Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లతా మంగేష్కర్... తేనెలూరే ఆమె స్వరాన్ని ఆస్వాదించని భారతీయులు ఉండరు. ఆమె భారత జాతీయ సంపద. భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక. సినీ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి.తక్కువే అయినా కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఎనిమిది దశాబ్దాల పాటు కొన్ని తరాలను తన గాన మాధుర్యంలో ఓలలాడించిన ఆ గానకోయిల ఆదివారం ఉదయం ముంబయిలో 92 ఏండ్ల వయసులో తుదిశ్వాస విడిచిన విషయం మనందరికీ తెలుసు. సినిమా పాటల్లో అనేక భావోద్వేగాలను పలకించిన ఈమె తన జీవితంలోనూ ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్నో కష్టాలు సైతం అనుభవించిన ఆమె జీవితాన్ని ఓసారి మననం చేసుకుందాం...
లతా మంగేష్కర్ 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హిందుస్తానీ సంగీతంలో దిట్ట. మరాఠీ రంగస్థల నటుడు కూడా. ఐదుగురు పిల్లల్లో ఆమే పెద్దది. ఆమె ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు. వారి ఇంట్లో పని చేసే ఆమె లతకు మరాఠీ అక్షరాలు నేర్పించారు. స్థానిక పూజారి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. బంధువులు, ట్యూషన్లు చెప్పే గురువులే ఇతర పాఠ్యాంశాలు బోధించారు.
ఆర్థిక ఇబ్బందులతో...
లతా మంగేష్కర్‌కు తొలి సంగీత గురువు ఆమె తండ్రే. దీనానాథ్ శిష్యులకు సంగీతం నేర్పుతూ ఉంటే గమనిస్తూ ఉండేది చిన్నారి లత. ఒకసారి శిష్యులు తప్పుగా ఆలపిస్తున్న రాగాన్ని తాను సరి చేస్తుండగా తన తండ్రి గమనించారని లతా మంగేష్కర్ చెప్పే వారు. అప్పుడే లతలోని సంగీత ప్రతిభను ఆయన గుర్తించారు. తొమ్మిదేండ్ల వయసులో తొలిసారి తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చారు లతా మంగేష్కర్. అయితే ఆమె తండ్రి ఆర్థికంగా దెబ్బతిని, తన నాటకాల కంపెనీని మూసేయటంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారి ఇంటిని వేలం వేయటంతో కుటుంబం పుణె నగరానికి నగరానికి వెళ్ళింది.
నటించడం ఇష్టం లేకపోయినా...
దీనానాథ్ మంగేష్కర్ 1942లో మరణించారు. అప్పటికి లత వయసు 13 ఏండ్లు మాత్రమే. పెద్ద కుటుంబం. మరోవైపు తీవ్రమైన ఆర్థిక కష్టాలు. లతా మంగేష్కర్‌కు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. పెద్ద కూతురుగా తల్లికి అండగా నిలుస్తూ కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత తీసుకున్నారు లత. వారి కుటుంబం బొంబాయి నగరానికి వలసొచ్చింది. లత సంగీతం నేర్చుకుంటూనే మరొక వైపు సినిమాల్లో పాటలు పాడే అవకాశాల కోసం ప్రయత్నించారు. అయితే.. 1940వ దశకం తొలి నాళ్లలో సినిమాల్లో పాటలు ఎక్కువగా ఉండేవి కాదు. దీంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేయడం మొదలు పెట్టారు. కానీ సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆమె మనసంతా పాట మీదనే ఉండేది. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఎనిమిది మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు.
చిన్న చిన్న అవకాశాలతో...
లతా మంగేష్కర్ కుటుంబానికి సన్నిహితుడైన మరాఠీ సినిమా దర్శకుడు మాస్టర్ వినాయక్ ఆమెకు అండగా నిలిచారు. ఆయన సాయంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేయడం, పాటలు పాడటం ప్రారంభించారు లత. 1942లో తీసిన మరాఠీ చిత్రం పహెలీ మంగళ గౌర్లో చిన్న వేషం వేయడంతో పాటు ఒక పాట కూడా పాడారు. మాస్టర్ వినాయక్ తన మకాంను ముంబయికి మార్చడంతో ఆయనతోపాటు అక్కడకు చేరుకున్నారు లత. ముంబయిలో ఆమెకు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ హిందుస్తానీ సంగీతం నేర్పారు. ఆ సమయంలోనే సినిమాల్లో పాటలు పాడటానికి చిన్నచిన్న అవకాశాలు రావటం మొదలైంది. 1947లో ఆమె నెలకు 200 రూపాయలు సంపాదించేవారు.
