెంబర్ 2017 నుండి మే 2018 వరకు ఎనిమిది నెలల్లో 21,600 నాటికల్ మైళ్లను పూర్తి చేశారు. ''మేము గొప్ప యాత్రలో ఉన్నామని ప్రజలు అనుకున్నారు. కానీ మేము అక్కడ పడిన కష్టాలను ఎవరూ గమనించలేదు. చాలా విషయాల్లో ఒత్తిడికి గురయ్యాం. దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి వెళ్ళిన పడవ బోల్తా పడడం పట్ల మేం చాలా ఆందోళన చెందాం. అయితే మా ప్రయాణంలో ఓడిపోకూడదని మేము నిర్ణయించుకున్నాము'' అని చెప్పారు.
మాపై ఒత్తిడి పెరిగింది
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా తమను తాము నిరూపించుకోవాలని, మిషన్‌ను విజయవంతం చేయాలని ఒత్తిడి పెరిగింది. దాని గురించి ఆలోచిస్తూ, ఐశ్వర్య తాను కోరుకున్నంతగా సముద్రయానాన్ని ఆస్వాదించలేకపోయానని చెప్పారు. ఐశ్వర్యతో పాటు వెళ్ళిన తర సిబ్బంది లెఫ్టినెంట్ కమాండర్లు వర్తికా జోషి, కెప్టెన్ ప్రతిభా జమ్వాల్, పి స్వాతి, లెఫ్టినెంట్లు విజయ దేవి, పాయల్ గుప్తాలకు అప్పటికే సెయిలింగ్ గురించి బాగా తెలుసు, అయితే ఇది ఐశ్వర్యకు తొలి ప్రయాణం.
అమ్మాయిలు అర్హులు కారా..?
ఐశ్వర్య నావికాదళ అధికారిగా గొప్ప ఎత్తులను సాధించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళుతున్నప్పటికీ అడుగడుగునా లింగ వివక్ష ఆమెను వెంటాడుతూనే ఉంది. భూగోళాన్ని చుట్టాలంటే మగవారై ఉండాలనే ఆలోచన సరైనది కాదని ఆమె భావిస్తున్నారు. ఎన్ఎస్పి సిబ్బందిని శౌర్య పతకం కోసం ఎంపిక చేసే సమయంలో విచ్చలవిడి వ్యాఖ్యలు చేసిన సందర్భం గురించి ఆమె మాట్లాడుతూ ''సాహస కార్యకలాపానికి ఎవరు శౌర్య పతకాన్ని ఇస్తారు. ఈ అమ్మాయిలు దానికి అర్హులు కారు వంటి ప్రకటనలు నేను విన్నాను'' అన్నారు ఆమె.
లింగ ఆధారంగా నిర్ణయిస్తారు
''మేము ఎన్ఎస్పి మిషన్‌కు వెళ్లినప్పుడు మా ఆరుగురి గురించి దేశానికి తెలుసు. అయితే మహిళా అధికారులు తమ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. అధికారులందరూ దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నారు. కానీ మహిళా అధికారులకు పదవులు వారి నిబద్ధత లింగ ఆధారంగా నిర్ణయించబడుతుంది. స్త్రీలకు పిల్లలు ఉంటే వారి నిబద్ధతపై అంచనా వేయడాన్ని నేను గమనించాను. అదే తండ్రి నేవీలో ఉన్నప్పుడు అతని పని నిబద్ధతపై ఎలాంటి ఇతర ఆలోచనలు ఉండవు. అయితే సమాన అవకాశం మా హక్కు. మేము దానికి అర్హులం'' అని ఐశ్వర్య నొక్కిచెప్పారు.
నేవీలో కొనసాగేందుకు పోరాటం
మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేసే అవకాశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి తాను త్వరగా పదవీ విరమణ చేయవలసి ఉంటుందని ఐశ్వర్య ఎప్పుడూ అనుకోలేదు. 2019లో ఆమె ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పర్మనెంట్ కమిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత మళ్లీ 2020లో చేశారు. ''నేవీలో ఏడేండ్ల తర్వాత గరిష్టంగా రెండు సార్లు పర్మినెంట్ కమీషన్ మంజూరు చేయడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కానీ రెండు సార్లు మెరిట్లో తక్కువగా ఉన్నాననే కారణంతో నా దరఖాస్తు తిరస్కరించబడింది'' అని నవో సేన మెడల్ హోల్డర్ చెప్పారు. ''మెరిట్ అంటే ఏమిటి. ఒకరు ఎక్కడ తగ్గుతున్నారో స్పష్టమైన సూచన లేదు. మా బ్యాచ్‌లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే శౌర్య పతకం కలిగి ఉన్నారు. వారిలో నేను మాత్రమే శాశ్వత కమీషన్ కోసం సిద్ధంగా ఉన్నాను'' అని ఆమె అంటున్నారు. తిరస్కరణకు గురైన తర్వాత ఆమె నావికాదళంలో తన కెరీర్లో సాధించినవన్నీ ప్రస్తావిస్తూ నేవల్ చీఫ్‌కి లేఖ రాశారు.
