Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి అధునాతన జీవనశైలి ప్రజల ఆరోగ్యంతో పాటు వారి ఆహారంపై కూడా ప్రభావం చూపుతోంది. పిల్లలకు సరైన సమయానికి పోషకాహరం ఇవ్వడం తల్లిదండ్రులకు కష్టమైనపనిగా మారింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అన్నం చూడగానే ముఖం తిప్పుకుంటారు. చిరుతిళ్లు తింటారు తప్ప అన్నం వద్దకు వచ్చే సరికి వద్దని మారాం చేస్తారు. వారికి అన్నం తినిపించాలంటే తల్లిదండ్రుల తల ప్రాణం తోకకొస్తుంది. ఇక ఉద్యోగాలు చేసే వారైతే మరిన్ని తిప్పలు తప్పవు. పిల్లలకు తీరిగ్గా కూర్చొని అన్నం తినిపించే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే కొందరు పిల్లలు ఆకలి కోల్పోతారు. ఏం తిన్నాలన్నా మొండి కేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలకు సరైన పోషకాహారం అందదు. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? పిల్లలకు బాకా ఆకలై ఉత్సాహంగా భోజనం చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వాము: గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వాము ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఫ్లాట్యులెన్స్ ఎలిమెంట్స్ కూడా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అందుకే పిల్లల ఆహారంలో వాము ఉండేలా చూసుకోండి.
యాలకుల పాలు: యాలకులు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు పని చేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తద్వారా ఆకలి కూడా పెరుగుతుంది. అందుకే రోజూ ఒక కప్పు గోరువెచ్చని పాలలో ఏలకుల చూర్ణం కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు. దీనివల్ల పాలు రుచిగా ఉండటమే కాకుండా పిల్లల ఆకలి కూడా పెరుగుతుంది.
ఉసిరి: ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ ఖాళీ కడుపుతో ఉసిరి తీసుకుంటే కంటి చూపు పెరగడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఉసిరి ముక్కలు వేసి ఉడకబెట్టండి. ఇప్పుడు నీళ్లలో తేనె కలిపి పిల్లలకు ఇవ్వాలి. దీనివల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఆకలి కూడా పెరుగుతుంది.
సోంపు: పిల్లలకు తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. అలాంటప్పుడు సోపు గింజలు, షుగర్ క్యాండీలను కలిపి ఇవ్వాలి. ఇది మరింత రుచిగా ఉండాలంటే సోపును సన్నని సెగపై వేయించాలి. అప్పుడు దాని నుంచి సువాసన వస్తుంది. దానిని షుగర్ క్యాండీలతో కలిపి ఇస్తే.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వారి ఆకలిని పెంచడంలో ఇది కచ్చితంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అల్లం: పిల్లల ఆకలిని పెంచడానికి అల్లం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆకలిని పెంచడంతో పాటు శరీరంలోని అనేక వ్యాధుల నుండి బయటపడటానికి అల్లం సహాయపడుతుంది. దీని వినియోగం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకు పిల్లలకు అప్పుడప్పుడు అల్లం తినిపించాలి. ముక్కలు తినడంలో ఇబ్బంది పడితే అల్లం రసమైనా తాగించాలి.
పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే.. పిల్లలకు బాగా ఆకలవుతుంది. మారాం చేయకుండా భోజనం తింటారు. అయినప్పటికీ పిల్లలు అన్నం తినడం లేదంటే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. వారు చెప్పిన సలహాలు, సూచనలను పాటించాలి.