Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన, నాజూకైన కాళ్లు కావాలని ఎవరికుండదు చెప్పండి. ఇందుకోసం ఏయే కసరత్తులు చేస్తే బాగుంటుందో చూద్దామా..
స్క్వాట్స్... ఇవి కాళ్లకు తీరైన ఆకృతిని ఇస్తాయి. తొడలు, పిరుదులు, ఆబ్స్ను తీర్చి దిద్దుతాయి. అలాగే వెన్ను నొప్పిని తగ్గిస్తాయి. కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవారు సులువుగా చేసేయొచ్చు.
ఎలా అంటే... నిటారుగా నిల్చొని కెటిల్బెల్ని రెండు చేతులతో పట్టుకుని ఛాతీకి ఎదురుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా మోకాళ్లు, తుంటిని వంచాలి. ఈ సమయంలో వెన్ను, మెడ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో కాసేపుండి తిరిగి పూర్వపుస్థితికి రావాలి.
బాక్స్ జంప్స్... ఇది కాళ్లు, తొడలు.. మొత్తం శరీరానికే చక్కటి వ్యాయామం. అయితే కొత్తగా చేసేవారు దీన్ని నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. లేదంటే మోకాళ్లకు ప్రమాదం.
ఎలా చేయాలంటే... బాక్స్‌కు కొద్ది దూరంలో నిల్చొవాలి. పాదాలను భుజాలకు సమాంతరంగా పెట్టి... మోకాళ్లను వంచి చేతులను వెనక్కి ఊపుతూ తుంటి భాగాన్నీ వెనక్కి నెట్టి బాక్స్‌పైకి దూకాలి. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని కిందకు దూకాలి. ఈ సమయంలో తుంటి, వీపుపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి మెల్లిగా దూకాలి.