Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొంత కాళ్ళపై నిలబడాలి... ఆర్థికంగా స్థిరపడాలి... అనే పట్టుదల ఉండాలే కానీ మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉంటాయి. అవసరమైతే వాటిని మనమే సృష్టించుకోవాలి. దీనికి నిదర్శనమే నీలోఫర్ జాన్... కుటుంబ పోషణ కోసం పుట్టగొడుల పెంపకాన్ని ప్రారంభించారు. అదీ ఆర్గానిక్ పద్ధతిలో... ఇప్పుడు సంవత్సరానికి తొంభై వేల నుండి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గంగూ గ్రామం నిలోఫర్ జాన్ సొంత ఊరు. పుల్వామా ప్రధాన పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. తన కుటుంబానికి జీవనోపాధి కోసం ఆర్గానిక్ పుట్టగొడుగులను పెంచుతోంది. దీని ముందు కొన్ని సంవత్సరాల కిందట కాశ్మీర్ వ్యవసాయ శాఖ నుండి పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ పొందారు. తర్వాత తన ఇంట్లోనే సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఉద్యోగల కోసం ప్రయత్నించేకంటే...
''నా ఇంట్లో పుట్టగొడుగుల యూనిట్‌ను ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ రాయితీతో పాటు శిక్షణ కూడా ఇచ్చింది. నా యూనిట్‌ను విజయవంతం చేసేందుకు డిపార్ట్మెంట్ అన్ని విధాలా కృషి చేసింది. ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ విజయం సాధించలేక ఎంతో మంది అమ్మాయిలు బాధ పడుతున్నారు. అలాంటి వారు పుట్టగొడుగుల వ్యాపారాన్ని ధైర్యంగా ప్రారంభించవచ్చు. దీని పెంపకం పరిమిత స్థలంతో ఇంట్లో సులభంగా చేయవచ్చు. పుట్టగొడుగులకు కాశ్మీర్లో విపరీతమైన మార్కెట్ ఉంది'' అంటున్నారు నిలోఫర్.
వ్యవసాయ శాఖ సహకారంతో...
పుట్టగొడుగుల పెంపకం యూనిట్‌కు వెళ్లాలని వ్యవసాయ శాఖ యువతులను ప్రోత్సహించింది. 22 ఏండ్ల నిలోఫర్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయింది. రూ.50 వేలకు బస్తాలు అందించారు. ''వ్యవసాయ శాఖ ఇచ్చిన సహకారంతో నేను చొరవ తీసుకున్నాను. ఒక గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించాను'' అని ఆమె జతచేస్తున్నారు.
బాగా చదువుకుంటా...
నిలోఫర్ తన మొదటి ప్రయత్నంలోనే స్థానికంగా 'హెడ్దార్' అని పిలవబడే పుట్టగొడుగులను మంచి మొత్తంలో పండించగలిగానని చెబుతున్నారు. మొదటి సాగులో విజయం సాధించిన తర్వాత ఆమె మరిన్ని సంచుల కోసం వ్యవసాయ శాఖను సంప్రదించారు. కేవలం వ్యాపారం చేయడంతోనే ఆమె ఆగిపోలేదు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) నుండి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ కూడా అభ్యసిస్తున్నారు. ''నేను నా కుటుంబానికి జీవనోపాధిని సంపాదించడమే కాకుండా నా చదువుకయ్యే ఖర్చును కూడా నేను సంపాదించుకోగలుగుతున్నాను. నేను చదువుకున్న వ్యాపారవేత్త కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను'' అని ఆమె నవ్వుతూ చెప్పారు.
ఎలా పండిస్తారంటే..?
నీలోఫర్ ఒకప్పుడు తన సెమిస్టర్ ఫీజు కూడా చెల్లించలేని స్తోమతను గుర్తుచేసుకున్నారు. కానీ ఈ రోజు పుట్టగొడుగుల వ్యాపారం వల్ల ఆమె మంచి జీవితాన్ని గడుపుతున్నారు. పుట్టగొడుగులను ఎలా పండిస్తున్నారని అడిగినప్పుడు... నీలోఫర్ పుట్టగొడుగుల విత్తనాలను నాటిన తర్వాత కొన్ని వారాల్లో పంట సిద్ధంగా ఉంటుందని వివరిస్తున్నారు. పంట సిద్ధమైన తర్వాత పుట్టగొడుగులను సరైన ప్యాకేజింగ్‌తో చిన్న పెట్టెల్లో ఉంచుతారు. ప్యాక్ చేసిన ఆర్గానిక్ మష్రూమ్ బాక్సులను కూరగాయల మార్కెట్లలో రూ.25 నుంచి 50 మధ్య విక్రయిస్తున్నారు.
పలు యూనిట్లకు విస్తరిస్తాను
పుట్టగొడుగులు కాశ్మీర్లో ప్రసిద్ధ కూరగాయగా మారాయి. సంవత్సరాలుగా మష్రూమ్ యఖ్నీ, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో వండిన రుచికరమైన కూర, కాశ్మీరీ బహుళ వంటకాలైన వాజ్వాన్లో పరిచయం చేయబడింది. నిలోఫర్ రానున్న నెలల్లో ఒక యూనిట్ నుంచి పలు యూనిట్లకు విస్తరించాలని భావిస్తోంది.
బాలికలకు శిక్షణ పొందాలి
''పుట్టగొడుగుల పెంపకం వెనుక ఉన్న విజయం ఈ వెంచర్‌ను కొనసాగించడానికి నన్ను ప్రోత్సహించింది. ఈ లాభదాయకమైన వ్యవసాయ వెంచర్‌ను ప్రారంభించడానికి ఎక్కువ మంది బాలికలు వ్యవసాయ శాఖ నుండి శిక్షణ పొందాలని నేను ఆశిస్తున్నాను'' అని ఆమె అంటున్నారు.
లాక్డౌన్లో మరింత శ్రద్ధగా
కాశ్మీర్ లోయలో రాజకీయ గందరగోళం, సాధారణ లాక్డౌన్లు, కోవిడ్-19 మహమ్మారి ఇవేవీ తన ఇంట్లో పెరిగిన పుట్టగొడుగులను మార్కెట్లో విక్రయించడాన్ని ప్రభావితం చేయలేదు. నిలోఫర్ ఇలా అంటారు ''లాక్డౌన్లు పుట్టగొడుగుల పెంపకంలో మరింత నిమగమై ఉండటానికి నాకు సహాయపడ్డాయి. నేను చాలా అంకితభావంతో పని చేస్తున్నాను. నాణ్యమైన పంటలను పండించడానికి నేను ప్రతిరోజూ గంటలు గడుపుతున్నాను.
ఆర్థిక స్వేచ్ఛ లేదు
సంవత్సరాలుగా పుట్టగొడుగులు కాశ్మీరీ మహిళలకు గణనీయమైన లాభాన్ని సృష్టించాయి. ఒకప్పుడు వారికి పెద్దగా ఆర్థిక స్వేచ్ఛ లేదు. కానీ ఇప్పుడు నిలోఫర్ లాంటి యువతులు వారి కుటుంబాలకు సహకారం అందించగలుగుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మహిళల పని భాగస్వామ్య రేటు 50 శాతం కంటే తక్కువగా ఉంది. అంటే మహిళలు బయటకు వచ్చి పని చేసే అవకాశాలు అక్కడ చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి చోట నిలోఫర్ సొంతంగా వ్యాపారం ప్రారంభించడం గొప్ప విషయం. ఎందరికో స్ఫూర్తి దాయకం.
- సలీమ