Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజీలైఫ్ కారణంగా ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అధికంగా ఉంటోంది. అందుకే నిద్ర కూడా సరిగా పోవడం లేదు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు, కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్ర పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. అలా నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలో ఇపుడు తెలుసుకుందాం..
ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు, బెడ్ రూం లైటింగ్, దుప్పట్లు లాంటివి మీకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
నిద్ర రావడానికి కూడా ఓ చక్కని టీ వచ్చింది. అదే బనానా టీ. అరటిపండుతో ఈజీగా చేసుకొనే ఈ టీని రాత్రి పడుకునే ముందు తాగితే చాలు.. మీరు కంటినిండా నిద్ర పోవచ్చు.
గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.
రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది.
నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.