Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పడుకున్న వెంటనే నిద్రపట్టకపోవడం చాలామందికి ఉండే సమస్య. కంటికి సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు పనితీరుతో పాటు మన శరీరంపైనా ప్రభావం పడుతుంది. రోజుకు ఏడు గంటల కంటే తక్కువ టైమ్ నిద్రపోయే వారి బరువు కంట్రోల్లో ఉండదు. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. నిద్ర పట్టడానికి లేదా పట్టకపోవడానికి మనం తీసుకునే ఆహారం కూడా కారణం అవ్వొచ్చు. పడుకునే ముందు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే రాత్రివేళ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అవేంటో చూద్దాం.
పాలు: పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తాగితే వెంటనే నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ పాలు తాగడం ద్వారా నిద్రలేమి సమస్యలను అధిగమించవచ్చు. పాలలో నిద్రను ప్రేరేపించే న్యూరోట్రాన్స్మీటర్స్ ఉంటాయి.
అరటిపండు: అరటిపండ్లు తినడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన కార్బోహైడ్రేట్స్, పొటాషియం, మెగ్నీషియం.. మంచి నిద్రకు సాయపడతాయి. అరటి పండ్లు తినడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
పెరుగు: పెరుగు, యోగర్ట్ లాంటి ప్రొబయాటిక్స్ తినడం వల్ల కడుపులో హాయిగా అనిపిస్తుంది. ప్రొబయాటిక్స్ తినడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుతాయి. అంతేకాదు యోగర్ట్‌లోని అమైనో యాసిడ్స్ మెలటోనిన్, సెరటోనిన్‌ను విడుదల చేయడానికి తోడ్పడతాయి. తద్వారా మంచి నిద్ర పడుతుంది.
కివి ఫ్రూట్స్: రోజూ కివి పండ్లు తినడం వల్ల నిద్ర క్వాలిటి మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కివి పండ్లలో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి సెరోటిన్ లెవల్స్‌ను పెంచుతాయి. దాంతో సుఖమైన నిద్ర పడుతుంది.
నట్స్: పడుకునే ముందు బాదం, వాల్ నట్స్ లాంటివి తినడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. వీటిలో ఉండే మెలటోనిన్, ట్రెప్టోఫోన్, మెగ్నిషియం లాంటివి నిద్ర క్వాలిటిని పెంచుతాయి. మజిల్స్‌ను రిలాక్స్ చేస్తాయి.
ఇవి తినొద్దు
నిద్రను మనకు దూరం చేసే ఫుడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫీన్ లాంటివి నిద్రకు శత్రువులుగా చెప్పొచ్చు. ఈ ఫుడ్స్ వల్ల మెదడులోని ట్రాన్స్ మీటర్లు యాక్టివ్ అయ్యి.. నిద్ర పట్టకుండా చేస్తాయి. వీటితోపాటు చాక్లెట్, ఉల్లిగడ్డ, టమాటాలు కూడా నిద్రించే ముందు తీసుకోకపోవడమే మంచిది.
జంక్ ఫుడ్స్: కడుపులో ఎసిడిటీని పెంచే సిట్రస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రి సమయంలో పిజ్జా, బర్గర్, చాక్లెట్, ఐస్ క్రీమ్‌ల వంటివి తినడం వల్ల అవి సరిగ్గా జీర్ణం అవ్వక కడుపులో గందరగోళంగా ఉండి నిద్ర పట్టదు. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల అలసట వస్తుంది. చాక్లెట్స్‌లో ఉండే కెమికల్స్, షుగర్స్ తొందరగా నిద్ర పట్టకుండా చేస్తాయి. అలాగే కాఫీ, కూల్ డ్రింక్స్ కూడా నిద్రపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నప్పుడే నిద్ర సాధ్యమవుతుంది. అందుకే నిద్రించే ముందు తేలికపాటి ఆహారాలు తినాలి.