Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో వైద్యులంతా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ తెలివిగా ఆలోచిస్తోంది. సాధారణ ప్రజల్ని పీడిస్తుంటే వారికి వైద్యులు చికిత్స చేసి నయం చేస్తున్నారు. వైద్యులలోనే ప్రవేశిస్తే వారెట్లా వచ్చి వైద్యం చేస్తారు? అనుకుని మెడికల్ కాలేజీల మీద దాడి చేసింది కరోనా. వందల మంది వైద్యులు క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యం చేసేందుకు ఎవరూ లేక క్వారంటైన్లో ఉన్న వైద్యుల్ని డ్యూటీ చేయమంటున్నారు. ఎక్కువ సమస్యలు లేని వైద్యులతో కరోనా బాధితులకు వైద్యం చేయిస్తున్నారు. ఒళ్ళు నొప్పులు, జ్వరం, తుమ్ములు, దగ్గులతో బాధ పడుతూ కూడా ఆసుపత్రులలో డ్యూటీలు చేస్తున్నారు. మామూలు ప్రజలు ఇవే లక్షణాలతో మంచమెక్కి పది రోజులు విశ్రాంతి తీసుకుంటే వైద్యులు మాత్రం రాత్రింబగళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రులన్నింటిలోనూ ఎమర్జెన్సీ సర్వీస్ ఇవ్వటానికి కూడా వైద్యులు లేకుండా పోయారు. కరోనా మాయ చూశారా? పాజిటివ్‌లో ఉండి కూడా వైద్యులు సేవ చేస్తూ కరోనా తెలివిని తిప్పి కొట్టారు. వైద్యులారా వందనాలు. మీ కార్యదీక్షకు, సేవా తత్పరతకు వేలవేల వందనాలు.
వాల్‌నట్‌లతో...
ఈరోజు మెదడును అంశంగా తీసుకొని బొమ్మలు చేస్తున్నాను. శరీరాన్నంతటినీ తన ఆజ్ఞలతో అదుపులపో పెట్టుకునే మెదడు గురించి తెలుసుకుందాం! ఎక్కువ పోషకాలు, ప్రోటీన్లు ఉన్న వాల్నట్లు గుండ్రని కాయల్లా ఉంటాయి. ఇందులో ఒకే విత్తనం ఉంటుంది. వాల్నట్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు తమ ఆహారంలో ఎక్కువగా డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటారు. వాల్నట్లు ఎక్కువగా చైనా, ఇరాన్, అమెరికాలలో ఎక్కువగా పండుతాయి. ఉత్తర అమెరికా వీటి జన్మస్థలం. కాయ లోపల ముడతలు పడిన రెండు బద్దలుగా ఉండే వాల్నట్ విత్తనం ఉంటుంది. విత్తనాలను అలాగే కానీ, వేయించి కానీ తింటారు. 30 గ్రా.ల వాల్నట్లలో 200 కాలరీల శక్తి వస్తుంది. 3.89 గ్రాముల కార్బోహైడ్రెట్లు, 20 గ్రాముల కొవ్వులు, 5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అత్యధిక శక్తినిచ్చే వాల్‌నట్‌లతో ఆజ్ఞలిచ్చే మెదడును తయారు చేశాను. మెదడు మనుగడను పెంచాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం! నాడీ వ్యవస్థకు కేంద్రంగా పనిచేసే అవయవం మెదడు. చాలా సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. మెదడు రెండు అర్థ భాగాలుగా విడగొట్టబడి, అనేక ముడతలతో ముడుచుకున్న మెత్తని పదార్థం. గట్టి ఎముకలతో నిర్మించబడిన పుర్రె లోపల ఈ మెదడు నిక్షిప్తమై ఉంటుంది. వాల్నట్ కూడా సరిగ్గా ఇలాంటి ఆకారంతోనే ఉంటుంది. అందుకే వాల్నట్లను ఉపయోగించి మెదడును తయారు చేశాను.
జీడిపప్పుతో...
ఎండు ఫలాలలో మరొక రకమైన జీడిపప్పుతో మెదడును తయారు చేశాను. పండ్లు, ఫలాలు, కాయగూరలు, గింజలు, పప్పులు వంటి ప్రకృతి ప్రసాదితాలు మానవుడి శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ అందిస్తాయి. జీడిమామిడి అనే పెద్ద చెట్టుకు జీడికాయాలు కాస్తాయి. ఆ కాయల చివర జీడిపప్పులు ఉంటాయి. ఈ జీడిపిక్కల్నే కాల్చి జీడిపప్పుగా తయారు చేస్తారు. వంద గ్రాముల జీడిపప్పులో 550 కి.కాలరీల శక్తి లభిస్తుంది. 30 గ్రాముల పిండి పదార్థాలు, 43 గ్రాముల కొవ్వులు, 18 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి. జీడిపప్పును అన్ని రకాల స్వీట్లలోనూ, వంటకాలలోనూ వాడతారు. కొద్దిగా వంపు తిరిగి ఉండే జీడిపప్పుతో మెదడు చిత్రాన్ని చేశాను. మెదడుకు ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్లు, బ్రెయిన్ క్యాన్సర్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ వంటివి ప్రమాదకరమైన వ్యాధులు. దాదాపుగా మెదడుకు వచ్చే ఏ వ్యాధైనా ప్రమాదకరంగానే ఉంటుంది. ఎపిలెప్సీ, పార్కిన్సన్స్, డిమెన్షియా, అల్జీమర్స్, ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ వంటి వాటితో పాటు బ్రెయిన్ హెమరేజ్లు కూడా సంభవిస్తాయి. బి.పి కి మందులు వాడకపోవటం వలన రక్తపోటు ఎక్కువై మెదడులో రక్తనాళాలు చిట్లి మరణం సంభవిస్తుంది. ఇది కాక మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది పుట్టుకతోనే మెదడు అభివృద్ధి చెందక పోవడం వల్ల మెంటల్ రిటార్డేషన్తో పుడతారు. మాట, నడక రాక తెలివి లేక జీవిస్తుంటారు. ఇటువంటి పిల్లలతో తల్లిదండ్రులకు అనేక సమస్యలు ఉంటాయి.
