Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వహీదా రెహమాన్ తెలుగులో 'రోజులు మారాయి' చిత్రంలో 'ఏరువాక సాగారో' పాటలో కనిపించి తర్వాత హిందీ చిత్ర రంగంలో ప్రవేశించింది. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి అగ్ర నటీమణుల స్థాయికి ఎదిగి 'గైడ్' చిత్రంలో అతి క్లిష్టమయిన 'రొజీ' పాత్ర పోషించి అందరి ప్రశంసలు పొందింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 200కు పైగా చిత్రాలలో నటించి భారతదేశపు ఉన్నత శ్రేణి నటీమణుల్లో ఒకరిగా వెలుగొందారు. ఈ నటి నటనా కౌశలంకి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. ఫిబ్రవరి 3న ఆమె 84వ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత పరిచయం ''మానవి'' పాఠకుల కోసం .
వహీదా రెహమాన్ 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో పుట్టారు. ముంతాజ్ బేగం, మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ దంపతులకు జహీదా, షహీదా, సయిదా తర్వాత నాలుగవ సంతానంగా వహిదా జన్మించింది. అబ్దుల్ రెహమాన్ అభ్యుదయ భావాలు వున్న వ్యక్తి. ఆయన మద్రాసులో కమిషనర్‌గా ఉద్యోగం చేసేవాడు. ఆయన ఉద్యోగ రీత్యా తమిళనాడుతో పాటు కేరళ తదితర ప్రాంతాలలో పని చేస్తూ, తెలుగు నేల రాజమండ్రి, విశాఖపట్టణంలలో సైతం పనిచేశారు. రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వహీదా అక్కడ శ్రీరాంచంద్రన్ అనే నాట్యాచార్యుడి వద్ద అక్క సయిదాతో కలసి నృత్యం నేర్చుకుంది. రాజమండ్రి నుండి విశాఖపట్నం బదలీ అయిన తర్వాత ఒకరోజు అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ విశాఖపట్నం పర్యటనకు వచ్చినపుడు ఈ అక్కాచెల్లెలిద్దరు కలసి తొలిసారి స్టేజ్‌పై డాన్స్ చేశారు. అక్కడ వహిదా 'సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్'లో చదువుకోవడంతో తెలుగు బాషను నేర్చుకునే అవకాశం ఏర్పడింది. వహిదా పదమూడేండ్లున్నపుడు 1951లో నాన్న అబ్దుల్ రెహమాన్ హఠాత్తుగా చనిపోవడంతో హృద్రోగి అయిన తల్లి కుటుంబ బాధ్యతలు మోయడానికి నానా కష్టాలు పడింది. అయితే అప్పటికే వహిదా ఇద్దరక్కల పెండిండ్లులు అయిపోవడంతో తల్లికి ఆర్థికంగా అండగా ఉండేందుకు సయిదా, వహిదా ఇద్దరు నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు.
సినీరంగ ప్రవేశం
ఏడు దశాబ్దాల కిందట తెలుగు తెరపై అరంగ్రేటం చేసిన వహిదా అనతి కాలంలోనే హిందీ చిత్రాలలో నటించి ఉత్తరాది ప్రేక్షకులను అలరించింది. 'కన్యాదానం' చిత్రంలో డాన్స్ చేసే పాత్రలో తొలిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందు నిలిచింది. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత 'జయసింహ' చిత్రంలో ఎన్.టి.ఆర్ సరసన నటించడంతో సినీ పరిశ్రమలో అందరి దృష్టి వహిదాపై పడింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే 'రోజులు మారాయి' చిత్రంలో ''ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'' పాటకి నర్తించి గొప్ప గుర్తింపును పొందింది. ఈ ఒక్క పాట కోసమే సినిమాను చూసిన వాళ్ళూ ఉన్నారు.
