Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఆహారపు అలవాట్లకు, ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పిల్లలు సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోతే భవిష్యత్తులో అనర్థాలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని మరో పరిశోధన సైతం నిర్ధారించింది. ఎన్విరాన్మెంటల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అనే మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని పిల్లల ఆహారపు అలవాట్లపై నిర్వహించారు.
ప్రపంచంలోని అనేక పెద్ద యూనివర్సిటీలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. టీవీ, ల్యాప్టాప్ చూస్తూ ఆహారం తినే పిల్లలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధన తేల్చింది. ఇలాంటివారు పెద్దయ్యాక చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతూ అసంతృప్తికి లోనవుతారని గుర్తించింది. ఆ అధ్యయనం ఫలితాలను బయోమెడ్ సెంట్రల్ జర్నల్లో ప్రచురించారు.
ముఖ్యంగా టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్న పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తినేవారు, వారితో కలిసి రాత్రి భోజనం చేసే పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం గుర్తించింది. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్లో ఊబకాయం సమస్య పెరుగుతున్నట్టు సర్వేలో తేలింది. ఇది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది. భారతదేశంలో 10 నుంచి 12 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్టు పరిశోధన గుర్తించింది.
ఈ లెక్కన చూస్తే.. 2030 నాటికి దేశంలోని దాదాపు సగం మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడొచ్చు. గత 50 ఏండ్లలో భారత్లో పిల్లలకు అందించే నూనె ఉత్పత్తుల వినియోగం 20 శాతం పెరిగిందని కొన్ని సర్వేలు తేల్చాయి. మిఠాయి, చాక్లెట్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్లు తినేవారిలో దాదాపు 80 శాతం మంది 11- 20 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు ఉన్నట్టు ఆ సర్వే నివేదించింది.
పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల స్క్రీన్ టైమ్ను (టీవీ, స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ల వీక్షణ సమయం) నిర్ణయించింది. నిర్దేశించిన టైమ్ కంటే ఎక్కువ సమయం స్క్రీన్ టైమ్ ఉండే పిల్లలు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఫోన్లు, టీవీ స్క్రీన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లను పిల్లలను దూరంగా ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు 'జీరో స్క్రీన్ టైమ్'ను సంస్థ నిర్దేశించింది. అంటే వారిని పూర్తిగా గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని అర్థం. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు స్క్రీన్ టైమ్ రోజుకు ఒక గంట మించకూడదు. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు ఒక రోజులో గరిష్టంగా ఒక గంట స్క్రీన్ టైమ్ను డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించింది.