Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేళకు ఆహారం తినకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలోగానీ, తినే సమయంగాని.. సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.
ఆహార నియమాలు: డైట్ పేరుతో కొన్ని రకాల ఆహారపదార్థాలు మానెయ్యడం లేదా పూర్తిగా కడుపు మాడ్చుకోవడం, డిటాక్స్ పేరుతో రకరకాల పానీయాలు సేవించి పోషకాహారం మానెయ్యడం తదితర ప్రయత్నాల కంటే సరైన పాళ్ళలో పోషకాహారాన్ని తీసుకుంటే నెమ్మదిగానైనా మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. మీ వయసు, ఎత్తును బట్టి ముందుగా ఎంత బరువు ఉండాలో చూసుకోండి. ఆహారనియమాలు, శారీరక వ్యాయామం ద్వారా నెలకు రెండు నుంచి మూడు కేజీల బరువు ఆరోగ్యకరంగా తగ్గవచ్చు. రోజూ సరైన సమయానికి ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకోండి.
తగిన మోతాదులో: పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పప్పు లేదా గుడ్లు తప్పనిసరి. వెన్న తీసిన పాలు, పెరుగు కూడా బరువు నియంత్రణకు చాలా ఉపయోగపడతాయి. ఆకలైనప్పుడు మాత్రమే తినడం, కడుపు నిండా కాకుండా తగిన మోతాదులోనే ఆహారం తీసుకోవడం మంచిది. స్నాక్స్ కూడా ఆరోగ్యకరమైనవై ఉండాలి.
పోషకాలు ఎక్కువ: పండ్లు, వేయించిన బఠాణీలు, సెనగలు, మొలకెత్తిన గింజలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటే తక్కువ కెలోరీల్లోనే ఎక్కువ పోషక పదార్థాలు లభిస్తాయి. నిద్ర పోయేందుకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందుగా రాత్రి భోజనాన్ని ముగించాలి. వీటితో పాటు శారీరక వ్యాయామాన్ని చెయ్యాలి. వీటన్నిటి వల్లా శక్తి మెరుగు పడుతుంది. ఉత్సాహంగా ఉంటారు. చర్మం మంచి మెరుపును సంతరించు కుంటుంది