గురుదత్తో హిందీ చిత్రసీమలోకి
హైదరాబాద్‌లో 'రోజులు మారాయి' వంద రోజుల వేడుక జరిగింది. ఆ వేడుకలలో డాన్స్ చేసిన వహీదాను గురుదత్ మొదటిసారి చూశారు. వహీదాకు ఉర్దూ కూడా బాగా మాట్లాడడం వచ్చని తెలుసుకున్న గురుదత్ ఆమెని హిందీ చిత్రసీమకు పరిచయం చేయాలనుకుని, దేవానంద్ కథానాయకుడిగా తెరకెక్కించిన తన 'సి.ఐ.డి.' చిత్రంలో రెండవ హీరోయిన్గా ఆమెకు అవకాశమిచ్చారు. ఇందులో నటించిన దేవానంద్‌తో వహీదాకు మంచి స్నేహం ఏర్పడింది. 'సి.ఐ.డి.' చిత్రం బాక్సాపీస్ వద్ద హిట్ సాదించడంతో.. వహీదాలోని నటిని గురుదత్ ఎంతగానో ప్రోత్సహించారు. వహీదా కథానాయికగా 'ప్యాసా' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల అయ్యాక ఘన విజయం సాదించింది. ఒకే సంవత్సరం 'సి.ఐ.డి.', 'ప్యాసా', రెండు చిత్రాలు విజయవంతం కావడంతో వహీదా రెహమాన్ తారపథంలోకి దూసుకెళ్లింది. అయితే వహీదా ఈ ఆనందంలో ఉండాగానే తల్లి మరణించడం, మూడో అక్క సయిదా పెండ్లయి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఈ తరణంలోనే దేవానంద్ వహీదాను ఓదార్చి మనోదైర్యం కలిగించారు. ఆ తర్వాత వహీదా రెహమాన్ అనేక విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు. దేవ్ ఆనంద్‌తో కలిసి వహీదా అత్యధికంగా ఏడు సినిమాలలో నటించింది. వీటిలో ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాదించాయి. ఆమె కెరీర్లో ఘన విజయం సాదించిన 'ఖామోషి' చిత్రంలో రాజేష్ ఖన్నా సరసన నటించింది. రాజేంద్ర కుమార్‌తో ఆమె చేసిన 3 సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. కమల్ జిత్ సింగ్‌తో కలిసి వహిదా 1964లో 'షాగూన్' చిత్రంలో నటించగా, ఈ చిత్రం పరాజయం చెందింది. అయితే ఈ చిత్రనిర్మాణ సమయంలో వీరిద్దరి మద్య చిగురించిన ప్రేమ 1974 లో వివాహం వరకు సాగింది. 1971లో సంజీవ కుమార్ సరసన నటించిన మన్ మందిర్ చిత్రం ఆమె ప్రధాన కథానాయికగా నటించిన చివరి హిట్ చిత్రం. వహీదా రెహ్మాన్ 1959-64 మధ్యకాలంలో అత్యధిక పారితోషికం పొందిన నటిగా మూడవ స్థానంలో, 1966-1969 మధ్య కాలంలో నందా, నూతన్లతో కలిసి రెండవ అత్యధిక పారితోషికం పొందిన నటిగా నిలిచింది.
తెలుగు సినిమాలలో...
వహిదా రెహమాన్ తెలుగు తెరపై దర్శక, నిర్మాత విఠలాచార్య రూపొందించిన 'కన్యాదానం' చిత్రంలో డాన్స్ చేసే పాత్రలో తొలిసారి నటించింది. ఆ తరువాత యన్టీఆర్ సొంత సంస్థ ఎన్.ఏ.టి. పతాకంపై ఓ భారీ జానపదం తీయాలని యన్టీఆర్, ఆయన మిత్రులు భావించారు. అందుకు 'జయసింహ' కథ సిద్ధం చేసుకున్నారు. అందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకున్నారు. రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని నటింప చేయాలన్నది యన్టీఆర్, ఆయన దర్శకుడు డి.యోగానంద్ భావన. అలా యన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, ఆయన మిత్రులు కలసి వహిదా రెహమాన్ గురించి తెలుసుకొని, ఆమెను తమ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు. ఈ లోగా వహిదా రెహమాన్ నృత్యం గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య తమ 'రోజులు మారాయి'లో కొసరాజు రాసిన ''ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా...'' పాటలో నర్తించడానికి వహిదాను ఎంపిక చేసుకున్నారు. అలా వహిదా రెహమాన్ 'రోజులు మారాయి' చిత్రంలో తళుక్కుమన్నారు. తరువాత నాయికగా 'జయసింహ'లో జనం మదిని దోచుకున్నారు. ఎన్టీఆర్, భానుమతి నటించిన రంగుల చిత్రం 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రంలోనూ ఓ నృత్యగీతంలో మురిపించారు. చాలా రోజుల తరువాత 'రోజులు మారాయి' హీరో అక్కినేని నటించిన 'బంగారు కలలు'లో ఆయనకు సోదరిగా నటించారు. ఆ తరువాత 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన 'సింహాసనం'లో రాజమాతగా అభినయించారు. ఆ తర్వాత 2006లో సిద్ధార్థ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన ''చుక్కల్లో చంద్రుడు'' చిత్రంలో గ్రాండ్ మదర్‌గా నటించారు. కమల హాసన్ హీరోగా రూపొందిన విశ్వరూపం 2 చిత్రంలో నటించింది.
