Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరవై తొమ్మిదేండ్ల ఆర్. ప్రియా రాజన్ చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత మహిళ. తమిళనాడులో ఇటీవల ముగిసిన పట్టణ సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల మహిళకు పదవిని రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తారా చెరియన్, కామాక్షి జయరామన్ తర్వాత ప్రియా చెన్నైకి మూడవ మహిళా మేయర్. చెన్నై కార్పొరేషన్లో కార్పొరేటర్ పదవిని గెలుచుకున్న అనేక మంది యువ అభ్యర్థులలో ఆమె కూడా ఒకరు. అక్కడి ప్రభుత్వం అందిస్తున్న వైవిధ్య పాలనలో తానూ భాగం పంచుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి ప్రియ పార్టీ మేయర్ అభ్యర్థి అని మార్చి 3, గురువారం డిఎంకె ప్రకటించింది. చెన్నై కార్పొరేషన్లో డీఎంకెకు మెజారిటీ ఉన్నందున ప్రియ త్వరలో అధికారికంగా మేయర్‌గా ఎన్నికవుతారు.
నిర్లక్ష్యం చేయబడుతుంది
ప్రియా 74వ వార్డు, మంగళపురం కార్పొరేటర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర చెన్నై నుండి ఆమెను మొదటి మేయర్‌గా కూడా ఎంపిక కానున్నారు. ఈ ప్రాంతం ఎన్నో ఏండ్లుగా వివిధ ప్రభుత్వాలచే నిర్లక్ష్యం చేయబడుతుంది. రౌడీయిజం, హింస ఎక్కువగా ఉన్న ప్రదేశంగా తమిళ సినిమాల్లో చాలా తప్పుగా ఈ ప్రాంతం గురించి తరచుగా చిత్రీకరించబడింది. వాస్తవానికి ఉత్తర చెన్నై పరిధిలోకి వచ్చే అనేక పొరుగు ప్రాంతాలకు ఇప్పటికీ ప్రాథమిక మౌలిక సదుపాయాల అవసరం ఉంది. తాగునీరు నుండి విద్యుత్, పారిశుధ్యం వరకు కనెక్టివిటీ వరకు, ఇక్కడ ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతం నుండి మేయర్ ఎన్నిక కావడం, అందునా ఓ యువతికి అధికారం అప్పగించడంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తర చెన్నైకి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం పట్ల ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని అందరూ భావిస్తున్నారు.
పార్టీ కార్యకర్తగా...
కార్పొరేటర్‌గా ప్రియకు ఇది మొదటి అధికారిక పదవి. అయితే ఆమె 18 సంవత్సరాల వయసు నుండే పార్టీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆమె కూర్చున్న కార్యాలయం గులాబి రంగులో ఉండి అన్నాదురై, కరుణానిధి, ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా ద్రావిడ నాయకుల ఫొటోలు ఎరుపు, నలుపు రంగులలో ఉన్న దండలతో పాటు గోడలు, అల్మారాలపై అమర్చబడి ఉంటాయి. శ్రేయోభిలాషులు వచ్చి అభినందనలు తెలియజేసేందుకు వచ్చి వెళుతున్నారు. అయితే ఆ కార్యాలయంలోనే ఆమె నాలుగేండ్ల చిన్నారి ఒక మూలన కలరింగ్ బుక్‌తో కూర్చుంది. కొత్తగా మేయర్ బాధ్యతలు తీసుకోబోతున్న ఆమెను విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో నమ్రతతో సమాధానం చెప్పారు.
వైవిధ్యం కోసం ప్రయత్నం
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో రాజకీయాలపై ఆమెకున్న ఆసక్తి, తన పొరుగువారికి సహాయం చేయాలనే అభిరుచిని మరింత పెంచిందని ప్రియా చెప్పారు. ''సీఎం పరిపాలనలో వైవిధ్యం కోసం ప్రయత్నించడాన్ని నేను చూశాను. నేను దానిలో భాగం కావాలని కోరుకున్నాను. మా పరిసరాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ రోజులలో మాత్రమే నీరు ఎక్కువగా వస్తుంది. రోడ్లను మెరుగుపరచాలి. విద్యుత్ సమస్యలు ఉన్నాయి'' అని ఆమె చెప్పారు.
ఇదే అనువైన సమయం
ఆమె తండ్రి ఆర్. రాజన్ డీఎంకెకు ఏరియా కో-సెక్రటరీ. జార్జ్ టౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఎం.కామ్ చేశారు ప్రియ. కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో భాగం కావడానికి తన కుటుంబ నేపథ్యం ఆమెను ప్రేరేపించిందా అని అడిగితే ప్రియ నవ్వుతూ ''లేదు.. నా రాజకీయ జీవితం ఇటీవలె మొదలైంది. ఈ ప్రాంతంలో సహాయం చేయడానికి ఇది అనువైన సమయంగా కనిపిస్తోంది. కాబట్టి నేను ఈ కార్యక్రమంలో మునిగిపోయాను'' అంటూ సమాధానం చెప్పారు.
