Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిభావంతులకు శిక్షణ ఇచ్చి వారిలోని కళను ప్రపంచానికి చాటిచెప్పేందుకు గురువులు పాత్ర ముఖ్యమైంది. స్టేజిపై నాట్యకళను ప్రదర్శించి అందరి మన్ననలు పొందటం వెనుక గురువుల శ్రమ దాగి వుంటుంది. తెరవెనుక వారి పాత్ర కీలకమైంది. ఎంతోమంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను ఇవ్వడమే కాకుండా ప్రముఖ దేవాలయాలు, రంగస్థల ఆడిటోరియంలలో నాట్యప్రదర్శనలు ఇప్పించడం ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు నాట్యగురువు శ్రీమతి కె.నాగరాజేశ్వరి. లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమైన సమయంలో కూచిపూడి నృత్యంతో పాటు సంగీతంలోనూ అనేక మందికి ఆన్లైన్లో శిక్షణను ఇవ్వడం ద్వారా వారిలోని కళను మరుగున పడకుండా చూసిన ఆమె విశేషాలు మానవి పాఠకుల కోసం...
ఎన్నాళ్ళుగా ఈ రంగంలో వున్నారు?
చిన్నప్పటి నుండి నృత్యం నేర్చుకుంటున్నాను. సుమారు పదహారు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను.
మీ గురువుగారు ఎవరు, మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణాలు?
కళలను ప్రోత్సహించే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. మా మేనమామ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు డా|| అర్థనారీశ్వరం వెంకట్ గారు. ఆయన వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నాను. ఆయన అందించిన ప్రోత్సాహం, సూచనలు, సలహాలతో ఆత్మస్థైర్యంతో ఈ రంగంలో నిలదొక్కుకోగలిగాను.
ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు?
పెండ్లికి ముందు మా గురువు వెంకట్‌గారి ఆధ్వర్యంలో ఎన్నో నాట్యప్రదర్శలు ఇచ్చేదాన్ని. పెండ్లి తర్వాత నేను ప్రదర్శనలు ఇవ్వడం కన్నా విద్యార్థులకు నాట్యంలో శిక్షణను ఇవ్వడంపై దృష్టిపెట్టాను. విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను ఇవ్వడమే కాకుండా వారికి స్టేజి ఫియర్ పోగొట్టేందుకు దేవాలయాలలో బ్రహ్మోత్సవాల సమయంలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నాను.
నాట్య కళాశాలను ఎప్పుడు స్థాపించారు. ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు మీ వద్ద శిక్షణ పొందుతున్నారు?
'సాయి నృత్య తరంగిణి' పేరుతో నృత్య కళాశాలను 10 సంవత్సరాల కిందట స్థాపించడం జరిగింది. దీని ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అలాగే ప్రముఖ విద్యాసంస్థలు, కళాశాలలో విద్యార్థులకు కూడా కూచిపూడి నృత్యంలో శిక్షణను ఇస్తున్నాను. ముసరాంబాగ్‌లోని శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రతి ఆదివారం ఉదయం పూట కూచిపూడి నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నాను.
మీరు సంగీతంలో కూడా శిక్షణను ఇస్తున్నారని తెలిసింది. ఎక్కడ నేర్చుకున్నారు?
అవును నేను రాజమండ్రి ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో డిప్లొమా పూర్తి చేశాను. లాక్ డౌన్ సమయంలో వేసవి శిక్షణా తరగతులలో భాగంగా త్యాగరాయ కీర్తనలలో విద్యార్థులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చాను.
మరి ఇప్పుడు కూడిపూడిలో శిక్షణతో పాటు సంగీతంలో కూడా శిక్షణ... ఈ రెండూ ఏవిధంగా మేనేజ్ చేయగలగుతున్నారు?
సంగీతం క్లాసులు కేవలం వేసవి శిక్షణా తరగతుల సందర్భంగా ప్రారంభించాను. కానీ విద్యార్థుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడంతో సంగీతం కూడా కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం విదేశాలలో సైతం విద్యార్థులు ఉన్నారు. అమెరికా, జర్మనీ నుంచి కూడా సంగీతంలో శిక్షణ పొందుతున్నారు. ఉదయం పూట ఆన్లైన్లో సంగీతం క్లాసులు తీసుకోవడం, మధ్యాహ్నం నుంచి కూచిపూడి నాట్యంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.
మీ 'సాయి నృత్య తరంగిణి'కి సంబంధించి ఎక్కడా ప్రచారం గాని, అడ్వర్టయిజ్మెంట్ గాని చేసినట్లు లేదు?
ప్రస్తుతానికి విద్యార్థుల ఆదరణే ప్రచారంగా భావిస్తున్నాను. వారికి మా నృత్య కళాశాలపై నమ్మకం ఉన్నంత కాలం నాకు ఎటువంటి ప్రచారం అక్కరలేదు.
చివరగా మీరు ఈ స్థాయికి రావడానికి మీ ఉన్నతికి సహకరించినవారు ఎవరు?
మా గురువుగారు ప్రముఖ నాట్యాచార్యులు డా|| అర్థనారీశ్వరం వెంకట్ గారి ప్రోత్సాహం, ఆయన సలహాలు, సూచనలు నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. అలాగే దేవకి హైస్కూల్ కరస్పాండెంట్ బొక్క తిరుమల్‌రెడ్డి, క్యాంబ్రిడ్జి హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఝాన్సీరాణి, లాక్డౌన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు.
ఇప్పటి వరకు మీరు అందుకున్న అవార్డులు..?
అభినయ శ్రీ, నాట్య కౌముది అనే రెండు అవార్డులు అందుకున్నాను.