Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ దశాబ్దాల తరబడి జనంతోనే, జనం మధ్యలోనే తిరుగుతుంది అని వరల్డ్‌హెల్త్ ఆర్గనైజేషన్ బాధ్యులు చెబుతున్నారు. అంటే మన పోరాటం ఆ వైరస్‌తోనే చేయవలసి ఉంటుంది. చాలా మంది భౌతిక దూరం పాటించలేకపోతున్నారు. ఈ సమస్యకు శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. బయటికి వచ్చే ప్రతివారూ గొడుగు వేసుకుని మాత్రమే రావాలి. దీనికి 'అంబ్రెల్లా థియరీ' అని పేరు పెట్టారు. గొడుగు ఉండటం వల్ల మనుష్యులు ఒకరికొకరు దగ్గరగా నిలబడటం సాధ్యం కాదు. గొడుగు వేసుకున్న వ్యక్తి తుమ్మినా దగ్గినా కూడా ఆ తుంపరలు గొడుగు దాటి బయటకు రావు. ఇది పాటిస్తే కరోనా వైరస్ వ్యాపించే అవకాశం తక్కువే ఉంటుంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. సంవత్సరాల తరబడి ఇళ్ళలో ఉండటం వల్ల, బయటకు వెళ్ళినా భయం భయంగా వెళ్ళటం వల్ల మనుష్యుల్లో ఒకరకమైన మానసిక ఒత్తిడి మొదలవుతున్నది. చేస్తున్న పనిని స్వేచ్ఛగా చెయ్యలేని భావన వెంటాడుతున్నది. మెడిటేషన్ చెయ్యడం వలన మనిషికి మానసిక ఒత్తిడి దూరమవుతుంది. వ్యాయామం కూడా అవసరం.
టాబ్లెట్ స్ట్రిప్పులతో...
''ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడికెళతావు ఊచ్... కొమ్మ మీది జామ పండు కోసుకొస్తావా.. మా పాపాయికిస్తావా..'' అని చిన్నప్పుడు పాడుకునే ఉడత పాట గుర్తొచ్చిందా! చెట్టు మీదకూ, కిందకూ జరజరమని తిరిగే ఉడత అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు కదా! అలాంటి ఉడత గురించి మీకు వివరాలు తెలియజెయ్యాలని ఈ రోజు ఉడతల్ని చేస్తున్నాను. ఉడత శరీరం మీద మూడు నిలువు చారలు ఉంటాయి. తెల్లని ప్లాస్టిక్ మూతల్లాంటి ఆసుపత్రి వ్యర్థాలతో ఉడత బొమ్మను చిత్రించాను. దీనికి శరీరం ఎంత పొడవు ఉంటుందో, తోక కూడా అంతే పొడవు ఉంటుంది. మన ఇళ్ళలో ప్రతి వారూ ఏదో ఒక మందులు వాడుతూనే ఉంటారు. టాబ్లెట్లు వేసుకున్నాక ఖాళీ అయ్యే స్ట్రిప్స్‌ను పారవేస్తారు. నేను అలాంటి స్ట్రిప్పులను దాచి బొమ్మలు చేస్తున్నాను. ఖాళీ అయిన టాబ్లెట్ స్ట్రిప్పులతో ఉడత శరీరాన్ని కప్పేశాన. సిల్వర్ కలర్ స్ట్రిప్పులతో ఉడత మెరుస్తోంది.
పిస్తా పొట్టుతో...
పిస్తా పప్పు తిన్నాక మిగిలే పిస్తా పొట్టుతో ఉడతను తయారు చేశాను. పిస్తా పొట్టుతో చేసిన ఉడత పొట్టను నింపడానికి ఒక పేరు తెలీని చెట్టు విత్తనాలు వాడాను. మేము రోజూ వాకింగ్‌కు వెళ్ళే దారిలో రోడ్డు పక్కనున్న చెట్టుకు బోలెడు కాయలున్నాయి. నేను వాటిని కోసుకొచ్చాను. అవి చూడటానికి జిల్లేడు చెట్టుకుండే ముళ్ళ కాయల్లా ఉన్నాయి. కాకపోతే ఆకారంలో చాలా చిన్నవి. వాటిని దాచుకొని బొమ్మల్లో ఉపయోగిస్తున్నాను. పిస్తా పొట్టుల ఉడత పొట్టను ఈ పేరు తెలీని కాయలతో నింపేశాను. కాయల ఉడుత తయారైంది. ఈ ఉడతలు 'స్కియురిడే' కుటుంబానికి, 'రొడెన్షియా' క్రమానికి చెందిన జీవులు ఉడతల కుటుంబంలో చెట్టు ఉడుతలు, నేల ఉడతలు, ఎగిరే ఉడతలు అనే రకాలుంటాయి. అత్యంత ప్రాచీనమైన శిలాజ ఉడతలు 'ఈయోసిన్' యుగానికి చెందినవి. ఉడతలు ఆఫ్రికా, యురేషియా, అమెరికా దేశాలకు చెందినటువంటివి. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు పరిచయం చేయబడ్డాయి. ఉడతలుపెద్ద కళ్ళతో, సన్నని శరీరాన్ని, గుబురు తోకను కలిగి ఉంటాయి. ఉడతలు సాధారణంగా 10-14 సెం.మీ పొడవుతో 12-26 గ్రాముల బరువుతో మాత్రమే ఉంటాయి. ఇవి చాలా చిన్న జంతువులు. ఇవి ఎలుకలతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఉడుతల పూర్వాంగాల కన్నా చరమాంగాలు పొడవుగా ఉంటాయి. నా ఉడత ఒక టమాటాను తింటూ ఉంది.
