Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె ఓ మాజీ ఎఏఎస్ అధికారి. వారాంతరాల్లో గిరిజనులైన సబర్ తెగ ప్రజలను కలవడానికి 96 కి.మీ. ప్రయాణిస్తారు. రాంచీ నుండి జార్ఖండ్‌లోని సరైకేలా జిల్లాలోని కుగ్రామాలకు వెళతారు. ఆమె పేరు సుచిత్రా సిన్హా... క్కడకు వెళ్ళేటపుడు ఆమె బ్యాగులు స్వీట్లు, బట్టలతో పాటు బంధువులు, పరిచయస్తులు విరాళంగా ఇచ్చిన వస్తువులతో నిండి ఉంటాయి. అంతేనా తనను 'మాయి' (అమ్మ) అని ప్రేమగా పిలుచుకునే ఆ గిరిజన ప్రజల కోసం ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఇంతకీ ఆమె వారి కోసం ఏమేమి చేస్తున్నారో తెలుసుకుందాం...
సుచిత్రా సిన్హా తొలిసారిగా 1996లో సబర్ తెగ వారు స్థానికంగా పెరిగిన గడ్డితో తయారు చేస్తున్న బుట్టలను చూసారు. అప్పటి నుండి ఆమె అంతరించిపోతున్న ఆ తెగ ప్రజలను, వారి నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా అక్కడి గిరిజనులను ఆమె కలుస్తూనే ఉన్నారు. ఆమె 1996లో జంషెడ్‌పూర్‌లో ఉద్యోగంలో ఉన్నప్పుడు మొదటిసారిగా వారిని కలుసుకున్నారు.
అత్యంత పేదవారిగా...
''కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు సబర్ ఆదివాసీల కోసం విరాళాలు అడగడానికి నా కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఈ తెగను ప్రత్యేకించి దుర్బలమైన గిరిజన సమూహంగా పరిగణించారని నాకు తెలుసు. కానీ వారిని ఎప్పుడూ కలవలేదు. ఆ ప్రజలు కలవాలనుకుంటే వారు నన్ను వారి వద్దకు తీసుకెళతామన్నారు. నేను అంగీకరించాను. ఆ సమయంలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్నందున వారి ప్రాంతానికి చేరుకోవడం అంత సులభం కాదు. కాబట్టి బయటి వ్యక్తులను అనుమతించలేదు'' అని సుచిత్ర చెప్పారు. కొంత కాలం తర్వాత ఆమె వారి గ్రామాలకు వెళ్ళినపుడు వారు ''పేదవారిలోనే అత్యంత పేదవారుగా'' ఉండడాన్ని ఆమె గుర్తించారు.
జంతువులను తిని బతకాల్సిందే
''వారి ఇళ్ళు వెదురుతో కట్టివున్నాయి. పైగా ఆ ఇళ్ళు నాలుగు అడుగుల కంటే ఎక్కువ పొడవు లేవు. వారు లోపలికి వెళ్ళాలంటే చాలా వంగి వెళ్ళాల్సి వుంటుంది. తినడానికి వారికి ఏమీ లేదు. ఆహారాన్ని వండడానికి మట్టితో చేసిన పాత్రలు విరిగిపోయాయి. దాతలు వారికి ఆహారాన్ని పంపిణీ చేయడం మానేస్తే చనిపోయిన జంతువులను తినడం తప్ప వారికి వేరే మార్గం లేదని నాకు చెప్పారు. పిల్లలకు వేసుకోవడానికి బట్టలు లేవు'' అని ఆమె జార్ఖండ్‌లోని సరైకేలా జిల్లాలోని నిమ్డిV్‌ా బ్లాక్‌కు తన మొదటి సందర్శన సమయంలో చూసిన దృశ్యాలను గుర్తుచేసుకున్నారు.
వారి దీనస్థితిని చూసి
ఇది దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆదివాసీలలో అంతరించిపోతున్న తెగ ఇది. కేవలం 216 కుటుంబాలతో సబర్‌లు తమ మనుగడ కోసం ప్రధానంగా అడవిపై ఆధారపడి ఉన్నారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పుష్కలంగా లభించే ఆరడుగుల ఎత్తున్న కంసి గడ్డిని ఖర్జూర ఆకులతో నేస్తూ గిరిజనులు బుట్టలను తయారు చేస్తున్నారు. సబర్‌లు ఈ బుట్టలను కేవలం రూ.50కే విక్రయించారు. వారి దీన స్థితిని చూసిన సుచిత్ర తీవ్రంగా కలత చెందారు. వారు తయారు చేసిన బుట్టల పట్ల ఆమెకు ఎంతో ఆసక్తి కలిగింది. అతి తక్కువ కాలంలోనే ఆమె ఆ గిరిజనులకు ఆహారం, పౌల్ట్రీ మొదలైన వాటిని అందించడానికి ప్రభుత్వ నిధులను కేటాయించారు. అయినప్పటికీ ఇది వారి పరిస్థితితో మార్పు తీసుకురావడానికి సరైన పరిష్కారం కాదని ఆమెకు తెలుసు.
సబర్లను పునరుద్ధరించడం కోసం
1998లో ఆమె న్యూ ఢిల్లీకి బదిలీ చేయబడ్డారు. అక్కడ ఆమెకు బహుమతిగా గిరిజనుల సంప్రదాయ బుట్టల్లో ఒకదాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఆమె దానిని హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కమీషనర్‌కి చూపించారు. అతను దానిని చూసి చాలా సంతోషించాడు. జార్ఖండ్ సాంప్రదాయ క్రాఫ్ట్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఆమెకు ఐదు ప్రాజెక్ట్‌లను అప్పగించారు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా సుచిత్ర ఢిల్లీలోని ఎన్ఐఎఫ్టి నుండి డిజైనర్లతో కనెక్ట్ అయ్యారు. వారి క్రాఫ్ట్, డిజైన్‌ను మెరుగుపరచడానికి ఆదివాసీలతో కలిసి పనిచేయడానికి వారిని కుగ్రామాలకు పంపారు.
152 నమూనాలు ఉత్పత్తి చేశారు
సబర్‌లు నివసించే 12 గ్రామాలలో ముందు మూడు కుగ్రామాలైన భంగత్, మకులా, సమన్పూర్లను ఎంపిక చేసుకుని అక్కడి గిరిజనులతో కలిసి సుచిత్ర తన పనిని ప్రారంభించారు. క్రమంగా ఆమె మొత్తం 12 కుగ్రామాలకు చేరుకున్నారు. వారు బ్యాగులు, టేబుల్ ల్యాంప్‌లు, ప్లాంటర్లు, డెకర్ వస్తువులు, బుట్టలు మొదలైన వాటితో సహా మొత్తం 152 నమూనాలను రూపొందించారు. వీటిని హస్తకళా రూపకల్పన అధికారులకు ప్రదర్శించడానికి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆమె 1986లో దస్త్కర్ హాట్ సమితి వ్యవస్థాపకురాలు జయ జైట్లీ, క్రాఫ్ట్ కార్యకర్త లైలా త్యాబ్జీ వంటి ప్రఖ్యాత వ్యక్తులకు కూడా ఆ ఉత్పత్తులను చూపించారు. ''ఎన్ఐఎఫ్టి డిజైనర్లు కేవలం ఆంగ్లంలో మాట్లాడటం, ఆదివాసీలకు హిందీ కూడా తెలియకపోవడం ఆసక్తికరంగా ఉండేది. కానీ ఒక నెల కలిసి పనిచేసిన తర్వాత వారిద్దరి కళ్లలో నీళ్లు వచ్చాయి'' అని సుచిత్ర గుర్తుచేసుకున్నారు.
అంబాలికను ఏర్పాటు
2002లో సుచిత్ర సబర్ తెగ అభివృద్ధి కోసం 'అంబాలికా' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో వారి నైపుణ్యాన్ని బాగా ప్రోత్సహించేవారు. ప్రభుత్వ, కార్పొరేట్ ప్రాజెక్టులు పొందడం కష్టంగా మారినప్పటికీ సుచిత్ర దానిని కొనసాగించారు. సబర్లకు మెరుగైన ఉపాధి కోసం తనకు చేతనైనదంతా చేసేవారు. అయితే 2005 నాటికి ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యం పెరగడంతో ఆమె తన పనికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది.
