Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ చేసేదే అయినా.. వారాంతాల్లో ఇంటి శుభ్రత విషయంలో మరింత దృష్టిపెడుతుంటారు చాలా మంది. ఉద్యోగినులైతే దొరికేది ఆ ఒక్కరోజే కాబట్టి ఇలా ఉపయోగించేస్తుంటారు. కానీ దాని వల్ల సాయంత్రానికి అలసిపోతారు. అందుకే ఈ సూచనలు పాటిస్తే మీ పని సులువవుతుంది.
ఈ పనికి ఇంత అని సమయాన్ని నిర్ణయించేసుకోకండి. హడావుడీ అవుతుంది, ఒక రకమైన ఒత్తిడి. దీని ఫలితమే విసుగు. కాబట్టి దేని తర్వాత ఏది అన్నది మాత్రమే నిర్ణయించుకోండి. శుభ్రత విషయంలో మల్టీటాస్కింగ్ పెట్టుకోకండి. ఉదాహరణకు.. గది తుడుస్తున్నారనుకోండి. అది అయిపోయింది కదా అని మంచం మీద దుప్పట్లు మార్చేసి, వేరే గదికి వెళ్లడం లాంటివి చేయొద్దు. త్వరగా అయిపోతుందని భావించినా.. భ్రమే. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్లండి.
చాలామంది అయిపోతున్న వాటి గురించి మర్చిపోతుంటారు. తీరా ఖాళీ డబ్బా కనిపించాక అరే 'మర్చిపోయానే' అనుకుంటారు. అయిపోయిన వాటిని కొనాల్సిన జాబితాలో రాసుకున్నాకే పడేయండి. అప్పుడు మర్చిపోం.
వార్తాపత్రికలు పాత పేపర్ల వాళ్లకు ఇచ్చేస్తాం అని తెలిసీ సర్దే ప్రయత్నం చేయకండి. దీనికన్నా ఓ బ్యాగులో పెట్టేస్తే ఆ సమయాన్ని వేరే దానికి ఉపయోగించొచ్చు. పుస్తకాల అరను సర్దేటప్పుడు ఆసక్తి కలిగినా పుస్తకాన్ని తెరవకండి. సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు.
గంటకోసారి అలా కూర్చోండి. టీవీ చూడటం, పడుకోవడం లాంటివి చేయొద్దు. చివరగా.. చెత్తను వెంటనే చెత్తకుండీలోకి చేర్చండి. చూసుకోకుండా తొక్కినా, చిందరవందర చేసినా పని అదనమవుతుంది.