Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో రాత్రి పూట చపాతీ తినటం అందరికి అలవాటు అయిపోయింది. ఉదయం పూట చపాతీ చేసిన అదొక స్పెషల్ టిఫిన్ లాగా చెప్పుకోవలసి వస్తోంది. ఒక్కొక సారి చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి. పారేయటానికి మనసొప్పదు. అప్పుడే చేసిన వాటిలాగా ఫ్రెష్‌గా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వాటిని కొంచం మార్చి స్నాక్ ఐటమ్ లాగా చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ వెరైటీ స్నాక్స్ ఏంటో చూద్దామా మరి...
రిబ్బన్ చపాతీ స్నాక్
కావలసిన పదార్ధాలు: చపాతీలు - రెండు, టమాటో - ఒకటి, ఉల్లిగడ్డ - ఒకటి, నూనె - కొంచం, ఉప్పు - సరిపడా, పచ్చి మిర్చి - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - గార్నిష్ కోసం.
తయారు చేయు విధానం: ముందుగా చపాతీలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, టొమాటోలను సన్న ముక్కలుగా తరుక్కోవాలి. పచ్చి మిర్చి సన్నగా పొడవుగా, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఆ తర్వాత బాండీలో తగినంత నూనె పోసి వేడెక్కాక ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి, టమాటోలను వేసి కొంచం సేపు మూత పెట్టి ఉంచాలి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చపాతీ ముక్కలను వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత చెంచా ఉప్పు వేసి కలపాలి. స్టవ్ మీద నుంచి దించేముందు కొత్తిమీర సన్నగా తరిగి చల్లుకోవాలి. కొంచం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుని తినాలి. దీని రుంచి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నిమ్మకాయ వద్దనుకుంటే సాస్‌తో తినవచ్చు.
చపాతీ లడ్డు
కావలసిన పదార్ధాలు: చపాతీలు - మూడు, బెల్లం - ఒక కప్పు, నెయ్యి - అర కప్పు, ఏలకులు - నాలుగు, జీడిపప్పు - ఎనిమిది, కిస్మిస్ - ఎనిమిది.
తయారు చేయు విధానం: ముందుగా చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా సన్నగా తురుముకుని లేదా పొడి చేసికొని ఒక కప్పు నిండా వచ్చేలా చేసుకోవాలి. బాండీలో కొంచం నెయ్యి పోసి వేడి చ ఏసి చపాతీ పొడిని వేయాలి. రెండు నిమిషాల తర్వాత బెల్లాన్ని కూడా వేయాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో ఏలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపాలి. కొంచం చల్లారిన తర్వాత కొద్దీ కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. ఇవి తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి.
చపాతీ హల్వా
కావలసిన పదార్ధాలు: చపాతీలు - మూడు, పంచదార - కప్పు, నెయ్యి - అరకప్పు, జీడిపప్పు - ఎనిమిది, కిస్మిస్ - ఎనిమిది, ఏలకుల పొడి - స్పూను.
తయారు చేయు విధానం: ముందుగా చపాతీలు చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని మిక్సిలో వేసి పొడి చేసుకోవాలి(కొంచం బరకగా). తర్వాత ఒక బాండీలో కొంచం నెయ్యి పోసి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చపాతీల పొడి వేసి కొంచం సేపు వేయించాలి. మంచి సువాసన వస్తుంది. అది వేగాక పంచదార వేసి కలుపుతుండాలి. అడుగు అంట కుండా చూసుకోవాలి. పంచదార బాగా కరిగి కలిసిపోయాక పైనుంచి మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి ఒక సారి బాగా కలియ పెట్టుకోవాలి. చివరగా వేయించి పెట్టుకున్న జీడీ పప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బావుంటుంది.
సూచన: ఒక కప్పు చపాతీల పొడికి ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. తీపి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. గార్నిష్ ఇంకా చేయాలి అనుకునేవారు బాదం, పిస్తాతో కూడా చేసుకోవచ్చు.
చపాతీ స్నాక్
కావలసిన పదార్ధాలు: చపాతీలు - రెండు, కార్నఫ్లోరు - ఐదు చెంచాలు, ఉప్పు, కారం, గరం మసాలా, ఉల్లిగడ్డ ముక్కలు - చిన్న బౌల్. కొత్తిమీర తరుగు - కొంచం, పచ్చిమిర్చి ముక్కలు - మూడు చెంచాలు, వాము - చెంచా, నూనె - కొంచం.
తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో కార్నఫ్లోరు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, వాము, ఉప్పు, తగినంత, కారం చెంచా, గరం మసాలా అర చెంచా వేసి బాగా కలుపుతూ కొంచం కొంచం నీళ్లు పోస్తూ మరీ చిక్కగా కాకుండా గరిట జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని చపాతీ ఒక వైపు మొత్తం పూయాలి. పెనం తీసుకుని అది వేడెక్కక దానిమీద రెండు చెంచాల నూనె పోసి ఈ చపాతీని మిశ్రమం పూసిన వైపు వేయాలి. సన్నని సెగ మీద కాల్చాలి. ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత రెండు వైపు కూడా కాల్చాలి. దీనిలోకి టొమాటో కెచప్ బావుంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి