Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ వదిలే సవాలును స్వీకరించడానికి ప్రజలు అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. మొదటి రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న వారు బూస్టర్ డోసు వేయించుకోవడానికి నమోదు చేసుకోవాలి. మొదటి రెండవ వ్యాక్సిన్ డోసులు పూర్తి కానివారు ముందుగా వాటిని వేయించుకోవాలి. అప్పుడే కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు లెక్క. ప్రజలకు అన్ని సమాచారాలను ఎల్లవేళలా అందుబాటులో ఉంచడమే ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పని. కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఒక్క రోజులోనే 1400 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ధర్డ్‌వేవ్‌లో కరోనా వైరస్ ప్రతి ఇంట్లో అందరినీ పలకరించి వెళ్తోంది. చాలా సాధారణమైన జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఇల్లిల్లూ తిరుగుతోంది. డోలో టాబ్లెట్లతో, నాలుగైదు రోజుల ఇబ్బందితో ప్రతివారూ కోలుకుంటున్నారు. మొదటి రెండవ వేవ్ల్లాగా తీవ్రంగా లేనప్పటికీ మన జాగ్రత్తల్లో మనం కచ్చితంగా ఉండాలి. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటిస్తే ఎంతో మేలు. ఇంటి వద్ద ఉన్నప్పుడు కళాత్మకంగా ఆరోగ్య విషయాలు తెలుసుకోండి.
జీడిపప్పుతో...
ఇప్పటి వరకూ జీడిపప్పుతో బొమ్మలు చేశాను గానీ జీడిపిక్కలతో చెయ్యలేదు. కారణం జీడి పిక్కలు కావాలంటే జీడి కాయలు కావాలి కదా! కాయలు కూడా బజార్లో దొరికినపుడు పిక్కలు కోసేసే అమ్ముతారు. వేటపాలెం, పలాస వంటి చోట్ల జీడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మా ఊరంతా జీడి మామిడి తోటలే ఉంటాయి. కాబట్టి ప్రతి వంటకంలో జీడిపప్పులను వాడుతుంటాం. నాకిప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ తోటలో చెట్టు నుండి రెండు జీడికాయలు వచ్చాయి. కాయలు తిని పిక్కలు దాచాను. ఈ పిక్కల్ని కాల్చి జీడిపప్పును తయారు చేస్తారు. పిక్కలు ఫ్రిజ్‌లో ఉండి ఎండిపోయాయి. అప్పుడు ఎండిన జీడి పిక్కల్ని బయటకు తీసి ఏదైనా బొమ్మ చెయ్యాలని అనుకున్నాను. దీని ఆకారం కొద్దిగా వంపు తిరిగా ఉండటం మూలంగా మూత్ర పిండాల్ని చెయ్యాలనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఈ పిక్కలు రెండింటికీ ఎరుపు రంగు వేసేశాను. మూత్ర పిండాల ఆకారం వచ్చేసింది. ఒక డ్రాయింగ్ షీట్ మీద ఈ రెండింటిని అతికించాను. మూత్ర పిండాల నుండి విసర్జకాలు మూత్రాశయాన్ని చేరతాయి. ఇవి మూత్ర నాళాల ద్వారా మూత్రాశయంలోనికి వెళతాయి. కాబట్టి మూత్ర నాళాలను, మూత్రశయాన్ని పెట్టాను. మూత్ర నాళాల కొరకు సెలైన్ పైపులను కత్తిరించి ఎరుపు రంగును వేసి పెట్టాను. మూత్రాశయం కొరకు ఒక రాయిని పెట్టాను. దీనికి పసుపు రంగును వేశాను. ఇది స్కూల్లో పిల్లలకు పనికొచ్చే మోడల్లా తయారైంది. జీడి పిక్కలతో మూత్ర పిండాలు చక్కగా అమిరాయి.
పచ్చి బఠానీలతో...
ఇంట్లో కూరల్లో వేసుకోవడానికి బఠానీ కాయలు తెచ్చుకున్నాం. బఠానీ కాయలతో మిడతలు చేశాను. వాటిని వలిచాక గింజలతో మూత్ర పిండాల్ని తయారు చేశాను. ఆకుపచ్చని మూత్ర పిండాలు తయారైనాయి. జన్యు శాస్త్రంలో మెండల్ చేసినటువంటి ప్రయోగాలన్నీ బఠానీ చెట్లపైనే జరిగాయి. ''లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్'' వంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు బఠానీ మొక్కల విత్తనాలు, పొడుగు, పొట్టి రకాలపై ప్రయోగాలు చేశాడు మెండల్. అందువల్ల పచ్చి బఠానీ మొక్క జన్యుశాస్త్రంలో ప్రధాన పాత్ర పోషించింది. ''పైసమ్ సెటైవమ్'' అనబడే ఈ బఠానీ గింజలు ఈరోజు మూత్రపిండాలుగా దర్శనమిచ్చాయి. బఠానీ మొక్కలు తీగజాతి మొక్కలు. ఇవి ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలు. పచ్చి బఠానీలను కూరలలోనూ, ఎండిన బఠానీలను చిరుతిండిగానూ తిటుంటారు. బఠానీలు చిరుతిండిగా ఎంత బాగా సరిపోయాయి అంటే ''కాలక్షేపపు బఠానీలు'' అని పేరు పడేంతగా. చిక్కుడు కాయలాంటి కాయలో వరుసగా పేర్చబడ్డ ఆకుపచ్చ ముత్యాల వలె గింజలు ఉంటాయి. ప్రతి మనిషిలోనూ ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. కేవలం మనిషిలోనే కాదు సకశేరుకాలు అన్నింటిలోనూ ఉంటాయి. ఇవి గోధుమ ఎరుపురంగులో ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మానవులలో సుమారు 12 సెం.మీ.ల పొడవుతో ఉంటాయి. మానవులలో మూత్ర పిండాలు పొత్తి కడుపు కుహరంలో ఉంటాయి.
ఇంజక్షన్ మూతలతో...
ఇంజక్షన్ సీసాల మీద ఉండే రంగురంగుల ప్లాస్టిక మూతలతో నేను మూత్ర పిండాలను రూపొందించాను. మూత్రపిండాల పనితీరు గురించిన కవితలు కూడా రాశాను. అంతే కాదు మానవ శరీర అవయవాలపై పొడుపు కథలు రాసి పుస్తకం ప్రచురించాను. మూత్ర పిండాలకు అనేక పొడుపు వ్యాధులు వస్తాయి. వాటిని నివారించడానికి యూరాలజిస్టులు, నెప్రాలజిస్టులు అనే వైద్య నిపుణులు ఉంటారు. మంచినీరు తక్కువగా తాగే వారిలో మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడటం సర్వసాధారణంగా చూస్తున్నాము. మూత్రపిండాలకు క్యాన్సర్లు. దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయి. దీర్ఘ కాలిక మూత్ర పిండ వ్యాధులు సంభవించినప్పుడు వాటిలోని కణజాలం పూర్తిగా నశించినపుడు మూత్రపిండ మార్పిడి జరుపుతారు. కొంత కాలం డయాలసిస్ అనే చికిత్స ద్వారా మూత్ర పిండాలకు చికిత్స జరుగుతుంది. కొన్ని రకాల మూత్ర పిండాల వ్యాధులు పుట్టుకతో సంభవిస్తుంటాయి.
చిక్కుడు గింజలతో...
మూత్ర పిండాలు చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయని చెప్పుకున్నాం కదా! మరి చిక్కుడు గింజలతో మూత్ర పిండాల్ని తయారు చేయటం సమంజసం. నేను ఇంట్లో దాచుకున్న ఎండిన చిక్కుడు గింజలతో మూత్రపిండాల్ని తయారు చేశాను. ఈ రోజులలో మూత్ర పిండాల వ్యాధులు రావడానికి కారణం మారిన మన జీవనశైలియే అని వైద్యులు చెబుతున్నారు. సమస్యను ముందుగా గుర్తించలేకపోవడం వల్ల మూత్ర పిండాలకు తీవ్ర నష్టం కలిగి వాటి మార్పిడికి దారి తీస్తోంది. బి.పి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇంట్లో ఎవరికైనా డయాలిసిస్ సమస్యలు ఉనా, అరవై సంవత్సరాలు పైబడినా తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ జబ్బు ఉన్న వారిలో నలభై శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. చిక్కుడు గింజల మూత్ర పిండాల్ని బ్రౌన్ రైస్‌తో నింపి నిండు గోధుమరంగు వచ్చేలా ప్రయత్నించాను.
వెంటిలేటర్ వేస్టుతో...
ఇందులో వచ్చే ప్లాస్టిక్ పదార్థాలతో బొమ్మలు చేస్తూనే ఉన్నాను. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే వెంటిలేటర్ల మీదకి వెళ్ళే సమస్యల్ని నివారించినట్లే. శరీరంలో ఉన్న వ్యర్థాలను కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కిడ్నీ మందకొడిగా మారితే వ్యర్థాలు బయటకు పోక చేతులు, కాళ్ళు, ముఖం ఉబ్బుతాయి. కిడ్నీలు 'ఎరిథ్రోపోయిటిన్' అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోను ఎర్రకర్తకణాలు ఆక్సిజన్‌ను మోసుకెళ్ళడంలో తోడ్పడతాయి. ఎప్పుడైతే కిడ్నీ వ్యాధి బారిన పడుతుందో హార్మోనును ఉత్పత్తి చేయదు. హార్మోను సరిగా స్రవించకపోవడంతో ఆక్సిజన్ కొన్ని ఎర్రరక్తకణాలే మోసుకెళ్తాయి. ఫలితంగా కండరాలు, మెదడు త్వరగా అలసటకు గురవుతాయి. ఏ పనీ చేయకుండానే నిస్సత్తువకు లోనవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తరచుగా మూత్రానికి వెళ్ళాల్సిరావడం, మూత్రంలో రక్తం రావడం వంటి సమస్యలు ఉన్నట్లైతే కిడ్నీ జబ్బుపడిందని అనుకోవచ్చు. మూత్రం రంగు మారినా, మూత్ర విసర్జన సమస్యలు, సమయాల్లో తేడాలు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. చర్మంపై దద్దుర్లు, దురదలు కూడా రావచ్చు కిడ్నీ వ్యాధుల్లో.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్