బ్లాక్ బెర్రీలతో...
ఇంట్లో ఉన్న డ్రైఫ్రూట్స్ అన్నింటితోనూ మెదడును తయారు చేస్తున్నాను. బ్లాక్ బెర్రీలు రోజేసి కుటుంబానికి చెందిన ఫలాలు. దీని శాస్త్రీయనామం ''రూబస్ ఫ్రూటికోసస్''. దీని పువ్వు ఐదు రెక్కలతో, మధ్యన బోలెడు కేసరాలతో ఉంటుంది. బ్లాక్ బెర్రీలు ఎక్కువగా మే నెలలో కాస్తాయి. వీటిలో దాదాపు 375 జాతులున్నాయి. ఈ ఫలాలు రాస్బెర్రీ ఫలాలతో దగ్గరి సంబంధాలను కలిగి ఉంటాయి. చాలా పెద్ద ఆకులతో తెలుపు రంగు పువ్వులతో ఉంటుందీ చెట్టు. ఈ ఫలాలను ఎక్కువగా స్వీట్స్, జామ్, జెల్లీ, వైన్, లిక్కర్ల తయారీలో వాడతారు. వీటి విత్తనాల్లో ఎక్కువా ఒమేగా-3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి. మెదడులో మూడు భాగాలుంటాయి. సెరిబ్రరు, సెరిబెల్లమ్, బ్రెయిన్ స్టెమ్ అనే మూడు భాగాలు. తెలివితేటలు, సృజనాత్మకత, జ్ఞాపకం, భావోద్వేగం వంటి అనేక విభాగాలను మెదడు తన అదుపులో ఉంచుకుంటుంది. మెత్తని మెదడు అత్యంత పటిష్టమైన పుర్రె మధ్యలో భద్రంగా ఉంటుంది.
అల్యూమినియం రేపర్‌తో...
పూరీలు, చపాతీలు వంటి పదార్థాలు వేడి తగ్గకుండా అల్యూమినియం రేపర్లో కట్టి ఇస్తారు. ఇంకా స్వీట్లు, ఛాట్ వంటివి తెల్లని అల్యూమినియం కవర్లలో ప్యాక్ చేసిస్తారు. ఛాట్ భండార్లలో, స్వీట్ షాప్‌లలో వేడిగా ఉండేందుకు ఇలాంటి కవర్లలో వేసిస్తున్నారు. నేను దీనితో మెదడు చిత్రాన్ని 3డి ఎఫెక్ట్‌లో చేశాను. ఇప్పటి వరకూ చేసినవి డ్రాయింగ్ షీట్ మీదయితే ఇప్పుడు నిజమైన మోడల్‌గా తయారు చేశాను. ఈ రేపర్‌ను బాగా నలిపితే ముడతలతో మెదడు రూపాన్ని గుర్తుకు తెచ్చింది. దాని చివర ఒక కాడను కూడా పెట్టాను. సిల్వర్ కలర్లో బ్రెయిన్ తయారయింది. ఈనాటి స్పీడ్ యుగంలోని పరిస్థితులు మానవ మెదడుపై అనేక వత్తిడి కలిగించి రకరకాల జబ్బులకు కారణమవుతున్నాయి. డిప్రెషన్, టెన్షన్, ష్క్రిజోఫీనియా, హిస్టీరియా వంటి మానసిక జబ్బులు కూడా మెదడును చాలా ఇబ్బంది పెడతాయి. ఆలోచనలను అదుపులో ఉంచుకంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
గవ్వలతో...
సముద్రంలో దొరికిన గవ్వలు అనుకునేరు. కాదు ఇంట్లో గోధుమపిండితో వండిన తినే పదార్థాలు. నేను ఈ గవ్వల్ని పాకంలో గాకుండా కారా గవ్వలుగా చేయాలనుకున్నాను. కానీ బాగా కాలిన నూనెల వేయటం వల్ల మాడిపోయి నా బొమ్మకు పనికొచ్చాయి. తినే గవ్వలు ముడుతలతో గీతలతో ముడుచుకొని ఉండటం వల్ల మెదడు ఆకారానికి సరిగ్గా పనికొచ్చాయి. మెదడుకు మన జ్ఞానేంద్రియాల ద్వారా సిగల్స్, సమాచారం అందుతాయి. చూపు, వాసన, స్పర్శ, వినికిడి, నాలుక వంటి జ్ఞానేంద్రియాల వలన సమాచారం అందుకొని సరియైన నిర్ణయం తీసుకుంటుంది. సెరిబ్రవమ్ రెండు అర్థభాగాలుగా విడగొట్టబడి కుడి మెదడు, ఎడమ మెదడుగా ఉంటుంది. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ అంటే మెదడు, వెన్నుపాముతో కలిసి పని చేస్తుంది. ఎన్నో ఊహలు, జ్ఞాపకాలు, భావాల సంక్లిష్టమైన సంగమమే మెదడు. అనవసర ఆలోచనలతో సమస్యలు తెచ్చుకోకుండా మెడిటేషన్ వంటివి చేయడం మంచిది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్