మెంటార్‌గా గులాం హైదర్
1948లో మాస్టర్ వినాయక్ చనిపోవడంతో లతకు మెంటార్‌గా మారారు సంగీత దర్శకుడు గులాం హైదర్. ఆమె సంగీత జీవితంలోకి గులాం హైదర్ ప్రవేశం ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. సింగర్‌గా ఆమెను తీర్చిదిద్దడంతోపాటు లత కెరియర్లో తొలి బ్రేక్ కూడా ఇచ్చారు గులాం హైదర్. 1948లో విడుదలైన మజ్బూర్ సినిమాలో లత పాడిన 'దిల్ మేరా తోడా' అనే పాట ఓ సూపర్ హిట్. ఆ తర్వాత 1949లో అశోక్ కుమార్, మధుబాల నటించిన మహల్ మూవీతో మరొక హిట్ సాధించారు. ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు.
సినిమా స్వర్ణయుగంలో...
బాలీవుడ్ అప్పుడే స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోంది. సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నారు లత. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు ఆమె పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. 1950 నాటికి హిందీ సినిమాలో సింగర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పాకీజా, మజ్బూర్, ఆవారా, ముఘల్-ఎ-ఆజం, శ్రీ 420, ఆరాధన.. 20 ఏండ్ల పాటు ధియేటర్లలో ఆడిన దిల్వాలే దులÛనియా లే జాయేంగే.. వంటి ఎన్నో సినిమాల్లో ఆమె చిరకాలం నిలిచిపోయే పాటలు పాడారు. అమరులైన భారత సైనికులకు నివాళులర్పిస్తూ.. 'ఎ మేరె వతన్ కె లోగో...' అంటూ ఆమె ఓ బహిరంగ సభలో పాట పాడినప్పుడు నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మకుటం లేని మహారాణి...
1940లలో మధుబాల మొదలుకుని 1990లలో కాజోల్ వరకూ బాలీవుడ్లో ప్రతి కథానాయికకూ లతా మంగేష్కర్ తన గొంతుతో పాట పాడారు. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి అగ్ర గాయకులతో గొంతు కలిపారు. రాజ్ కపూర్ నుంచి గురుదత్ వరకూ, మణి రత్నం నుంచి కరణ్ జోహార్ వరకూ అగ్రస్థాయి దర్శకులతో కలిసి పనిచేశారామె. భారతీయ సినిమా 2023 నాటికి 110 ఏండ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ ప్రయాణంలో దాదాపు 75 ఏండ్లు భారతీయ సినిమాలో విడదీయలేని భాగంగా కొనసాగారు లత. ఏడు దశాబ్దాలకుపైగా సాగిన లత సంగీత కెరియర్లో ఆమె గాన మాధుర్యాన్ని ఎన్నో తరాలు ఆస్వాదించాయి.
ఎవరికీ భయపడను
మొహమ్మద్ రఫీ వంటి అగ్రస్థాయి గాయకుడిని సవాల్ చేసేంత సాహసం లతా మంగేష్కర్ సొంతం. మెరుగైన పారితోషికం, రాయల్టీలు కావాలని డిమాండ్ చేసిన తొలి గాయని కూడా ఆమే. ''నేను సొంతంగా ఎదిగిన మనిషిని. పోరాటం నేర్చుకున్నాను. నాకు ఎప్పుడూ, ఎవరన్నా భయం లేదు. నాకసలు భయమే లేదు'' అని ఆమె ఒక సందర్భంలో చెప్పారు. ''అతి శుద్ధమైన ముత్యంలాగా ఆమె స్వరం, గానం స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది'' అని ప్రఖ్యాత బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అక్తర్ అభివర్ణించారు. లతా మంగేష్కర్ తన సోదరి, మరో ప్రముఖ సినీ గాయని ఆశా భోంస్లేతో కలిసి కూడా అప్పుడప్పుడూ పాటలు పాడారు. 1988లో వచ్చిన నాగార్జున, శ్రీదేవిల 'ఆఖరి పోరాటం' సినిమాలో ఎస్పీ బాలుతో కలిసి ఆమె ఒక పాట పాడారు. ఇళయరాజా ఆ సినిమాకు మ్యూజిక్ అందించారు.
