Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు చిన్న విషయాలకే అతిగా స్పందించడం, భావోద్వేగాలను ప్రదర్శించడం తరచుగా చేస్తున్నారేమో గమనించాలి. తోబుట్టువులతో కలవ లేకపోవడం, కుంగుబాటుకు గురయ్యే పిల్లలను పెంచడం అమ్మానాన్నలకి సవాలే. అయినా వారిపట్ల మృదువుగా ప్రవర్తిస్తూ వారి ఆందోళన, అతి సున్నితత్వం వంటి వాటిని దూరం చేయడానికి ప్రయత్నించాలి. అలాకాకుండా అందరిలా నువ్వెందుకు లేవని విమర్శించడం, ఇతరులతో పోల్చడం చేయొద్దు. అలా చేస్తే వారిలో ఆత్మన్యూనత మరింత పెరిగే ప్రమాదముంది.
వారి బొమ్మలు, గదిని వారే సర్దుకొనేలా, శుభ్రం చేసుకునేలా చూడండి. మృదువుగానే వీటిని అలవరచండి. భోజనం తర్వాత ప్లేటు తీయడం, శుభ్రం చేయడం, ఇతరులకు సాయం చేయమనడం లాంటివి చేయించండి. ఇవి వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ఇతరుల గురించి ఆలోచించేలా చేస్తాయి. పరిసర ప్రాంతాలపై అవగాహన, ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి వంటివీ క్రమంగా తెలుస్తాయి.
ఇతర పిల్లలతో వీరిని పోల్చకూడదు. అందరి ముందూ కొట్టడం, అరవడం లాంటివి చేయొద్దు. క్రమశిక్షణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు. బలవంతంగానూ ఏ పనీ చేయించొద్దు. దాని వల్ల ఇంకొంచెం ముడుచుకుపోతారు. ఏదైనా నెమ్మదిగా వాళ్లకి అర్థమయ్యేలా, ఆ పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చెబుతూ ప్రోత్సహించడండి. ఇందుకోసం ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే వారిలోని వ్యతిరేక భావం, అసహనాన్ని తొలగించగలరు. అందరిలో కలిసిపోయేలా చేయగలరు. అయితే ఇదంతా ఏ ఒక్కరోజులోనో అయిపోదు. సహనంతో కృషి చేయాలి. అప్పుడే క్రమంగా ఆ చిన్నారుల్లోనూ మార్పు కనిపిస్తుంది. తన పని తాను పూర్తిచేసినప్పుడు ప్రశంసిస్తే ఆ అభినందన వారిలో ప్రోత్సాహాన్ని నింపుతుంది. వెనకబడినా నేనున్నాననే భరోసానిస్తే.. అందరిలో తప్పక కలిసిపోతారు.