Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కాలంలో చాలా మంది దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. కొందరికి తక్కువే ఉంటుంది. కానీ మరికొందరు మాత్రం అదే పనిగా దగ్గుతుంటారు. అయితే దగ్గుతో ఇబ్బంది పడే వారు వెంటనే ఆస్పత్రులకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. వంటింట్లో దొరికే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం...
గిన్నెలో వేడి నీరు పోసి దుప్పటి కప్పుకొని ఆ నీటి ఆవిరిని పీల్చాలి. ఇలా చెయ్యడం వల్ల శ్వాస చక్కగా ఆడుతుంది. ఈ ఆవిరి యాంటీసెప్టిక్‌లా పనిచేసి.. గొంతులో, ముక్కులో బ్యాక్టీరియా, క్రిములను చంపేస్తుంది. కొందరు ఆ నీటిలో జండు బామ్ వంటి వేసుకొని కూడా ఆవిరి పడతారు.
గోరువెచ్చని నీటిలో ఓ టేబుల్ స్పూన్ తెనే వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె ఊపిరి తిత్తులకు కావాల్సిన తేమను అందిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. తేనె ఎంత తీసుకోవాలో నిపుణులను అడిగి తెలుసుకోవాలి.
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి కాయల్లో కూడా ఇది ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ సి టాబ్లెట్లు వాడే బదులు సహజ పండ్లను వాడటం మేలు. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే దగ్గు తగ్గుతుంది.
ఫ్రైలు, స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. దగ్గు వచ్చే సమయంలో ఇలాంటివి తీసుకోకూడదు. మాంసం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తినకూడదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల వంటి ఆహారం తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు కూడా మేలు చేస్తాయి.
మ్యులేథి... ఈ పుల్లల్ని నమిలితే దగ్గు తగ్గుతుంది. వీటి పౌడర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్ముతున్నారు. ఆ పొడిని టీ, అల్లం టీ, మిరియాల టీతో కలిపి పంచదార తక్కువ వేసుకొని తాగితే మేలు జరుగుతుంది.
దగ్గును సహజంగా తగ్గించేందుకు కరక్కాకాయ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బుగ్గలో పెట్టుకొని, అందులో నుంచి వచ్చే చేదు రసాన్ని మింగుతూ ఉండాలి. అలా చేస్తే దగ్గు తగ్గుతుంది. మన పెద్దవారికి ఈ చిట్కా గురించి బాగా తెలుసు.
ఈ సహజ పద్ధతులు పాటించినా దగ్గు తగ్గలేదంటే.. అప్రమత్తమవ్వాలి. వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.