Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లింగ పక్షపాతంతో పోరాడుతున్న 24 ఏండ్ల ఆలిస్ శర్మ. మార్పు కోసం పోరాడుతుంది. సమాజంలో నెలకొని ఉన్న లింగ వివక్షను రూపుమాపేందుకు తన వంతు కృషి చేస్తుంది. ఢిల్లీలోని బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేసేందుకు ఓ సంస్థను సైతం ఏర్పాటు చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అన్ని అడ్డంకులనూ ఎదుర్కొంటూ 15 వేల మందికి సాయం చేసిన ఆమె స్ఫూర్తిదాయక జీవితం గురించి నేటి మానవిలో...
ఆలిస్ 2013లో ఉత్తరాఖండ్ విపత్తు వరదలను చూసింది. ఇది 2004 సునామీ తర్వాత దేశంలోని అత్యంత ఘోరమైన విపత్తు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియా డిజాస్టర్ రిపోర్ట్ 2013 ప్రకారం సుమారు 169 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారని అంచనా. అప్పటికి 16 ఏండ్ల వయసున్న ఆలిస్ ఆ సమయంలో విపత్తుకు కేంద్రమైన కేదార్‌నాథ్‌లో ఉంది. ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రల కోసం అక్కడికి వెళ్ళింది.
విపత్తు నుండి బయటపడి...
''నేను ఆ సమయంలో 20 మంది వ్యక్తులతో ఉన్న గదిలో ఇరుక్కుపోయాను. ప్రజలు చనిపోవడం, చాలా మంది తమని తాము రక్షించుకునేందుకు వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను విడిచిపెట్టి పారిపోవడం ఎంతో కష్టంగా అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నేను క్షేమంగా ఇంటికి తిరిగి వెళతానో లేదో తెలియదు'' అంటూ ఆమె గుర్తుచేసుకుంది. అయితే ఆ విపత్తు నుండి బయట పడిన తర్వాత ఆలిస్ తన సామర్థ్యానికి తగ్గట్టుగా నిరుపేదలకు సహాయం చేస్తానని, వారి జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేసింది.
ఫౌండేషన్ స్థాపించి
2018 శీతాకాలంలో ఆమె స్వస్థలమైన ఢిల్లీలో చలి తీవ్రంగా పెరిగింది. ఆ సమయంలోనే ఆలిస్ వస్త్రా ఔర్ జిందగియాన్ ఫౌండేషన్‌ను స్థాపించింది. దాని ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు సహాయం చేయడం ప్రారంభించింది. 10 మంది వ్యక్తులు, దాదాపు 60 మంది వాలంటీర్లతో కూడిన కోర్ టీమ్‌తో ఈ సంస్థ ఏర్పడింది. వీరితో కలిసి రోడ్డు పక్కన నివసించే నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం, బట్టలు దుప్పట్లను అందించింది. ఢిల్లీలోని చావ్రీ బజార్ సమీపంలో తన కేంద్రాన్ని నిర్వహించడానికి క్రౌడ్సోర్సింగ్పై ఆమె ఆధారపడింది.
మహమ్మారి సమయంలో...
మార్చి 2020లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ బృందం ఢిల్లీలోని మురికివాడల ప్రాంతాలలో 15,000 మందికి పైగా ప్రజలకు సహాయం చేయగలిగింది. అయితే ఇది రెండు కారణాల వల్ల ఆలిస్, ఆమె బృందానికి కష్టమైన సమయంగా అనిపించింది. మొదటిది నిధులు అస్సలు లేకపోవడం. ఇది అతి పెద్ద సమస్యగా మారింది. మహమ్మారి సమయంలో ప్రజలు కనీసం రొట్టె కూడా తినలేని దీన స్థితిలో ఉన్నారు. మరోపక్క విరాళాలు తగ్గాయి. గ్రౌండ్ వర్క్ చేస్తున్న మూడు నెలల కాలంలో ఆమె ఒంటరిగా జీవించాల్సి వచ్చింది.
ఒంటరిగా జీవించాము
''ఇది మాకు ఎన్నో అనుభవాలు నేర్పింది. మేము కూడా కోవిడ్-19 బారిన పడే ప్రమాదం ఉన్నప్పటికీ పని చేస్తున్నాము. ఆ సమయంలో మేమంతా ఒంటరిగా ఉండవలసి వచ్చింది. ఎందుకంటే బయట వందలాది మంది ప్రజలను కలుస్తున్నాము. అలా కలిసి మా ఇంటికి వెళితే మా వల్ల ఇంట్లో వాళ్ళకు వైరస్ ఎక్కడ సోకుతుందో అనే భయంతో ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం కాదు'' అని ఆమె చెప్పింది.