శిక్షణ నిలిపివేయాల్సి వచ్చింది
''నేను ఒక వెనుకడుగు వేయవలసి వచ్చింది. డిజైనర్లు, ఇతరుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నందున శిక్షణను నిలిపివేయవలసి వచ్చింది. అప్పటికి సబర్‌లు గడ్డితో రకరకాల వస్తువులను తయారు చేయడం నేర్చుకున్నారు. కానీ చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ప్రచారం చేసే దశకు వచ్చాక మేము మా పనిని ఆపవలసి వచ్చింది'' అని సుచిత్ర చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తే బాంబు పేలుళ్లు జరుగుతాయని ఆమె అన్నారు. దాంతో ఆమె గిరిజనులను సందర్శించడం మానేశారు. కానీ ఆమె వారి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయారు.
నగరానికి రావడమే గొప్ప
''ఇది 2011లో జరిగింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. 15-20 సబర్లను ట్రేడ్ ఫెయిర్‌కు తీసుకురావడానికి స్థానికులతో మళ్లీ పరిచయం ఏర్పరుచుకోవడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. నేను దానిని నిర్వహించగలిగాను. ఇన్నాళ్లూ డిజైన్ని మరచిపోయిన వారి ఉత్పత్తులు అంత గొప్పవి కావు. కానీ ఇంత వెనుకబడిన ప్రాంతం నుండి వాటిని వాణిజ్య ప్రదర్శన కోసం నగరానికి తీసుకురావడం ఒక గొప్ప విషయం'' అని ఆమె చెప్పారు.
వారి విశ్వాసం బలంగా మారింది
సుచిత్ర సబర్లతో తన పని తిరిగి ప్రారంభించారు. 2012లో అదే సంవత్సరం జరిగిన బ్రిక్స్ కాన్ఫరెన్స్ కోసం చేతితో రూపొందించిన ఫైల్ ఫోల్డర్లను తయారు చేసే అవకాశం వచ్చింది. ఆదివాసీలు తమ సంపాదనను చూసినప్పుడు సుచిత్రపై వారి విశ్వాసం బలంగా మారింది. వారు తమ ప్రాంతం నుండి నక్సల్స్‌ను తరిమికొట్టారు. ఏది ఏమైనప్పటికీ గిరిజనులు ఈ ప్రాంతాన్ని చాలా రక్షించుకుంటారు. పౌర ఆక్రమణలను ప్రోత్సహించరు. అందుకే తమ వద్దకు వచ్చిన వారిపై బాణాలు వేస్తారు. దీనివల్ల వైద్యం, విద్య, పారిశుధ్యం వంటి ప్రభుత్వ సహాయం వారికి చేరడం లేదు.
నిరుపయోగంగా ఉన్న భవనంలో...
మహమ్మారి కాలంలో కొంతమంది గిరిజనులు అనారోగ్యానికి గురైనప్పుడు సుచిత్ర ఆరోగ్య కార్యకర్తలను పిలిపించారు. వారు ఆ కుగ్రామాలకు చేరుకోవడానికి, లోపలికి ప్రవేశించడానికి సుచిత్రను స్పీకర్‌ఫోన్‌లో ఉంచవలసి వచ్చింది. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని గిరిజనులకు విరాళంగా ఇవ్వాలని ఆమె ప్రభుత్వం కోరారు. ఇప్పుడు వారు దాన్ని తమ ఉత్పత్తులను తయారు చేసే కేంద్రంగా ఉపయోగిస్తున్నారు.
వారి ఆదాయం పెరిగింది
90వ దశకం చివరలో సబర్‌లు నెలకు రూ. 500 - రూ. 600 సంపాదించడానికి చాలా కష్టపడేవారు. సుచిత్ర ప్రయత్నాల కారణంగా వారు ఇప్పుడు నెలకు రూ. 4000 నుండి రూ. 7000 వరకు సంపాదిస్తున్నారు. వారి ఉత్పత్తులు రూ. 600 - రూ. 3000 మధ్య ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాగే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కూడా అవి దొరుకుతున్నాయి. సుచిత్ర కూడా ఈ ఉత్పత్తులను ఈకామర్స్ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన అంబాలికా ద్వారా క్రాఫ్ట్ట్రిబ్ ద్వారా విక్రయిస్తున్నారు.