Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణిమా సిన్హా... ఓ భయంకరమైన రైలు ప్రమాదంలో తన కాలును కోల్పోరయింది. జీవిత గమనాన్ని నిర్ణయించుకునే అవకాశాన్ని కోల్పోయింది. అలాంటి ఆమె 2012లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక శిఖరాలను అధిరోహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హర్స్టోరీకి ఆమె ఇచ్చిన స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూ విశేషాలు మానవి పాఠకుల కోసం
ఏప్రిల్ 2011లో 24 ఏండ్ల అరుణిమా సిన్హా జ×ూఖీ ప్రవేశ పరీక్ష రాయడానికి లక్నో నుండి ఢిల్లీకి పద్మావత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఒక్కసారిగా కొంతమంది దుండగులు ఆమె చుట్టూ గుమిగూడారు. ఆమె వంటిపై ఉన్న బంగారు గొలుసును లాగడం ప్రారంభించారు. అది ఆమెకు తల్లి ఇచ్చిన బహుమతి. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ఆ దుండగులను ప్రతిఘటించింది. వారు ఆమెను పట్టాలపైకి విసిరారు. అటుగా వస్తున్న మరో రైలు ఆమె ఎడమ కాలు మీదుగా పోయింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.
సాహసోపేతమైన బాల్యం
''నేను చాలా సంతోషకరమైన, సాహసోపేతమైన బాల్యాన్ని గడిపాను. నేను లక్నో సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో పుట్టాను. మా నాన్న ఆర్మీలో ఉన్నారు. మా ఇంట్లో చాలా క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది. నా తండ్రి మరణించిన తర్వాత నా ఆలనా పాలన మొత్తం మా అమ్మనే చూసుకునేది'' అని అరుణిమ గుర్తు చేసుకుంది. చిన్నతనం నుండి అరుణిమ క్రీడల పట్ల మొగ్గు చూపింది. వాలీబాల్ ఆమెకు మొదటి ప్రేమ అయినప్పటికీ సైక్లింగ్, ఫుట్‌బాల్‌ను కూడా ఎంతో ఆస్వాదించింది. జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి అయ్యింది. పారామిలిటరీ దళాలలో చేరడమే ఆమె లక్ష్యం.
జీవితం శాశ్వతంగా మారినప్పుడు
జీవితాన్ని మార్చివేసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా చెప్పింది ''ఒక సాధారణ అమ్మాయి తన చేతులను, కాళ్ళను ఉపయోగించి తన పనిని తాను చేసుకునేది. అకస్మాత్తుగా ఒక రోజు తన శరీర భాగాన్ని కోల్పోయింది. అంగవైకల్యం పొందిన వ్యక్తి జీవితాన్ని గడపడం నిజంగా చాలా కష్టం. కానీ మీరు వేరొక దృక్కోణంలో చూడటం ప్రారంభిస్తే అదంతా మారిపోతుంది. హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, జీవితంలో అత్యంత కష్టతరమైన ఎత్తుగడ వేయాలని నిర్ణయించుకున్నాను. ఇంత బాధాకరమైన సంఘటన జరిగిన తర్వాత కూడా నేను బతికి ఉన్నానంటే ఏదైనా ప్రత్యేక కారణం ఉందని నేను అనుకున్నాను. ఇది కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని అర్థం''.
ఎన్నో మాటలు అన్నారు
ఆ సంఘటన తర్వాత తన చుట్టూ వివిధ ప్రతిచర్యల మధ్య అరుణిమ విపరీతమైన బాధను అనుభవించింది. తాను ఆ రోజు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించి ఉండవచ్చని కొందరు భావించారు. మరికొందరైతే అని రైలు టిక్కెట్ లేకుండా ప్రయాణించి పట్టుబడడం వల్ల ఇలా చేసి ఉండవచ్చనే మాటలు కూడా అన్నారు. ఈ విషయాలు పంచుకునేటపుడు ఆమె ఎంతో ఆత్రుతగా, కోపంగా ఉంది. కొద్ది సేపటికి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది.
ప్రతిదీ మారిపోతుంది
అరుణిమ తక్షణ లక్ష్యం, కల చాలా పెద్దది. అదే ఎవరెస్ట్ శిఖరం. కానీ చాలా మందికి అది హాస్యాస్పదంగా అనిపించింది. ''దీన్ని నేను మొదట చెడుగా భావించాను. కానీ అది జీవితంలో ఒక భాగమని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఓ కుక్క మీ వెంటపడిందని ఊహించుకోండి. దానితో మీరు గెలవలేరు కానీ అది మీ వెంట పరుగెత్తడం ప్రారంభించిన తర్వాత మీరు ఎంత వేగంగా పరిగెత్తగలరో ఊహించుకోండి. మీకు జీవితంలో చాలా ఎంపికలు ఉంటే మీ మనసు నిర్ణయించుకోలేకపోతుంది. దానికి బదులుగా ఒక లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి పెట్టండి. మీరు దానిని సాధించగలరు. నా విరిగిన కాలు జీవితంలో ముందుకు సాగడానికి, నా లక్ష్యాన్ని సాధించడానికి రిమైండర్‌గా పనిచేసింది'' ఆమె జతచేస్తుంది.
