Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జలుబూ, దగ్గూ లాంటివి ఇబ్బంది పెట్టినప్పుడు చాలామంది చేసే పని వేడివేడి చారన్నం తినడమే. అసలే చలి కూడా కాబట్టి చారును రోజూ తీసుకున్నా మంచిదేనంటున్నారు. అలాగని ఎప్పుడూ ఒకే రుచిలో చేసుకోలేము కదా... అందుకే చారులో కొన్ని కొత్త రుచులు నేర్చుకుందాం...
వెల్లుల్లితో...
కావల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు - పది, చింతపండు - నిమ్మకాయంత, ఎండుమర్చి - రెండు, మిరియాలు - అరచెంచా, దనియాలు - చెంచా, సెనగపప్పు - అర చెంచా, జీలకర్ర - రెండు చెంచాలు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఆవాలు - అరచెంచా.
తయారు చేసే విధానం: కప్పు నీటిలో చింత పండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె పోసి ఎండుమర్చి, మిరియాలు, ధనియాలు, సెనగపప్పు వేయించుకుని వేడి చల్లారాక మిక్సీలో వేసి చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేయించి... ఒకటిన్నర కప్పు చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా వేసి మరికాసిని నీళ్లు పోయాలి. బాగా మరిగాక దింపేయాలి.
కొబ్బరి పాల రసం
కావల్సిన పదార్థాలు: మిరియాలు - చెంచా, దనియాలు - చెంచా, జీలకర్ర - ఒకటిన్నర చెంచా, వెల్లుల్లి రెబ్బలు - మూడు, టొమాటో - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, కరివేపాకు రెబ్బలు - రెండు, చింతపండు - నిమ్మకాయంత, నీళ్లు - కప్పు, పసుపు - పావు చెంచా, ఇంగువ - పావు చెంచా, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కట్ట, కొబ్బరి పాలు - పావుకప్పు, నూనె - చెంచా, ఆవాలు - చెంచా, జీలకర్ర - చెంచా, ఎండుమిర్చి - ఒకటి.
తయారీ విధానం: కప్పు నీటిలో చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. అదే విధంగా మిరియాలు, చెంచా జీలకర్ర, దనియాలు, వెల్లుల్లిని కలిపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె పోయాలి. తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి కరివేపాకు, చింతపండు నీళ్లు, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొత్తిమీదర, కొబ్బరిపాలు పోసి బాగా కలిపి చారు మరిగాక దింపేయాలి. బాణలిని స్టౌమీద పెట్టి మిగిలిన నూనె పోసి అది వేడయ్యాక ఆవాలు, మిగిలిన జిలకర్ర, ఎండుమిర్చి వేయించి చారుపైన తాలింపు వేయాలి. అంతే కొబ్బరి పాలతో చారు రెడీ...
జీలకర్రతో...
కావలసిన పదార్థాలు: చింతపండు - నిమ్మకాయంత, నీళ్లు - పావుకప్పు, టొమాటో - ఒకటి, సాంబరుపొడి - అరచెంచా, జీలకర్ర - ఒకటిన్నర చెంచా, కందిపప్పు - అరటేబుల్ స్పూను, ఎండు మిర్చి - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, నెయ్యి - చెంచా, ఆవాలు - అరచెంచా, కొత్తిమీదర - కట్ట.
తయారు చేసే విధానం: ముందుగా చెంచా జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చిని పావుగంటసేపు నానబెట్టుకుని తర్వాత సగం కరివేపాకు కూడా కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓ గిన్నెలో చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు, టొమాటో ముక్కలు, సాంబారు పొడి, మిగిలిన కరివేపాకు, కొత్తిమీర వేసి స్టౌమీద పెట్టాలి. ఇది మరిగాక ముందుగా చేసుకున్న మిశ్రమం వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. చారు మరగడం మొదలు పెట్టినప్పుడు దింపేయాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి చారుపైన వేసి ఓసారి కలపాలి.
పుదీనతో...
కావల్సిన పదార్థాలు: టొమాటోలు - రెండు, పుదీనా ఆకులు - గుప్పెడు, చింతపండు గుజ్జు - రెండు చెంచాలు, నూనె - చెంచా, జీలకర్ర - ఒకటిన్నర చెంచా, మిరియాలు - చెంచా, పసుపు - పావు చెంచా, ఉప్పు - తగినంత - కరివేపాకు రెబ్బలు - రెండు, నెయ్యి - చెంచా, ఆవాలు - అరచెంచా, ఎండుమిర్చి - ఒకటి, కొత్తిమీర - కట్ట.
తయారీ విధానం: ముందుగా చెంచా జీలకర్ర, మిరియాలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. అది తీసేసి పుదీనా, ఒక టొమాటో, చింతపండు గుజ్జును కూడా మిక్సీలో మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె పోసి పుదీనా మదిశ్రమాన్ని వేయాలి. ఐదు నిమిషాలయ్యాక ఇందులో కప్పు నీళ్లు, పసుపు, మిగిలిన టొమాటో ముక్కలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. నీళ్లు వేడెక్కాక మరో కప్పు నీళ్లు పోయాలి. ఇది మరగడం మొదలువుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఎండుమిర్చి, ఆవాలు, మిగిలిన జీలకర్ర వేయించి చారులో వేసి ఓసారి కలిపితే చాలు.