Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు ఇంట్లో అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతుంది. అలా మిగిలిన అన్నం మర్నాడు తినాలంటే సద్ది అన్నం ఎవరు తింటారు..? అంటూ ఇంట్లో అందరూ ఒకటే సణుగుతూ వుంటారు. అయితే రాత్రి అన్నంలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇలా మిగిలిన అన్నంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుని మనమూ చేసేద్దామా మరి.
మిక్సిడ్ వెజ్ రైస్
కావలసిన పదార్ధాలు: రెండు కప్పుల అన్నం, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీలు, ఆలుగడ్డ ముక్కలు ఒక్కొక్క కప్పు, పచ్చి మిర్చి నాలుగు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, కరివేపాకు, దాల్చిన చెక్క కొంచం, లవంగాలు, ఏలకులు ఆరు, ఉప్పు, నూనె.
తయారు చేయువిధానం: ఒక మందపాటి గిన్నెలో నూనె ఆరు టేబుల్ స్పూన్లు పోసి అది వేడి ఎక్కాక తరిగి పెట్టుకున్న ముక్కలు అన్నీ వేయాలి. పచ్చి మిర్చి పొడవుగా తరిగి వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, వెల్లుల్లి కచపచ్చగా దంచి వేయాలి. ఇవ్వన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఉప్పు వేసుకోవాలి. ఒక సారి బాగా కలియ బెట్టిన తర్వాత అన్నం కూడా వేసి బాగా ముక్కలన్ని కలిసేలా కలపాలి. తర్వాత మూడు నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. ఇష్టం ఉన్నవారు దీంట్లోకి కూర్మ కూడా చేస్కోవచ్చు.
పుణుగులు
కావలసిన పదార్ధాలు: అన్నం రెండు కప్పులు, శనగపిండి ముప్పావు కప్పు, ఉప్పు, కారం, పచ్చి మిర్చి మూడు, ఉల్లిగడ్డలు రెండు, జీలకర్ర స్పూను, కరివేపాకు, కొత్తిమీర, నూనె.
తయారు చేయు విధానం: ముందుగా అన్నాన్ని మెత్తగా మిక్సీలో రుబ్బు కోవాలి. దాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి దాంట్లో శనగపిండి, కారం, తగినంత ఉప్పు, జీలకర్ర ఒక స్పూను, ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి సన్న ముక్కలుగా తరిగి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి. (ఈ మిశ్రమం ఉండ చేయటానికి వీలుగా ఉండాలి) ఆ తర్వాత బాండీలో ఎక్కువగా నూనె పోసి అది బాగా వేడెక్కాక మంటను తగ్గించి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చేతితో చిన్న చిన్న ఉండలుగా చేస్తూ నూనెలో వేయాలి. అవి బాగా వేగాక నూనె లోంచి తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే నూనె పీల్చుకుంటుంది. ఆ తర్వాత వాటిని టమాటో కెట్చప్తో కానీ సాస్‌తో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటాయి. సాస్, కెచప్ ఇష్టంలేని వారు ఆవకాయతో కూడా తినొచ్చు
గారెలు
కావాల్సిన పదార్ధాలు: రెండు కప్పుల అన్నం, కప్పు బొంబాయి రవ్వ, కప్పు పుల్ల పెరుగు, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి మూడు, ఉల్లిగడ్డ ఒకటి, అల్లం.
తయారు చేయు విధానం: అన్నాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని అందులో బొంబాయి రవ్వ, పుల్ల పెరుగు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో నూనె ఎక్కువగా పోసి బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత మంటను సిమ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక సారి చేత్తో బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి గారెల్లాగా చేసి నూనెలో వేసి వేయించాలి. గోధుమ రంగు వచ్చాక నూనెలోంచి తీసేయాలి. ఇవి ఎంతో సాఫ్ట్‌గా తినటానికి బావుంటాయి.
(ఒక వేళ మిశ్రమము కొంచం జారుగా ఉంది అనుకుంటే మరి కొంచం బొంబాయి రవ్వ కలిపితే సరి)
రొట్టెలు
కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల అన్నం, బియ్యపు పిండి కప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పాలకూర, పచ్చిమిర్చి మూడు. వీటినన్నింటినీ సన్నగా తరుక్కోవాలి(ప్రతిదీ ఒక పావు కప్పు), జీలకర్ర ఒక స్పూను, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు రెండు చెంచాలు, నూనె.
తయారు చేయు విధానం: ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి అన్నం తీసుకుని దాన్ని మెత్తగా చేసుకోవాలి. తర్వాత అందులో బియ్యపు పిండి, పాలకూర తరుగు, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు, రెండు చెంచాల పెరుగు వేసి బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక పావు గంట తర్వాత పొయ్యిమీద పెనం పెట్టి అది వేడెక్కేలోగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి నూనె రాసి, పిండిని చిన్న ఉండలాగా చేసి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి. దానిని వేడెక్కిన పెనం మీద వేసి కొంచం నూనె వేసి కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. ఇష్టమున్న వారు వీటిని చట్నీతో తినవచ్చు.
(మిశ్రమం కొంచం పల్చగా ఉంది అనుకుంటే కొంచం బియ్యపు పిండి కలపాలి)