Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుఎస్‌కు చెందిన ఎలియనోర్ రూజ్వెల్ట్ అన్నట్టు 'స్త్రీ టీ బ్యాగ్ లాంటిది. వేడి నీటిలో ముంచే వరకు దాని బలం ఏంటో మనకు తెలియనట్టే... స్త్రీ కూడా ఎంత బలవంతురాలో ముందు చెప్పలేరు''. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతుంది. మహిళలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. వృత్తికి, ఇంటి మధ్య సమన్వయం మరింత సవాలుగా మారింది. ఇక కుటుంబాలను పోషించుకునేందుకు ఒంటరి మహిళలు ఎన్నో సాహసాలు చేస్తున్నారు. వాస్తవానికి మహమ్మారి వారిని ఓడించలేదు. మహిళలు తమ బలాన్ని మరింతగా పెంచుకుని కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారు. అసమానతలను ఎదుర్కొని జీవితంలో ముందుకు నడిచారు. అలాంటి వారిలో శివాని, మమత కూడా ఉన్నారు. ఉబెర్ డ్రైవర్లుగా ఉన్న వీరు మహమ్మారితో ఎలా పోరాడి గెలిచారో తెలుసుకుందాం...
ముప్పై ఐదేండ్ల శివాని తండ్రిని కోల్పోయింది. కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆశతో పశ్చిమ బెంగాల్‌లోని తన గ్రామం నుండి 30 సంవత్సరాల కిందట తన తల్లి, మామతో కలిసి ఢిల్లీకి చేరింది. ''ఇంటిని పోషించడానికి మాకు ఆదాయం లేదు. కాబట్టి మంచి అవకాశాల కోసం నగరానికి మారాలని నిర్ణయించుకున్నాను'' అని ఆమె చెప్పింది. 2009లో భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇద్దరు పిల్లలతో శివాని ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ పిల్లల వయసు 15, 17 ఏండ్లు. ఇద్దరు పిల్లల్ని, తల్లిని పోషించడం కోసం శివాని చాలా ఉద్యోగాలు చేసింది. ఎనిమిదేండ్లు ఓ దగ్గర ఇంటి సహాయకురాలిగా పనిచేసింది. తర్వాత ఎగుమతి కర్మాగారంలో చేరింది.
రోజంతా కష్టపడాలి
''నేను క్లీనింగ్ చూశాను. వస్త్రాల తయారీలో సహాయం చేశాను. మాకు చాలా తక్కువ జీతం ఇచ్చేవారు. కానీ రోజు మొత్తం కష్టపడాల్సి వచ్చేది. అందుకే ఆ పని నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా పిల్లలు చిన్నవారు. వారిని చూసుకోవడానికి సమయం దొరికేది కాదు. అందుకే ఫ్యాక్టరీని విడిచిపెట్టి రెండు ఇళ్లలో హౌస్ హెల్ప్‌గా, కుక్‌గా మళ్లీ ఉద్యోగంలో చేరాను'' ఆమె చెప్పింది. ఇది ఆమెకు తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మరింత సౌలభ్యాన్ని ఇచ్చింది. ముఖ్యంగా వంట చేసేందుకు రోజుకు రెండుసార్లు బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ సమయంలోనే ఆజాద్ ఫౌండేషన్ ఆమె జీవితంలోకి వచ్చింది. డ్రైవింగ్ కోర్సులో చేరడానికి సహాయపడింది.
అజాద్ ఫౌండేషన్ ద్వారా
'కోవిడ్-19 మహమ్మారికి ముందు నేను డ్రైవింగ్ లైసెన్స్ పొందాను. ఆజాద్ ఫౌండేషన్, శాఖ సహాయంతో ఓ డాక్టర్ ఇంట్లో డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించాను. కానీ ఆ ఉద్యోగం నా కుటుంబాన్ని పోషించేంత జీతం ఇవ్వలేదు. ఉబెర్‌లో మంచి సంపాదన అవకాశాలు లభిస్తున్నందున దానితో డ్రైవ్ చేయమని నా స్నేహితుడు సూచించడంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాను'' ఆమె చెప్పింది. అయితే శివాని ఉబర్‌లో చేరినప్పుడే లాక్డౌన్ ప్రారంభమైంది. వ్యాపారం లేదు. ఇది చాలా కష్టతరమైన సమయమని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే అతి తక్కువ కాలంలోనే ప్రజలు మళ్ళీ క్యాబ్‌ల కోసం వెదికారు. మొదట్లో డ్రైవింగ్‌ను ఆమె తల్లి, మామ వ్యతిరేకించారు. ఎందుకంటే క్యాబ్ నడపటం మహిళ సురక్షితం కాదని భావించారు. కాని ఇప్పుడు వారు ఆమెను చూసి గర్వపడుతున్నారు.
