Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన పెద్ద పండుగలా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఈ సంవత్సరం ప్రత్యేక ప్రతినిధులు విచ్చేశారు. చాక్లెట్ పాపలు, అనపకాయల మహిళలు, బంతిపూల బాలికలు... ఇలా ఎంతోమంది హాజరయ్యారు. కరోనా మహమ్మారి కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నందున వీళ్ళందరూ సమావేశాలకు హాజరవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు చేత బట్టుకొని తెచ్చుకున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో మహిళలు మరింత వత్తిడికి గురయ్యారు. ఇంటిల్లి పాదికీ వండి పెట్టడంలోనూ, కరోనా కలిగించిన మానసిక సంఘర్షణలోనూ మహిళలు నలిగిపోయారు. పిల్లలు ఇంటిపట్టునే ఉండడం వలన వారిని భద్రంగా చూసుకోవటమూ, ఆన్లైన్ క్లాసుల పాఠాల్ని మరల విడమరిచి చెప్పడంలోనూ మహిళలకు విశ్రాంతి అనేది లేకుండా పోయింది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన భయానక పరిస్థితుల్ని వివరించడానికి వచ్చారు మన ప్రతినిధులు. చూద్దాం! వాళ్ళ సమస్యల్ని స్థితిగతుల్ని ఏ విధంగా మహిళా దినోత్సవంలో పంచుకుంటారో వేచి చూద్దాం!
చాక్లెట్లతో...
ఇంట్లో కాండీలు, కుకీలు, చాక్లెట్లు వంటివి రకరకాలుంటాయి. మా ఇంట్లో పిల్లలున్నారేమో అందుకని అనుకునేరు. కాదండి మా బుజ్జి పేషెంట్ల కోసమండీ. అదేనండీ! ఆసుపత్రులకు రానంటూ అల్లరి పెట్టే చిన్నారి బుడతల కోసం మా ఇంట్లో రకరకాల చాక్లెట్లు ఉంటాయి. నేనేమో ఈ చాక్లెట్లతో పాపను తయారు చేశాను. పిల్లల్ని ఆకర్షించడానికి క్యాండీలకు బంగారు రంగు రేపర్ చుట్టి ఉన్నది. ఈ క్యాండీలను తల లాగా అమర్చాను. కుచ్చుల పావడా కట్టుకున్నట్టుగా చాక్లెట్లను అమర్చాను. మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన జరగనున్న సందర్భంగా ఆడవాళ్ళ బొమ్మల్ని చేద్దామనుకున్నాను. మహిళల సమస్యలను, బాధలను చర్చించుకోవడానికి ఒక రోజంటూ ఉండాలని అనుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు జరిగింది. జర్మనీ మహిళలైన లూయూస్ జియట్జ్, క్లారా జెట్కిన్లు మహిళల రాజకీయ, సామాజిక హక్కుల పోరాటానికై మహిళలందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. 1910లో మొదటి సారిగా అంతర్జాతీయ మహిళా సమావేశం 'కోపెన్హాగెన్'లో జరిగింది. ఆ తర్వాత 1911లో పది లక్షల మందికి పైగా మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళల ఓటు హక్కు కోరుకోవటానికి, ఉపాధి పనులలో లింగ వివక్షను రూపుమాపడానికి కావాల్సిన చర్చలను జరిపారు. అమ్మ కడుపులో అంకురంగా మొదలైన దగ్గర నుంచీ వివక్షకు. దోపిడీకి గురవుతూనే ఉంది మహిళ.
నూరు వరహాల పూలతో...
నూరు వరహాల పూలలో నాలుగు రకాల చెట్లున్నాయి మా ఇంట్లో. నిండు ఎరుపు, కనకాంబరం రంగుల పూలతో అమ్మాయిని చేశాను. ఈ పూలకు తోడు అనపకాయల్ని కూడా వాడుకున్నాను. అనప గింజల కుర్మా వండటానికి తెచ్చుకున్న కాయల్ని బొమ్మలో పెట్టేశాను. కాయలతో మొహాన్ని, పూలతో లంగానూ కుట్టేశాను. గోంగూర కాడల్ని చేతులుగా, లంగాకు ఫిల్టులుగా పెట్టాను. నూరు వరహాల గుత్తిని కొప్పుగా అమర్చాను. మొహానికి కళ్ళుగా పారిజాతపు విత్తనాలు, పీస్లిల్లీ కేసరాలు పెట్టేశాను. ఇందులో ఎర్రగోంగూర, తెల్ల గోంగూర కాడల్ని ఉపయోగించాను. కుండీల్లో ఆకుకూరలు పెంచుకుని తాజాగా కూరలు పెంచుకుని తాజాగా కూరలు వండుకోవాలనే ఆలోచనతో ఇవన్నీ పెట్టాను. చివరికి ఇవి కూరల కన్నా నా బొమ్మలకే ఎక్కువగా పనికొస్తున్నాయి. మొదట్లో మహిళా దినోత్సవం కోసం 17 దేశాలు ముందుకురాగా క్రమక్రమంగా సంఖ్య పెరగసాగింది. 1914 వరకు కూడా ఒక తారీకు అంటూ కాకుండా దేశదేశాల్లో వివిధ తేదీల్లో మహిళా దినోత్సవాలు జరుపుకున్నారు. తొలిసారిగా జర్మనీలో 1914లో మార్చి 8వ తేదీ నాడు ఓటు హక్కు కోసం సమావేశం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక నినాదాన్ని తీసుకొని దాని ప్రకారంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. మహిళల శ్రమ దోపిడి ఇళ్ళలోనూ, పని చేసే చోటులోనూ ఎక్కువగా కనిపిస్తున్నది.