భారతరత్న పురస్కారం...
సినీ పరిశ్రమకు లతా మంగేష్కర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 1999లో పద్మవిభూషణ్ ఆమెను వరించాయి. 2001లో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి తర్వాత భారతరత్న అందుకున్న ఏకైక గాయకురాలు లతా మంగేష్కరే. ప్రముఖ తెలుగు నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పేరు మీద నెలకొల్పిన నేషనల్ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. ఇవే కాక అనేక నేషనల్, ఫిలింఫేర్ అవార్డులతోపాటు ఫ్రాన్స్, రష్యా, నేపాల్ వంటి దేశాల నుంచి కూడా పురస్కారాలు అందుకున్నారు ఆమె.
క్రికెట్ అంటే ఇష్టం
లతా మంగేష్కర్ సంగీత రుచులు చాలా ఉద్విగభరితంగా ఉంటాయి. మొజార్ట్, బీథోవెన్, చోపిన్, నాట్ కింగ్ కోల్, బీటిల్స్, బార్బరా స్ట్రీసాండ్, హారీ బెలాఫోంట్ వంటి దిగ్గజాల సంగీతం, పాటలు ఆమెకు చాలా ఇష్టం. మార్లీన్ డీట్రిక్ స్టేజి మీద పాడుతుండగా చూడటానికి వెళ్లారు. ఇనగ్రిడ్ బెర్జ్‌మన్ నాటకాలను ఆమె ఎంతో అభిమానించారు. సినిమాలు చూడటం కూడా ఆమెకు చాలా ఇష్టం. 'ద కింగ్ అండ్ ఐ' ఆమె ఫేవరేట్ హాలీవుడ్ మూవీ. కనీసం పదిహేను సార్లు ఆ సినిమా చూశానని లతా చెప్తారు. అలాగే 'సింగింగ్ ఇన్ ద రెయిన్' కూడా ఆమెకు బాగా నచ్చిన సినిమా. జేమ్స్ బాండ్ సినిమాలు, షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ నవలలూ ఇష్టపడతారు. కార్లంటే లతకు చాలా మక్కువ. ఒక గ్రే హిల్మన్, ఒక బ్లూ షెవర్లె షిజ్లర్, ఒక మెర్సిడిస్ ఆమె దగ్గర ఉండేవి. ఆమె ఇంట్లో తొమ్మిది కుక్కలు కూడా పెంచుకున్నారు. లతా మంగేష్కర్ క్రికెట్ అభిమాని కూడా. అప్పుడప్పుడూ పాటల రికార్డింగులకు విరామమిస్తూ.. టెస్ట్ మ్యాచ్‌లు చూసేవారు. డాన్ బ్రాడ్‌మన్ సంతకం చేసిచ్చిన ఫొటో ఆమె దగ్గరుంది.
సంతోషాన్ని ప్రపంచంతో పంచుకోవాలి
వంట చేయటం, ఫొటోలు తీయటం కొంత కాలం ఆమె హాబీలుగా ఉండేవి. ''ఇది చిత్రంగా అనిపించొచ్చు. కానీ సెలవులకు అమెరికా వెళితే లాస్ వేగాస్‌లో గడపటం నాకు చాలా ఇష్టం. స్లాట్ మెషీన్ల దగ్గర ఆడేదానిని. నాకు అదృష్టం కలిసొస్తుంది. చాలాసార్లు గెలిచాను కూడా'' అని ఒక ఇంటర్వ్యూలో లత అంగీకరించారు. ''సంతోషాన్ని ప్రపంచంతో పంచుకోవాలి.. బాధను సొంతానికి ఉంచుకోవాలి.. అని నేను ఎప్పుడూ అనుకుంటాను'' అని లత ఓ సందర్భంలో చెప్పారు.
నైటింగేల్ ఆఫ్ ఇండియా
కలకాలం నిలిచిపోయే ఆమె గానం.. కోట్లాది మంది భారతీయులకు సంతోషాన్నిచ్చింది. నస్రీన్ మున్నీ కబీర్ చెప్పినట్టు ''ఆమె గానం జనం జీవన నేపథ్య సంగీతమైంది''. 'నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్' అని పిలుచుకునే లతా మంగేష్కర్. 36 భాషల్లో దాదాపు 30 వేల పాటలు పాడారు. ఆమె పాటల రికార్డులు లక్షల్లో అమ్ముడయ్యాయి. బాలీవుడ్ గాయనిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన లత మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.