ఏదైనా చేయగలను
''నేను పోరాటం చేస్తే అది నాకు వ్యతిరేకంగా ఉంటుందని నాకు తెలుసు. 10 సంవత్సరాల షార్ట్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత 2021లో నా బాధ్యతల నుండి తప్పుకోవాలని నిర్ణయించు కున్నాను. నేను నా సొంతంగా ఏదైనా చేయగలనని నాకు తెలుసు'' అంటూ వెల్స్ ఫార్గోలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రోల్ ఆఫీసర్‌గా చేరిన ఐశ్వర్య చెప్పారు.
పోరాటం చేస్తూనే ఉంటారు
సెప్టెంబర్ 2021లో సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత సాయుధ దళాల్లోకి రిక్రూట్మెంట్ కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళల ప్రవేశాన్ని కేంద్రం అనుమతించింది. ఇది శాశ్వత కమిషన్‌కు మార్గం సుగమం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఐశ్వర్య హర్షం వ్యక్తం చేశారు. ''మంచి కోసం కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఆ త్యాగం చేసేది నేనే అయితే దాన్ని ఆనందంగా తీసుకుంటాను. అయితే ఎస్సీ తీర్పును ఆమోదించినప్పటికీ, మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడానికి అర్హులైనప్పటికీ వారు లింగం ఆధారంగా తీర్పు పొందుతున్నారు. అందుకే సాయుధ దళాలలోని ప్రతి మహిళ తన వ్యక్తిగత పోరాటంలో కొనసాగుతూనే ఉంటుంది'' అని ఆమె అంటున్నారు. ఐశ్వర్య తన విషయంలో శాశ్వత కమిషన్ మంజూరు చేసే విధానం పారదర్శకంగా లేదని, కనీసం అది తన జూనియర్లకు మారాలని రిటైర్మెంట్ తీసుకునే ముందు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తగినంత ప్రాతినిధ్యం ఎక్కడ..?
రక్షణ మంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పిన ప్రకారం ఇతర రెండు సేవలతో పోలిస్తే భారత నౌకాదళం అత్యధిక శాతం (6.5 మహిళలను కలిగి ఉంది. భారత సైన్యం, భారత వైమానిక దళంలో మహిళల శాతం వరుసగా 0.56, 1.08శాతంగా ఉంది. మహిళలను అన్ని పాత్రలలో అనుమతించనంత కాలం ముఖ్యంగా సైనికుల స్థాయిలో వారు తక్కువ ప్రాతినిధ్యం వహిస్తారని ఐశ్వర్య నొక్కిచెప్పారు. సాయుధ దళాలలో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలను బాగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆమె జతచేస్తున్నారు.
ప్రచారం చేయాలి
''సాయుధ దళాల్లో కూడా మహిళలకు కెరీర్ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కొన్ని పాఠశాలల్లో ప్రారంభమైంది. అయితే తమను తాము నావికాదళ అధికారులు లేదా ఫైటర్ పైలట్లుగా ఊహించుకోవడం పిల్లలకు ఇప్పటికీ కష్టంగా ఉంది. ఇప్పుడు నేను పదవీ విరమణ చేశాను. కాబట్టి పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళి ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. తద్వారా పిల్లలతో నేను నా కథను పంచుకుంటాను. వారు కూడా సాయుధ దళాలలో ధైర్యంగా చేరవచ్చని పిల్లలకు చెప్తాను'' అని ఆమె చెప్పారు.
మహిళలు కూడా చేయగలరు
ఐశ్వర్య ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ సాయుధ దళాలలో పనిచేయాలి. ''మీ దేశానికి సేవ చేసే అవకాశం కంటే గొప్పది మరొకటి లేదు. ఇంత పెద్ద వేదికపై నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. మేము మా యాత్రను పూర్తి చేయడం ద్వారా మహిళలు కూడా దీన్ని చేయగలరని మేము నిరూపించగలము'' ఆమె సగర్వంగా చెబుతున్నారు.
- సలీమ