శంకు చెట్ల ఆకులతో...
మా ఇంట్లో శంకు చెట్ల పొదలున్నాయి అన్నాను కదా! వాటి ఆకులతో ఈరోజు ఉడతను చేస్తున్నాను. చెట్లపై తిరిగే ఉడతను చెట్ల ఆకులతో చేయడం బాగుంది. ఈ ఉడతల జీవిత కాలం పది సంవత్సరాలకుపైబడే ఉంటుంది. వీటి పళ్ళు ఎలుకల వలె సూదిలాగా ఉంటాయి. ఉడతలు పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా చనిపోతుంటాయి. వీటి శరీరంపై ఉండే బొచ్చు మెత్తగా సిల్కీగా ఉంటుంది. ఉడతలు చెట్టుపై నుంచి దూకేటప్పుడు దాని తోక ప్యారా చ్యూట్లాగా ఉపయోగపడుతుంది. ఇంకా తోకలతో వేరే ఉడతలకు సంకేతాలిస్తాయి. వర్షం, చలిగాలి నుంచి రక్షణ పొందుతాయి. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచడానికి తోక ద్వారా అధిక రక్తాన్ని పంపిస్తాయి. తోక వలన ఇన్ని ఉపయోగాలున్నాయి. శరీరంపై ఉండే బొచ్చు రంగు, మందం, పలచన అనేది జాతుల మధ్య తేడా కలిగి ఉంటుంది. భూటాన్‌లో నివసించే అతి పెద్ద ఉడత నాలుగు అడుగుల రెండు అంగుళాల పొడవు ఉంటుంది.
చింత గింజలు - అవిశ గింజలతో...
మృదువుగా బ్రష్‌లా ఉండే తోకతో ఉన్న ఉడతను చింతగింజలతో అవిశగింజలతో కలిపి చేశాను. చింత గింజలతో ఉడత శరీరాన్ని తయారు చేశాను. దాని శరీరాన్ని అవిశ గింజలతో నింపి మెత్తని సిల్కి జుట్టు ఉన్నట్టుగా తయారు చేశాను. నేల మీద నివసించే ఉడతలు సామాజికంగా మనుషులతో కలిసి జీవిస్తాయి. చెట్టు ఉడత జాతులు మాత్రం ఒంటరిగానే ఉంటాయి. మనుషులతో కలవవు. నేల ఉడతలు, చెట్టు ఉడతలు రెండూ కూడా పగటి పూటనే జీవిస్తాయి. ఎగిరే ఉడతలు రాత్రిపూట సంచరిస్తాయి. ఉడతల గర్భావధి కాలం మూడు నుంచి ఆరు వారాల సమయం ఉంటుంది. ఇవి సంవత్సరానికి రెండు సార్లు పిల్లల్ని కంటాయి. పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి. ఇవి ప్రధానంగా శాఖాహార జంతువులు. వీటిలో కొన్ని జాతులు మాత్రం పక్షిగుడ్లను, కీటకాలను, పురుగులను, చిన్న ఎలుకలను తింటాయి. సాధారణంగా ఉడతలు గింజలు, కాయలు, పండ్లు, కోనిఫెర్ శంకులు, వృక్ష శిథిలాలు, ఆల్గే, ఫంగి లను తింటాయి.
కిస్మిస్లతో...
మనం సాధారణంగా వాడే ఎండు ఫలాలలోని కిస్మిస్లతో ఉడతను చేశాను. ఈ ఉడతకు పింక్ రంగు వేశాను. ఎలా ఉంది. ఉడత శరీరాన్ని గులాబీ రంగు వేసిన బియ్యంతో నింపడం వల్ల గులాబీ రంగు ఉడత తయారయ్యింది. ''పువ్వులకేనా గులాబీ రంగు మాకొద్దా అని అడిగింది'' మా చెట్టు మీద ఎగిరే ఉడత. అందుకే దీనికా రంగు వేశాను. ఆంగ్లోనార్మన్ పదమైన 'ఎస్క్విరెల్' నుంచి ఇంగ్లీషులో మనం పలికే 'స్క్విరెల్' అనే ఉడత పేరు వచ్చింది. ఉడతల సమూహాలను 'డ్రే' లేదా 'స్కర్రీ' అంటారు. ఐదు ఉప కుటుంబాలలో 285 జాతుల ఉడతలు ఉన్నాయి. అమెరికన్ రెడ్ స్క్విర్రెల్, ఫాక్స్ స్క్విర్రెల్, వెస్ట్రన్ స్క్విర్రెల్, తూర్పు బూడిద ఉడత, నల్ల ఉడత, ఎర్ర ఉడత వంటి అనేక రకాలు ఉంటాయి. పురాణాలలో, సంస్కృతిలో, సాహిత్యంలో ఉడతల ప్రస్తావన ఎన్నో చోట్ల కనబడుతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్