మీ గురించి గర్వపడండి
నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె తల్లి ఆమెతో ఇలా చెప్పింది ''మీ ప్రయాణంలో మీరు దీన్ని చేయలేరని ఎప్పుడైనా అనిపిస్తే వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఇంత దూరం చేరుకున్నందుకు మీ గురించి గర్వపడండి. ఇది కేవలం ఒక విషయం. మరికొన్ని అడుగులు వేస్తే మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు'' ఈ బలమైన మద్దతు అరుణిమ జీవితంలో మార్గదర్శక సూత్రం కూడా.
శిఖరాన్ని అధిరోహించడం
ప్రమాదం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత అరుణిమ మే 21, 2013న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది. 18 నెలల కఠోరమైన శిక్షణ, విశ్వాసం ఆమెను ఆ ఎత్తుకు చేర్చింది. అప్పటి నుండి ఆమె ఏడు ఖండాలలో అనేక శిఖరాలను అధిరోహించింది. ''నేను ఇంకా ఉత్తర అమెరికాలో ఎత్తైన శిఖరమైన దెనాలిని అధిరోహించలేదు. ప్రతి పర్వతం దాని సొంత సవాళ్లను కలిగి ఉంటుంది. కానీ మన మానసిక స్థిరత్వమే అతిపెద్ద సవాలు అని నేను నమ్ముతున్నాను'' అంటుంది.
నాపై విశ్వాసం చూపలేదు
''ఎవరెస్ట్ వైపు నా ప్రయాణంలో నా కృత్రిమ కాలు ఊడిపోవడం, నా చీలమండ మెలితిప్పడం, మడమ బొటనవేలు రావడం, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు వచ్చాయి. విన్సన్ పర్వతానికి నా ప్రయాణంలో నేను ఇంతకు ముందు చాలా పర్వతాలను అధిరోహించినప్పటికీ ఎవరూ నాపై విశ్వాసం చూపలేదు. ప్రజలు నా మానసిక బలాన్ని విశ్వసించకపోవడం, నా శారీరక సామర్థ్యాలతో నన్ను అంచనా వేయడం విచారకరం'' ఆమె చెప్పింది. ఆమె ''అది చేయగలదు'' అని ప్రజలకు అర్థమయ్యేలా చేయడం ఆమె అతిపెద్ద సవాలు.
విమెన్ ఆఫ్ ఇంపాక్ట్
అరుణిమ జీవితం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్లో ప్రసారమై ప్రత్యేక మహిళా దినోత్సవ చలన చిత్రంగా 'విమెన్ ఆఫ్ ఇంపాక్ట్' సిరీస్‌లో ప్రదర్శించబడింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ అంగవైకల్యం పొందిన మహిళగా ఈ చిత్రం అసాధ్యమైన కలలను సాధించాలనే ఆమె స్ఫూర్తిని, అభిరుచిని హైలైట్ చేస్తుంది.
మరింత కృషి అవసరం
ఆమె ప్రకారం భారతదేశంలో ప్రజలు వికలాంగులను గుర్తించే విధానంలో కొంత పురోగతి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ చాలా వరకు సానుభూతిగానే ఉంది. ''శారీరకంగా వికలాంగులకు ప్రాతినిధ్యం వహించే కొంతమంది వ్యక్తులు తమ సొంతం కోసమే పని చేస్తున్నారు. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తున్నప్పటికీ, వికలాంగుల సంక్షేమం కోసం ప్రజల నుండి మరింత కృషి అవసరం. నా వరకు నేను ప్రధాన మంత్రి స్కిల్ ఇండియా యోజనకు సహకరించాను. దాని ద్వారా నేను ఐటి, రిటైల్, హాస్పిటాలిటీ వంటి వివిధ రంగాలకు చెందిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. ప్లేస్మెంట్లలో వారికి సహాయం చేసాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారికి క్రీడలలో మార్గనిర్దేశం చేసాను'' ఆమె చెప్పింది.
ప్రత్యేక స్పోర్ట్స్ అకాడమీ
వికలాంగుల కోసం స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి, వారికి సొంతంగా స్థలం కల్పించి, వారికి నచ్చిన క్రీడను ఆడేందుకు వారిలో ఆత్మవిశ్వాసం నింపాలన్నది ఆమె లక్ష్యం. అరుణిమ తన లక్ష్యాన్ని ఉత్తర, దక్షిణ ధృవాలపై ఉంచి ఆ దిశగా కసరత్తు చేస్తోంది.
తక్కువ అంచనా వేసుకోవద్దు
''నేను యువకులందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మగైనా, ఆడైనా మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు. మీపై అత్యంత విశ్వాసం కలిగి ఉండండి. మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాని కోసం శ్రద్ధగా పని చేయండి. మీకు లక్ష్యంపైనే దృష్టి ఉంటే మీరు ఒక రోజు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు'' అని ఆమె తన మాటలను పూర్తి చేసింది.