Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ కావాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. గర్భం ధరించిన తర్వాత తనకు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తుంటోందితీ క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, చర్మంపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్, వక్షోజాల్లో పెరుగుదల.. ఇలా మన శరీరం రాబోయే పాపాయికి పాలివ్వడానికి అనువుగా సిద్ధమవుతుంది. అయితే ఒక దశలో ఈ మార్పులన్నీ కాస్త అసౌకర్యానికి గురిచేసినా.. అమ్మవుతున్నానన్న ఆనందం ముందు ఇవి నిలవలేవు. ఇలాంటి ప్రాథమిక విషయాల్ని కూడా తెలియని కొంతమంది గర్భం ధరించిన మహిళల్ని విమర్శిస్తుంటారు. ముఖ్యంగా సెలెబ్రిటీలను మరీ ఎక్కువగా కామెంట్ చేస్తుంటారు. అలాంటి కామెంట్లనే ఎదుర్కొన్నారు ఇటీవల ప్రముఖ టాలివుడ్ నటి కాజల్ అగర్వాల్. అయితే ఆ కామెంట్లపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. అంతే కాదు ఆ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం కొన్ని సూచనలు కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'గర్భం ధరించినప్పట్నుంచి బిడ్డ పుట్టే దాకా మన శరీరంలో వచ్చే మార్పులన్నీ కడుపులో ఎదిగే బిడ్డ ఆరోగ్యం కోసమే. అలాగని ప్రెగెన్సీ శాశ్వతమైనది కాదు. కాబట్టి ఈ నవమాసాలూ సానుకూల దృక్పథంతో ఉండడం ఇటు మనకు, అటు పుట్టబోయే బిడ్డకు చాలా అవసరం. ఇవి పరోక్షంగా బిడ్డ ఎదుగుదలకూ దోహదం చేస్తాయి. అయితే ఇందుకోసం ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం' అంటూ త్వరలో తల్లికాబోతున్న ఆమె కూడా పాటిస్తున్న ఆ సూచనలేంటో చూద్దాం...
మీ మనసులో కలిగే భావాల్ని మీలోనే దాచుకోకుండా మీ భాగస్వామితో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడం అలవాటు చేసుకోండి. తద్వారా మనసు తేలికపడుతుంది. అలాగే వాళ్ల నుంచీ విలువైన సలహాలు పొందచ్చు.
రోజువారీ వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ఈత లేదా నడక వల్ల శరీరం దృఢమవుతుంది. అలాగే మనసూ ప్రశాంతంగా ఉంటుంది.
మీ డాక్టర్ సలహా మేరకు ప్రి-నాటల్ యోగా ప్రయత్నించచ్చు. నెలలు నిండుతున్న కొద్దీ మానసిక ప్రశాంతత పొందడానికి ఇదీ ఓ మార్గమే.
మీ డాక్టర్ అనుమతిస్తే మసాజ్ కూడా చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఈ సమయంలో తలెత్తే మూడ్ స్వింగ్స్, కోపం, చిరాకు.. వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికీ ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
గర్భిణిగా ఉన్నప్పుడు ఏయే పనులు చేయాలి? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి? .. ఇలా ప్రెగెన్సీ గురించి వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాంతో ఈ సమయంలో ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవచ్చు.
మానసిక సహాయం అవసరమైతే తీసుకోవడానికి వెనకాడకండి. మీ సమస్యను నిపుణులతో పంచుకొని వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోండి. వాటిని పాటిస్తూ ప్రెగెన్సీని ఆస్వాదించండి.. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వండి..' అంటూ తన సలహాలతో కాబోయే అమ్మలందరిలో స్ఫూర్తి నింపారు కాజల్.