Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంకాయ కూరంటేనే చిన్నా పెద్దా అందరూ ముఖం అదోలా పెడతారు. వంకాయంటే బోర్ అంటారు. అయితే కాస్త వెరైటాగా చేస్తే వంకాయను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటితో కుర్మా, వేపుడు, బజ్జీలు వంటివి ఎన్నో చేసుకోవచ్చు. అలాంటి కొన్ని వెరైటీ వంటలు రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం...
వంకాయ కుర్మా
కావల్సిన పదార్థాలు: చిన్నవి, గుండ్రని వంకాయలు - పావుకిలో, ఉల్లిగడ్డలు - రెండు, అల్లం, వెల్లుల్లి - టీస్పూను, పెరుగు - అరకప్పు, కొబ్బరిపొడి - రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి - అరటీస్పూను, మెంతిపొడి - పావు టీ స్పూను, ధనియాల పొడి - టేబుల్ స్పూను, పల్లీలు - మూడు టేబుల్ స్పూన్లు, నువ్వులు - టేబుల్ స్పూను, పసుపు - పావు టీ స్పూను, కారం - టేబుల్ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, మెంతులు - చిటికెడు - కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: వంకాయను విడిపోకుండా నాలుగు ముక్కలుగా చీల్చి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. బాణలిలో ఓ స్పూను నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ మెత్తబడే వరకూ వేయించి తీసి పక్కన పెట్టాలి. పల్లీలు, నువ్వులు కొద్దిగా వేయించి పొడి చేయాలి. కొబ్బరిపొడి, దనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, పల్లీల పొడి అన్నీ కలపాలి. తర్వాత అందులో వేయించిన ఉల్లిగడ్డలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొత్తిమీర కలిపి మెత్తగా రుబ్బాలి. నీళ్లలో వేసిన వంకాయలను తీసి నూరిన ముద్దను కొంచెం కొంచెంగా కూరకి మిగిలినది పక్కన ఉంచాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేయించిన బాణలిలో మిగిలిన నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తర్వాత కూరిన వంకాయలు వేసి వెంటనే మూతపెట్టాలి. తక్కువ మంటమీద ఉడికించాలి. వంకాయలు మెత్తబడ్డ తర్వాత మిగిలిన ముద్దలో కొన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి కూరలో పోసి నూనె తేలేవరకూ ఉడికించాలి.
వంకాయ బజ్జీలు
కావల్సిన పదార్థాలు: వంకాయలు - పావుకిలో, సెనగపిండి - పెద్ద కప్పు, ఉప్పు - అరటీస్పూను, కారం - టీస్పూను, దనియాల పొడి - రెండు టీ స్పూన్లు, గరంమసాలా - టీ స్పూను, సోడా - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: పొడవాటి వంకాయలను నిలువు ముక్కలుగా కోయాలి. కోసి ఉప్పునీటిలో వేయాలి. ఓ గిన్నెలో సెనగపిండి, ఉప్పు, కారం, దనియాల పొడి, గరంమసాలాపొడి, వంటసోడా వేసి గరిటె జారుగా కలిపి పదినిమిషాలు ఉంచాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు నీళ్లలో నుంచి తీసి కాస్త ఆరనిచ్చి రెండువైపులా ఉప్పు, కారం చల్లాలి. ఇలా చేయడం వల్ల బజ్జీలు చప్పగా కాకుండా రుచిగా ఉంటాయి. బాణలిలో నూనె పోసి కాగాక వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా సెనగపిండిలో ముంచి వేయాలి. కరకరలాడే వరకరూ ఎర్రగా వేయించి తీసి టిష్యూపేపర్ మీద వేస్తే ఎక్కువగా ఉన్న నూనెను పీల్చేసుకుంటాయి. వీటిని టొమాటో సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి. వంకాయ ముక్కలను ముందుగానే కరకరలాడేలా వేయించి తీసి అప్పుడు పిండిలో ముంచి కూడా బజ్జీలు వేసుకోవచ్చు.
వంకాయ సెనగపప్పు కూర
కావల్సిన పదార్థాలు: వంకాయలు - పావుకిలో, సెనగపప్పు - అరకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం వెల్లులి - టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - టీస్పూను, గరంమసాలా - పావు టీ స్పూను, నూనె - మూడు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: సెనగపప్పును కడిగి నానబెట్టాలి. వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు నీళ్లలో వేసి ఉంచాలి. ఉల్లిగడ్డలను సన్నగా తరగాలి. పాన్ తీసుకుని నూనె పోసి కాగాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, సెనగపప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పువేసి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఉడికించాలి. ముక్క మెత్తబడిన తర్వాత కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. వంకాయలు, పప్పు బాగా ఉడికిన తర్వాత గరంమసాలా చల్లి దించితే కూర రెడీ. ఇది చపాతీల్లోకి కూడా బాగుంటుంది.
గుత్తి వంకాయ వేపుడు
కావల్సిన పదార్థాలు: గుండ్రని వంకాయలు - పావుకిలో, సెనగపిండి - అరకప్పు, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూను, దనియాల పొడి - టేబుల్‌స్పూను, ఉప్పు - అర టీస్పూను, కొత్తిమీర తురుము - టేబుల్ స్పూను, నూన - ఆరు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: గుత్తివంకాయకి కోసినట్టే ముక్కలుగా విడిపోకుండా వంకాయలు కోసుకుని ఉప్పు నీళ్లలో వేయాలి. విడిగా ఓ గిన్నెలో సెనగపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, దనియాల పొడి, పసుపు, రెండు టీ స్పూన్ల నూనె పోసి బాగా కలపాలి. ఈ ముద్దను వంకాయల్లో కూరాలి. వెడల్పాటి పాన్ తీసుకుని నూనె పోసి కాగాక మసాలా కూరిన వంకాయలను వేసి విడిపోకుండా నిదానంగా వేయించాలి. మూత పెట్టకుండా సిమ్‌లోనే వేయించి దించాలి.