ఉల్లిపాయ తొక్కలతో...
మహిళల వేషధారణను వర్ణించేటపుడు ''ఉల్లిపొర లాంటి చీరలో ఆమె అందం'' అంటూ కవులు రాస్తారు. మనమిప్పుడు ఉల్లిపొరలతోనే మహిళను సృష్టిస్తున్నాం. ఇంట్లో కూర కోసం తరిగిన ఉల్లిగడ్డల దగ్గర ఎర్రగా మెరుస్తూ తొక్కలు కనిపించాయి. తడితడిగా ఉన్న ఉల్లిగడ్డ పొరల్ని ఎండలో ఎండ బెట్టి బొమ్మ తయారు చేశాను. సమాజంలో సగభాగమైన స్త్రీని అనేక రకాలుగా హింసల పాలు చేస్తున్నారు. గృహహింసలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఎన్నో సమాజంలో మనకు నిత్యం కనిపిస్తుంటాయి. వాటిని నిరోధించడానికి వారి కోసం కొన్ని రక్షణా చట్టాలు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. స్త్రీని శారీరకంగా, మానసికంగా పురుషుడు హింసిస్తూనే ఉన్నాడు. నేటి సమాజంలో స్త్రీలు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదుగుతున్నప్పటికీ సమస్యలు మాత్రం తప్పటం లేదు. ఇక ఉద్యోగం చేసే మహిళలకైతే ఇంటా బయటా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.
బంతిపూలతో...
ఆ మధ్య బంతిపూలు బాగా కాశాయి. ఇప్పుడు కుండీలో ఒక్క చెట్టూ లేదు. బంతి పూల చిన్నారిని రూపొందించాను. పిల్లలు, పెద్దలు అనే బేధమేమీ లేకుండానే ఇంతుల సమస్యలు కాలిలో ముల్లులా సలపరం పెడుతూనే ఉన్నాయి. పట్టుకుచ్చులు, లింగమల్లి పూలు, శంకుపూలు, చామంతులు పూలన్నీ ఉపయోగించి ఆడపిల్ల సున్నితత్వాన్ని తెలియజేయాలనుకున్నాను. అయితే సున్నితంగా ఉండే ఈ బాల అబల కాదు. సబల అని నిరూపించాల్సిందే. కుటుంబంలోనూ, సమాజం లోనూ ఆడపిల్ల నిర్ణయాలకు విలువ లేనందున వారు ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. పుట్టినింటా, మెట్టినింటా కూడా నిరసన జ్వాలలకు బలవుతున్నారు.
కాగితం పూలతో...
కాగితం పూల చెట్టుకింద అమాయకంగా నిలుచున్న బాలికను తయారు చేశాను. పింక్ రంగు కాగితపు పూల కొమ్మను చెట్టుగా అమర్చాను. ఆ చెట్టు కింద రెండు జడలేసుకున్న బాలిక తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ బొమ్మలో కాగితం పూలను ఎందుకు వాడానంటే, వాడియైన ముళ్ళున్న పూలివి. ఆడపిల్లను సున్నితత్వంతో పాటు అవసరమైతే వాడిగల ముళ్ళను కూడా దింపేస్తుంది అని చెప్పాలనుకున్నాను. చింతగింజల జుట్టు, ఆకుల జాకెట్టు, పింక్ పూల పావడా వేసుకున్నది ఈ బాలిక. కార్మికుల పని గంటలు, భద్రత వంటి డిమాండ్ల సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. భారత కార్మిక ఉద్యమంలో మహిళలనందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన నాయకురాళ్ళలో కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సుశీల గోపాలన్, పార్వతీ కృష్ణన్ వంటి వారు ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే కార్మిక చట్టాలు చేయబడ్డాయి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్