ప్రారంభంలో ఎన్నో సవాళ్ళు
ఇతర సమస్యలపై మాట్లాడుతూ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మురికివాడల్లోని మహిళలు శానిటరీ న్యాప్కిన్లను తీసుకునేందుకు నిరాకరించినందున, రుతుస్రావం, ఇతర పరిశుభ్రత సంబంధిత ఆందోళనలను సమాజం తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆలిస్ అంటుంది. బహిష్టు సమయంలో అపరిశుభ్రత పాటించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఆమె బృందం సభ్యులు వివరించారు. 80 శాతం మంది మహిళలను శానిటరీ న్యాప్కిన్లు ఉపయోగించేలా ఒప్పించగలిగారు. ఆదాయం లేకుండా సామాజిక ప్రయోజనం కోసం పనిచేయడానికి ఇష్టపడే బృందాన్ని ఏర్పాటు చేయడం, సేవ చేయడానికి ఇష్టపడే వ్యక్తులను కనుగొనడం ప్రారంభంలో తమకు ఎంతో సవాలుగా ఉందని ఆలిస్ చెప్పారు.
లింగ వివక్ష ప్రతిచోటా ఉంది
చిన్నతనంలో ఆలిస్‌కు తాను పెరిగిన తర్వాత ఏమి చేయాలనుకుంటుందో ఓ ప్లాన్ అంటూ లేదు. ఆమె లాయర్ల కుటుంబం నుండి వచ్చింది. కాబట్టి అందరూ వారి అడుగు జాడల్లో నడుస్తుందని ఆశించారు. అయితే 2016లో మంచి లా స్కూల్లో అడ్మిషన్ పొందిన తర్వాత ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా ఒక సంవత్సరం విరామం తీసుకోవలసి వచ్చింది.
నా బాధ్యత అని గ్రహించాను
''ఒక సంవత్సరం తర్వాత నేను బ్లాగింగ్ ప్రారంభించాను. ఆ సమయంలో తక్కువ పోటీతో బ్లాగులు వైరల్ అయ్యాయి. రాయడం నా బాధ్యత అని నేను గ్రహించాను'' అని ఇప్పటికి ఏడు పుస్తకాలను రచించిన ఆలిస్ చెప్పారు. ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్‌లో భారతదేశానికి చెందిన 100 మంది ప్రముఖ మహిళల్లో ఆమె పేరు కూడా పొందింది. అయినప్పటికీ రచయిత్రిగా, మార్పు కోసం కృషి చేసే వ్యక్తిగా తన పనిపై లింగ వివక్ష ఎక్కువగా చూపేవారని ఆమె చెప్పింది.
కేవలం స్త్రీ కావడం వల్లనే...
ఆలిస్ ఒక పునరావాస కేంద్రంలో పని చేసే అవకాశం కోసం ఒక వ్యక్తి ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేసిన సంఘటనను మనతో పంచుకుంది. ''నా ప్రదర్శన అతని కంటే 10 రెట్లు మెరుగ్గా ఉందని అందరూ విశ్వసించారు. కానీ అతను ఒక పురుషుడు అయినందున అతను కొన్ని పరిస్థితులను మెరుగ్గా నిర్వహించగలడని కోఆర్డినేటర్ భావించాడు. మాదకద్రవ్యాల బాని సలను ఎదుర్కోవడంలో స్త్రీ కఠినంగా ఉండదని వారు భావించారు'' అని ఆమె గుర్తుచేసుకుంది.
మహిళలను అంగీకరించలేరు
ఇప్పటిక వరకు 15కి పైగా ఎన్జీవోలతో కలిసి పనిచేసిన ఆలిస్ మహిళలు క్షేత్రస్థాయి పనిలో తప్పక వెనుకడుగు వేయాలనే అభిప్రాయం ఉంది. ''ప్రజలు శక్తివంతమైన మహిళలను అంగీకరించలేరు. అలాంటి వారిని ఆధిపత్యం చేలాయిస్తున్నారంటూ ఏదైనా అంటారు. మనం చేసిన కృషిని మాత్రం వారు గుర్తించరు'' అంటున్నారు ఆమె.
మన అభిరుచిని మోసం చేయలేము
ఢిల్లీ యూనివర్శిటీ అనుబంధ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చూస్తోంది. ''నా కుటుంబ సభ్యులు ఈ రోజు నా జీవితాన్ని, నా ఎంపికలను అంగీకరిస్తున్నారు. అది సేవా కార్యక్రమాలు కావొచ్చు లేదా రచయితగా మారడం కావొచ్చు. మొదట్లో భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాను. కానీ మనం ఈ ప్రపంచంలో దేనినైనా మోసం చేయవచ్చు కానీ మన అభిరుచిని కాదు అనే విషయాన్ని నా అనుభవంలో తెలుసుకున్నాను'' అంటుంది ఆలిస్.
- సలీమ