కమల్జిత్తో వివాహం
వహిదా రెహమాన్ 1968లో తనతో 'షగున్'లో హీరోగా నటించిన పంజాబీ, వ్యాపారవేత్త అయిన 'కమల్ జీత్'ను ఏప్రిల్ 27, 1974న వివాహమాడారు. వివాహం తరవాత బెంగుళూరులోని కమల్ ఫామ్‌హౌస్‌కి మారారు. కొన్నాళ్ళకి వారికి 'సోహైల్' అనే కుమారుడు, 'కష్వి' అనే కుమార్తె జన్మించారు. కమల్జిత్ అనారోగ్యం పాలైనప్పుడు, వారు బాంబేలోని ఓషన్-వ్యూ బంగ్లాకు తిరిగి వచ్చారు. కమల్జిత్ నవంబర్ 21, 2000న కన్నుమూశారు. కుమారుడు సోహైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తుండగా, కష్వి జ్యువెలరీ డిజైనర్‌గా స్థిర పడ్డారు. వహిదా రెహమాన్ తన భర్త మరణం తర్వాత పిల్లలతో పాటే ఉంటూ 7 చిత్రాలలో నటించింది. 84 ఏండ్లు నిండినా ఇప్పటికీ హుషారుగా ఉండే వహిదా రెహమాన్, తన తరం తారలయిన నందా, ఆషా పరేఖ్, హెలెన్‌తో కలసి 'దిల్ చాV్‌ా తా హై' అంటూ అండమాన్, నికోబార్ దీవుల్లో బోటింగ్ చేసిన పిక్స్ అభిమానులను అలరించాయి.
వహీదా పొందిన పురస్కారాలు
1965లో 'గైడ్'లో తన పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర నటి అవార్డును పొందింది. 1968 లో నీల్ కమల్ చిత్రం లోని నటనకు ఫిలింఫేర్ ఉత్త్మ నటి అవార్టు, 1967 లో ''తీస్రీ కసమ్'' చిత్రానికి బెంగాలీ జర్నలిష్టు అసోసియేషన్ ఉత్తమనటి అవార్డు, 1971లో వచ్చిన 'రేష్మా ఔర్ షేరా' చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు వహిదా రెహమాన్. 1972లో భారత ప్రభుత్వంచే 'పద్మశ్రీ', 2011లో 'పద్మభూషణ్' అందుకున్నారు వహిదా. 1994 లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవమెంట్ అవార్డు, 2011 లో ఐ.ఐ.ఎఫ్.ఎ లైఫ్ టైమ్ అచీవమెంట్ అవార్డు, 2006 లో తన తొలిహీరో యన్టీఆర్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంచే యన్టీఆర్ జాతీయ అవార్డును, 2012 లో ముంబయి ఫిల్ం ఫెస్టివల్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు, 2013 లో సెంటెనరీ అవార్డు, ఇండియన్ ఫిలిం పెర్సనాలిటీ పురస్కారం, 2020లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి రాష్ట్రీయ కిషోర్ కుమార్ సమ్మాన్ పురస్కారాన్ని పొందారు. వహీదా రెహమాన్ బచ్చన్ కుటుంబంలోని ముగ్గురు నటులకు తల్లిగా నటించింది. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్. అమితాబ్ బచ్చన్‌కి తల్లిగా, ప్రేమికుడిగా నటించింది. 1976 లో 'అదాలత్', 'బిగ్ బి', 1978లో 'త్రిశూల్' చిత్రంలో తల్లి పాత్రను పోషించింది.
డాక్టర్ కావాలని కలలు కన్నది
వహిదా డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసికంగా, ఆర్థికంగా, తన తల్లి అనారోగ్యంతో వహీదా తన లక్ష్యాన్ని వదులుకున్నారు. ఐదేండ్ల వయసులో ఉన్నపుడు అనారోగ్యం కారణంగా స్కూల్‌కి వెళ్ళేది కాదు. ఇంట్లో ఎవరికి ఏ చిన్న జబ్బు చేసినా తనకు తెలిసిన వంటింటి వైద్యం చేసేది. ఒకసారి వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి తలనొప్పితో భాద పడుతుంటే కొబ్బరి నూనెలో టాల్కమ్ పౌడర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసి కణతలకు రుద్దుకొమ్మని చెప్పింది. అతను అలాగే చేయడంతో మరుసటి రోజుకల్లా తలనొప్పి తగ్గిపోయిందట. వహీదా పెద్దయిన వైద్యం పిచ్చి తగ్గలేదు. అప్పట్లో వచ్చే ''హమ్ దర్ధ్ దవాఖాన'' పత్రికలో వచ్చే చిట్కాలన్నీ నేర్చుకుని ప్రయెగాలు చేసేది.
- పొన్నం రవిచంద్ర, 9440077499.