Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న జీవన శైలితో అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఎక్కువమందిపై ప్రభావం చూపిస్తున్నాయి. శరీర భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడాన్నే ఊబకాయం అంటారు. బరువు పెరగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే తీసుకునే ఆహారంపై ముందు నుంచి దృష్టి పెట్టాలి. అధిక బరువు ఉన్నవారు వ్యాయామంతో పాటు డాక్టర్ల సూచనలతో డైట్ ఫాలో అవ్వాలి. కొంతమంది బరువు తగ్గేందుకు మందులను వాడుతుంటారు. వీటివల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల బరువు తగ్గవచ్చు. వీటితో పాటు శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. అవేంటో చూద్దాం...
గుడ్లు: గుడ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటి నుంచి శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదని, తద్వారా బరువు పెరగ కుండా కాపాడుకోవచ్చని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషనల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన తెలిపింది. ఊబకాయులు రోజూ కనీసం మూడు గుడ్లను అల్పాహారంగా తీసుకోవడంవల్ల వారి శరీర కొవ్వులో 16 శాతం వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ: బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీంట్లో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీన్ని ఎన్నో పరిశోధనలు నిర్ధారించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్, ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో దీనికి సంబంధించిన పరిశోధన పత్రాలను ప్రచురించారు.
కారంపొడి: మిరపలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనివల్ల తృప్తిగా భోజనం చేసిన అనుభూతి కలుగుతుందని ఎపటైట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది. క్యాప్సైసిన్ వల్ల ఎక్కువ కేలరీలు కోల్పోవడంతో పాటు కొవ్వు కరుగుతుందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన మరో అధ్యయనం తెలిపింది. ఆహార పదార్థాల్లో కారం పొడిని వాడటం వల్ల క్యాప్సైసిన్ శరీరానికి తగినంతగా అందుతుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తూ, శరీరానికి అవసరమైన నణూ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ నూనె శరీరంలో +ూూ-1 అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. వీటివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆలివ్ నూనె జీవక్రియ రేటును పెంచడంతోపాటు, శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తుందని ఎన్నో పరిశోధనలు కనుగొన్నాయి. ఈ నూనెతో వంటలు చేసుకోవచ్చు. లేదా సలాడ్లపై కొన్ని చుక్కలు వేసుకొని తీసుకోవచ్చు.
కాఫీ: శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును కాఫీ కరిగిస్తుంది. దీని నుంచి శరీరానికి అందే కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో జీవక్రియలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇందుకు అవసరమయ్యే కెలొరీల కోసం శరీరం కొవ్వును కరిగిస్తుందని ఫుడ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కానీ కాఫీని ఎక్కువగా తాగడం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయి. దీన్ని పరిమితంగానే తీసుకోవాలి.