Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగినుల పరిస్థితి రెండు పడవల మీద ప్రయాణమే. ముఖ్యంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది మరీ కష్టం. కనుకనే పిల్లల పెంపకం కోసం 43 శాతం మంది మహిళలు ఉద్యోగాలు వదులుకుంటున్నట్టుగా సర్వేల్లో తేలింది. కొందరు మహిళలు రెండు బాధ్యతలూ విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు అనుసరిస్తున్న మార్గాలివి..
- చేయాల్సిన పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ సమయంలో ఇంత పని చేసేయాలి అనే నియమం పెట్టుకుంటే అది వేగంగా, సక్రమంగా జరిగి పోతుంది. లేదంటే కాలయాపనతో పని పూర్తవ్వదు, ఒత్తిడి పెరుగుతుంది.
ఉద్యోగినులు తాము ఒంటరులు కాదని గుర్తుం చుకోవాలి. భాగస్వామితో ముందుగానే చర్చించి తోడ్పాటు కావాలని చెప్పి, కొన్ని పనులు అప్పగించండి. తన ఇబ్బందిని చెప్ప కుండా అన్నీ చేసేస్తే తర్వాత మితి మీరిన పనిభారంతో శారీరక, మానసిక అనారోగ్యాలు తప్పవు. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటే ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండొచ్చు.
ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే పగలు పిల్లల ఆలనాపాలనా వాళ్లు చూసుకోగలుగుతారు. లేదంటే పిల్లలను కనిపెట్టుకుని ఉండటం కోసం ఆయాని మాట్లాడండి. లేదంటే డే కేర్ సెంటర్లో చేర్చండి.
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఏం కూరలు లాంటివి రాత్రే నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవడం సులువైన పద్ధతి. రాత్రిపూటే కూరలు తరిగి ఉంచితే ఉదయం హడావుడి లేకుండా వంట పని పూర్తవుతుంది.
ఇంట్లో అందరికీ క్రమశిక్షణ అలవాటు చేయండి. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనులు వాళ్లు చేసుకునేలా తర్ఫీదివ్వండి. దుస్తులూ సాక్సుల్లాంటివన్నీ అందించాలంటే సమయం సరిపోకపోవడమే కాదు, వారికి బాధ్యత అలవడదు కూడా.
చాలా ఇళ్లల్లో టీవీ వల్ల సమయమంతా వృథాగా గడిచిపోతుంటుంది. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడమూ సర్వసాధారణం. కనుక ఇంటిల్లిపాదీ స్క్రీన్ టైం తగ్గించేలా చూడండి.
యాంత్రికతను నివారించేలా వారాంతంలో సినిమాకో షికారుకో వెళ్లండి. ఇది అలసటను తగ్గించి కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది.