Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసింది. సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మహిళలను సన్మానాలతో ఘనంగా సత్కరిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐక్యరాజ్య సమితి ఓ థీమ్ తీసుకుంది. అదే ''నేటి లింగసమానత్వమే రేపటి మనుగడ''. చెప్పుకోవడానికి, వినడానికి చాలా బాగుంది. మరి ఆచరణ సంగతేంటి అంటున్నారు మహిళా నాయకులు. సమానత్వం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అణగారిన మహిళల పరిస్థితి ఏమిటని గళమెత్తుతున్నారు. సంబరాలు కాదు హింస, అణచివేత సమసిపోయిననాడే నిజమైన మహిళా సాధికారత అంటున్నారు.
అణగారిన మహిళా హక్కుల చైతన్యంగా జరుపుకోవాలి
శ్రమ రంగంలోలేని స్త్రీల సమస్యలు, రాజకీయాలు చర్చకు వస్తున్నాయి గానీ శ్రమలో ఉత్పాదక రంగంలో వున్న మహిళల సమస్యలు చర్చకు రావడం లేదు. దళిత, బీసీ, ఆదివాసీ మహిళల శ్రమ దోపిడి, కులహింస, లైంగిక హింసలు, హత్యాచారాలు సామాజిక హింసలు చర్చకు రావడం లేదు. వారి హక్కులు మానవ హక్కులుగా గుర్తించబడలేదు. సామాజిక, రాజకీయ, పోలీసుల, యాజమాన్యాల అత్యాచార బారిన పడేది దళిత కులాల, తెగల మహిళలే. వేతన అసమానతలు, తక్కువ వేతనాలు ప్రైవేట్ రంగంలోనే కాదు ప్రభుత్వ రంగంలో కూడా వుండడం దారుణం. ఇది అణగారిన మహిళల శ్రమ పట్లనే కొనసాగడం కులాధిపత్య వ్యవస్థల వల్లనే.
రాష్ట్రంలో అసంఘటిత రంగంలో 95శాతం దళిత, బీసీ, ఆదివాసీ మహిళలున్నారు. వీరికి సమగ్ర కార్మిక చట్టాల భద్రత లేదు. అనేక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలను పనంగా పెట్టి పిడికెడు మెతుకుల కోసం జానెడు కడుపు కోసం అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ ప్రమాణాన్ని అందుకోలేక ఉద్యోగం లేనివాళ్లు 99శాతం వున్నది దళిత మహిళలే. కుటీర పరిశ్రమల్లో చేతి వృత్తులు అంగన్ వాడి, ఆశ వర్కర్లు, సఫాయి కార్మికులు, భవన నిర్మాణ పనులు, రోడ్డు పనులు, మట్టి పనులు, డొమెస్టిక్ వర్కర్లు, కక్కోసులు కడిగే పనులు, వ్యవసాయ కూలీలు, పౌల్ట్రి, ఇటుక బట్టీల్లో తక్కువ వేతనాలతో, దుర్భర పరిస్థితుల్లో పని చేస్తున్నది కింది కులాల దళిత ఆదివాసీ మహిళలే. రాజకీయ రంగాల్లో, ఇతర రంగాల్లో మహిళలకు నాయకత్వ భాగస్వామ్యాలు కల్పించకుండా వీరి శక్తుయుక్తుల్ని పరిగణనలోనికి తీసుకోకుండా, మహిళల్ని అవమానిస్తున్న ప్రభుత్వాలు కూడా మార్చి 8 సంబరాలు చేస్తున్నాయి, నిర్భయ, దిశ చట్టాలు, షీటీమ్స్ వల్ల మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింసలు, హత్యలు ఆగింది లేదు. సంక్షేమ పధకాలు కొద్దిమందికే ఇస్తూ మహిళల సాధఙకారాన్ని సాధిస్తున్నామని ఉదరగొట్టుకుంటున్నాయి.
పారిశుద్య కార్మికులు, అంగన్వాడీ, ఆశావర్కర్లు, గ్రామ పంచాయితీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ఏఎన్ఎమ్, నర్సులకు సన్మానాల కన్నా ముందుగా వారికి కనీస వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయడం వల్ల మహిళలకు చేయూత నిచ్చి వారి హక్కుల్ని కాపాడే ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్, మహిళా సాధికారం కోసం అణగారిన మహిళా హక్కుల కోసం ఏర్పర్చిన దారిని ఆదర్శ వంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. అదే మార్చి 8 స్ఫూర్తి చైతన్యాలుగా జరుపుకోవాలి.
- జూపాక సుభద్ర, ప్రముఖ రచయిత్రి
మనువాద సంస్కతిని తిప్పి కొట్టిననాడే...
మార్చి 8 అంటే ఈ రోజు 112 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనందరకూ తెలిసిందే... అయినా మరొక్కసారి మననం చేసుకుందాం. 1908లో మహిళా కార్మికులు 14 నుండి 18 గంటల పని దినానికి వ్యతిరేకిస్తూ ఆనాటి పెట్టుబడి దారుల పై పోరాటాన్ని చేశారు. 8 గంటల పని దినం కోసం, కనీస సౌకర్యాల కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళా కార్మికులు అనేక ప్రదర్శనలు చేశారు. సదస్సులు నిర్వహించారు. 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. కానీ అలాంటి పరిస్థితులనే ఇంకా మహిళలు ఇప్పటికీ ఎదుర్కోవటం గమనార్హం. వంద సంవత్సరాలు దాటినా ఆనాటి స్ఫూర్తిని తీసుకోకపోగా స్త్రీలపై లైంగిక దాడులు, అణచివేత దారుణంగా పెరిగిపోయాయి. స్త్రీలను కించపరిచే అశ్లీల సంస్కతి విపరీతమయింది. స్త్రీలకు భద్రత కరువైనది. స్త్రీ, పురుష వ్యత్యాసం మరింత పెరిగింది. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న దుర్మార్గులకు అడ్డుకట్ట లేదు. లైంగిక వేధింపులు, వారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపే ప్రవర్తనలు ఇవన్నీ ఐక్య రాజ్య సమితి తీర్మానాల ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. మరి ఆనాటి స్ఫూర్తి ఏమైనట్టు? అంటే కాగితాలకు మాత్రమే పరిమితమైనదా? ఆనాటి స్ఫూర్తిని పండగలాగా, వేడుకలాగా మహిళా దినోత్సవాలు చేసుకోవటానికి మాత్రమే పరిమితం చేశారు. మహిళా దినోత్సవాన్ని అతి పెద్ద వ్యాపారంగా మార్చటం బాధాకరం. వాస్తవానికి ఈ రోజును శ్రామిక మహిళల పోరాట దినోత్సవం అనడం సబబుగా ఉంటుంది. ఒక దేశం అభివద్ధి చెందింది అంటే గుప్పెడు మంది కోట్లు సంపాయించుకొని పోగువేసుకోవటం కాదు. అన్ని రంగాలలోనూ అభివద్ధి చెంది ఉండాలి. మహిళల అభివద్ధి, అభ్యున్నతితోనే దేశాభివద్ధి ముడి పడి ఉన్నదన్న విషయాన్ని గమనికలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనదేశం లింగ వివక్షలో ప్రపంచంలో 114వ స్థానంలో ఉన్నదన్న విషయం మరువకూడదు. నేడు సామ్రాజ్యవాద విషసంస్కతి స్త్రీలను మరింతగా దిగజారుస్తోంది. సామ్రాజ్యవాద విషసంస్కతినీ, మనువాద సంస్కతిని తిప్పి కొట్టిననాడు మాత్రమే స్త్రీలకు నిజమైన న్యాయం జరుగుతుంది. స్త్రీలపై జరుగుతున్న అన్నిరకాల దాడులు, హింస, అణచివేత సమసిపోయిన నాడు మాత్రమే నిజమైన మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అప్పటిదాకా ఇవన్నీ వేడుకలగా మాత్రమే మిగిలిపోతాయన్నది కాదనలేని సత్యం.
- కవిని ఆలూరి, ప్రముఖ రచయిత్రి
పడిలేచే కెరటం
నిన్ను నువ్వు రక్షించుకో
నిన్ను నువ్వు గౌరవించుకో
ఆ నాటి కాలమైనా
ఈ నాటి కాలమైనా
మహిళలంటే ఓ మాంసపు ముద్ద.
వినోదింప చేసే ఓ మద కోరిక
కామాంధులకు
మహిళపై హ త్యాచారమైతే
ఆమె అలంకరణే కారణం
ఆమె వస్త్రాధారణే మూలకం
ఆమె తిరిగే ఒంటరి ప్రయాణాలే అప్రామాణికం
చివరికి పరువు హత్యల చరమాంకం
ఇదే ఈ నాటికి జరుగుతున్నా వాస్తవం
అందుకే ఏనాటికైనా ఎక్కడైనా
మహిళ పడిలేచే కెరటమై నాడు
సూటి పోటీ మాటల బంధాల్ని తెంచుకున్ననాడు
నొక్కి పెట్టిన నీ కంఠధ్వనిని
పెగుల్చుకున్న నాడు
నిచ్చితంగా నిక్కచ్చిగా
నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు
నీ శిఖరాన్ని నువ్వు చేరే మార్గంలో రాటు తేలిన నాడు
నీ చుట్టూ ఈ జనం అచేతనమై దారి ఇవ్వకమానదు
- జరీనా బేగం, ప్రముఖ కవయిత్రి
నిజమైన సాధికారత కోసం
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతావని మొత్తం అమత ఉత్సవాలు జరుపుకుంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఎన్నో చెబుతున్న మన అధికార గణాలు, స్త్రీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని చెబుతూనే అంతర్లీనంగా దోషులను కాపాడుతున్నారు. దేశంలో మహిళల కోసం ఎన్ని రక్షణ చట్టాలు తీసుకొచ్చిన వాటి అమలు తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతున్నాయి. అవని నుండి అంతరిక్షం దాకా అన్ని రంగాల్లో మహిళ దూసుకెళ్తున్న ఈ తరుణంలో కూడా ప్రతి చోటా మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు.
మార్చి 8 సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజు మహిళలను ఎంతో గౌరవిస్తూ, అభినందనలు తెలుపుతూ, ఉత్సవాలు జరుపుతున్నారు. అనేక హామీలను ఇస్తూ చేతులు దులుపుకునే ఈ వూసరవెల్లి రాజకీయాలు ఉన్నంతవరకు మహిళల సాధికారత జరుగుతుందని అనుకోవడం కలగానే అనుకోవచ్చు. అందుకే ప్రతి మహిళ విద్యతో ఎదిగి ఆర్థిక స్వాలంబన చేజిక్కించుకుని తమ హక్కులను కాపాడుకునే దిశగా పయనించాలి.
- యాకమ్మ, ప్రముఖ కవయిత్రి
ఐక్యం కావాలి
1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహాసభలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా హక్కులు సాధించుకునే పోరాట దినంగా నిర్వహించాలని తీర్మానం జరిగింది. నాటినుండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహిళలు పోరాడి తమ హక్కులు సాధించుకున్నారు. ఎంతో చరిత్ర కలిగిన మార్చి 8ని నేడు ఒక పండుగలాగా ఉత్సవంలా జరపడం ప్రభుత్వాలు నాటి పోరాట స్ఫూర్తిని మహిళల నుండి దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. మహిళల శ్రమను దోచుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్న కుట్రను అర్థం చేసుకుని, మహిళలు మార్చి 8ని తమ హక్కులు సాధించుకునే రోజుగా నిర్వహించుకోవాలి. స్త్రీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. నేడు కేంద్ర ప్రభుత్వం మహిళల వస్త్రధారణ, ఆహార నిబంధనలపై చేస్తున్న దాడిని తిప్పి కొట్టడానికి మహిళలు ఐక్యం కావాలి.
- అరుణ జ్యోతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు