Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తర్వాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వ్యవహారాలు చాలావరకు కాలేజీ విద్యార్థుల మధ్యే ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే కొన్ని సమయాల్లో ఇదంతా గందరగోళంగా వుంటుంది. నచ్చిన వారికి తమలో వున్న ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. వారికి నచ్చిన విధంగా తమను తాము మార్చుకుంటారు. ఇటువంటి ప్రయత్నాలలో కొందరు విజయాన్ని సాధిస్తారు. అంటే... తమ ప్రేమను వ్యక్తపరిచి వారి మనసులను గెలుచుకుంటారు. మరికొందరు విఫలమవుతుంటారు. తమలో వున్న భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియక డైరెక్ట్‌గా వెళ్లి కొందరు ప్రపోజ్ చేసేస్తారు. ఒకవేళ వారికి నచ్చితే ఫరువాలేదు కానీ.. నచ్చకపోతే తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది తమలో వున్న ప్రేమానుభావాలను చెప్పుకోలేక తలమునకలయిపోతుంటారు. వారితో కలవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. తమ ప్రేమ గురించి వ్యక్తపరచడానికి ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని వుండిపోతారు. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అవేంటో తెలుసుకుందాం...
మీరు ప్రేమిస్తున్న వారికి మీ మనసులోని భావాలను వ్యక్తపరిచే ముందు ఏదైనా ఒక ప్రశాంతంగా వుండే స్థలాన్ని ఎంచుకుంటే మంచిది. అటువంటి ప్రశాంత వాతావరణంలోనే ఇతరుల మనుసులో వున్న భావాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మీలో వున్న భావాలను వ్యక్తపరిస్తే ఫలితం దక్కవచ్చు.
మీరు ప్రేమిస్తున్న వారి గురించిగాని, ప్రేమ వ్యవహారం గురించి కాని స్నేహితులతో ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను స్నేహితుల నుంచి తెలుసుకోవడం ఇష్టపడరు. పైగా వారు కోపాద్రిక్తులై మీ ప్రేమను తిరస్కరించవచ్చు.
ప్రస్తుత జనరేషన్లో ప్రతిఒక్కరు తమ ప్రేమ వ్యవహారాలను సెల్ ఫోన్ల ద్వారా, సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా వ్యక్తపరుచుకుంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచిది కాదు. సాధ్యమైనంతవరకు లేఖ రాయడానికి ఆసక్తి చూపించండి. ఎందుకంటే.. ఒక కాగితంలో రాసే మనసులోని భావాలు ఇతరులు త్వరగా ఆకర్షితులవుతారు. పూర్వం ప్రేమ వ్యవహారాలు ఇలాగే ఎక్కువగా జరిగేవి. అందులో వారు విజయాన్ని కూడా సాధించేవారు. కాగితంలో రాసే అక్షరాలు మనసులో దాగి వున్న ప్రేమలోతును పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా వీలుగా వుంటుంది.
కొందరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి సినిమా డైలాగులు వాడుతుంటారు. అయితే చాలామందికి అలాంటి నచ్చవు. మీరు మీరుగానే వుండి మీలో వున్న భావాలను వ్యక్తపరిస్తేనే చాలామంచిది. చాలా మంది అటువంటివాళ్లనే ఇష్టపడతారు. అందుకే మీకు మీరుగానే మీ మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు ట్రై చేయండి.