Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనిచేసే చోట మీరు అనుకున్న లక్ష్యం సాధించాలంటే నిరంతర సాధన తప్పనిసరి. అందుకోసం మిమ్మల్ని మీరు ప్రతీ క్షణం ప్రోత్సహించుకోవాలి..
మీరు ఏయే లక్ష్యాలను పూర్తి చేయాలనుకుంటున్నారో అనే విషయాన్ని ముందు నిర్ణయించుకోవాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి. అయితే ఒక్కరోజులో దాన్ని సాధించలేరనే విషయం గుర్తుంచుకోండి. దాన్ని చేరుకోవడానికి చిన్న చిన్న మెట్లను ఏర్పరుచుకోండి. రోజులో మీకు అతిముఖ్యమైన పనిని ముందు చేయడానికి సిద్ధం కండి.
ఏ రంగంలో ఉన్నా నిరంతర శోధన తప్పనిసరి. అప్పుడే ఆయా రంగాల్లో సత్తా చూపగలుగుతారు. ఇందుకోసం నిరంతర పర్యవేక్షణ, నేర్పు చాలా అవసరం. పనికి సంబంధించి రోజుతో మొదలుపెట్టి వారానికి సరిపడా ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా ముందుకు సాగాలి.
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు చేస్తున్న పనిలో అర్థం కాని విషయాలను సహోద్యోగులు లేదా పై అధికారినో లేదా ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిని అడిగి నివృత్తి చేసుకోవాలి. అడిగితే ఏమనుకుంటారో అన్న మీమాంస వద్దు.
లక్ష్యాన్ని ఓ చోట కనిపించేలా రాసి పెట్టుకోవాలి. నిరంతరం దాన్ని చూస్తూ ఉంటే సాధించాలనే తపన పెరుగుతుంది. ఆ రోజుకు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తే మీకు మీరే శభాష్ అనుకోండి. వీలైతే ఓ కేకో, చాక్లెట్తోనో పండగ చేసుకోండి.
మీ చుట్టూ స్ఫూర్తిమంతమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. అలాగే వారి సూచనలు, సలహాలను తీసుకుంటూ ముందుకు నడవాలి. మీ లక్ష్యసాధన ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని సమీక్షించుకోండి. ఇది చాలా అవసరం.
లక్ష్యానికి సంబంధించిన విషయాలపైనే దృష్టి పెట్టాలి. మిగతా వాటికి ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.