యువత చాలా అవసరం
యువత రాజకీయాల్లోకి రావడం చాలా ముఖ్యం అని కూడా ఆమె అంటున్నారు. ''యువతకు కొత్త ఆలోచనలు, కొత్త శక్తి ఉంటుంది. సమస్యల పరిష్కారానికి తాజా మార్గాలను అన్వేషించగలరు. ఇది ప్రస్తుత రాజకీయాల్లో చాలా అవసరం'' కొత్తగా ఎన్నికైన కార్పొరేట్లు కూడా తమ ప్రాధాన్యతలు ఎల్లప్పుడూ సేవ, ప్రజలతో ఉండడమే అనే వాస్తవాన్ని మార్చిపోవద్దని యువ రాజకీయ ఆకాంక్షలకు గుర్తు చేయాలనుకుంటున్నారు.
తీవ్రమైన నీటి సమస్య
ఆమె గెలుపొందిన వార్డులో మార్పు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ''ఇక్కడ చాలా సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది'' అని 36 ఏండ్ల అము చెప్పారు. ఆమె ప్రియ నివసించే వీధికి కొద్ది దూరంలో ఒక చిన్న దుకాణాన్ని పెట్టుకొని జీవిస్తుంది. ''ఇటీవల నీటి సరఫరా పరిస్థితి కొంత మెరుగుపడింది. కానీ వేసవికాలం చాలా కష్టం. మాలో కొంతమంది మహిళలు గతంలో ఇక్కడికి వాటర్ లారీలు రావాలంటే డాక్టర్ అంబేద్కర్ కాలేజీకి (సుమారు 4 కి.మీ దూరంలో ఉన్న) ఆటోలో వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లేందుకు రూ.100 ఖర్చు అవుతుంది. డ్రైనేజీ, దోమల సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి. ప్రియ స్థానిక నివాసి, ఆమె ఇక్కడే పెరిగింది. ఆమె ఈ సమస్యలను స్వయంగా అనుభవించింది. కాబట్టి ఆమె మా జీవితాలను, మా ప్రాంతాన్ని మెరుగుపరుస్తుందని నేను నిజంగా నమ్ముతున్నాను. నేను సాధారణంగా వేరే పార్టీకి ఓటు వేస్తాను. కానీ ఈసారి నా ఓటు ప్రియకు పడింది. ఎన్నికలకు ముందు ఆమె మనందరికీ ఉన్న వివిధ సమస్యలను విన్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు'' అంటుంది అమ్ము.
ఆటస్థలం శుభ్రం చేయాలి
అక్కడ పరిష్కారం కావాలని కోరుకునే మరో సమస్య ఏమిటంటే దానిని శుభ్రం చేస్తే ఆ ప్రాంత పిల్లలకు ఆట స్థలంగా ఉపయోగించుకునే ఓపెన్ కార్పొరేషన్ మైదానం అని అము చెప్పారు. ఇ-సేవాయి కేంద్రం, ప్రకాశవంతంగా పెయింట్ చేయబడిన రాష్ట్ర ప్రభుత్వ రన్ క్రెచ్తో సరిహద్దులో ఉన్న మైదానం ప్రస్తుతం నిరపయోగం పడివుంది. ఆ మైదానమంతా చెత్తాచెదారం, పగిలిన బాటిళ్లతో నిండిపోయింది. ''మగవాళ్లు రాత్రిపూట తాగడానికి ఇక్కడికి వస్తారు, మద్యం బాటిళ్లను ఇక్కడ వదిలివేస్తారు'' అని ఒక అబ్బాయి చెప్పాడు. ''ఈ స్థలాన్ని శుభ్రం చేసి, కంచె వేస్తే అది మాకు చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది. మనం ఆడుకోవడానికి వేరే చోటు లేదు'' అన్నాడు ఆ యువకుడు.
అల్పాదాయ కుటుంబాలే ఎక్కువ
ఇ-సేవాయి సెంటర్లోని వర్కర్, క్రెచ్ హెల్పర్ ఇద్దరూ కూడా ఆ అబ్బాయిలతో ఏకీభవించారు. ''చిన్న పిల్లలు కూడా (3 - 6 సంవత్సరాల మధ్య) నిజంగా బయట ఆడుకోలేని పరిస్థితి ఉంది. వీరిలో దాదాపు 30 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అల్పాదాయ కుటుంబాలకు చెందిన వారు. మేము వారికి ఇక్కడ వంట చేస్తాము. కాని చెత్త ఎలుకలను తెస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ స్థలాన్ని శానిటరీగా ఉంచడం చాలా కష్టం'' అని క్రెచ్ హెల్పర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రియ విజయంతో మంగళాపురం పరిసర ప్రాంతాలు మారుతాయని భావిస్తున్న కొన్ని అంశాలు ఇవి.