నా కోసం నేను
''నేను 12 గంటలు డ్రైవ్ చేస్తున్నాను. ఇంటికి తిరిగి వస్తాను. అయినా అలసిపోను. ఎందుకంటే అది నాకు ఎంతగానో ఇష్టం. క్యాబ్ డ్రైవర్‌గా నా కోసం నిర్ణయాలు తీసుకునే సౌలభ్యం, శక్తి నాకు ఉన్నాయి. నాకు ఇష్టం లేని రోజుల్లో, నా పిల్లలకు నాకు అవసరమైనప్పుడు నేను డ్రైవ్ చేయను. మొదట్లో అద్దె కారు నడిపాను. రెండేండ్ల కిందట సెకండ్ హ్యాండ్ కారుకు యజమాని అయ్యాను. నా విజయానికి నా కుటుంబం మొత్తం చాలా గర్వంగా ఉంది'' అని శివాని గర్వంగా చెప్పారు.
నన్నూ, నా పనిని గౌరవించారు
''గత వారమే, నేను ఒక జంటను నెహ్రూ ప్లేస్‌కి దింపాను. వారు నా అనుభవాల గురించి, క్యాబ్ నడపడానికి కారణమైన వాటి గురించి మాట్లాడారు. వారు నాతో ఫోటోలు కూడా దిగారు. నా పిల్లల ఫొటోలు చూపించమని అడిగారు. నన్ను, నా పనిని గౌరవించే విద్యావంతులతో ఇంత హృదయపూర్వకంగా మాట్లాడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మహిళా రైడర్ ఉన్నప్పుడల్లా నాకూ సురక్షితంగా అనిపిస్తుంది. అందుకే నేను ఉబెర్ డ్రైవింగ్‌ను ఎక్కువగా ఇష్టపడతాను. మహిళలు ఎక్కువగా క్యాబ్‌లను బుక్ చేసుకోవడం నేను గమనించాను'' అని ఆమె చెప్పింది.
భద్రతకు భరోసా వుంది
ప్రస్తుతం తన కుటుంబ పోషణకు సరిపడా సంపాదిస్తున్నానని శివాని చెప్పింది. అంతే కాకుండా పూర్తయిన ప్రతి 60 రైడ్లకు ఆమె రూ. 3,000 బోనస్‌గా సంపాదిస్తుంది. ఇది ఆమెకు ప్రేరణగా పనిచేస్తుంది. ఇప్పటివరకు ఆమె ఉబర్‌తో 4,300 రైడ్లను పూర్తి చేసింది. తన కారు ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు కదలకుండా ఉంటే సురక్షితంగా ఉన్నారా లేదా ఏదైనా సహాయం కావాలా అని ఆటోమేటిక్ సందేశాన్ని పంపే యాప్ ఉండడం పట్ల ఆమె సంతోషంగా ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం 24/7 హెల్ప్‌లైన్, యాప్‌లో భద్రత బటన్ కూడా ఆమెను సురక్షితంగా ఉంచుతుంది.
పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కోసం
ఓ తల్లిగా ఆమె తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటోంది. ''నా చిన్న కొడుకు ూతీశీ ూఖదీ+ యూట్యూబర్‌గా మారాలని కోరుకుంటున్నాడు. నేను తన కోరికను ఎప్పుడూ కాదనలేదు. ఢిల్లీలోని భైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్లో అండర్-14 ఫుట్‌బాల్ జట్టులో భాగమైన నా పెద్ద కొడుకు గురించి నేను చాలా గర్వపడుతున్నాను. నా విషయానికొస్తే నేను వర్తమానంలో జీవించాలనుకుంటున్నాను'' అని శివాని తన మాటలను పూర్తి చేసింది.
భర్త పని చేయడు
ముప్పై మూడేండ్ల మమత మహేష్ పేదరికంతో మూడవ తరగతి వరకు మాత్రమే చదివింది. వాస్తవానికి ఆమె మధ్యప్రదేశ్‌కు చెందినది. కానీ ఆమె కుటుంబం 15 ఏండ్ల కిందట ముంబైకి మారింది. ''నేను పొలాల్లో ఎండలో కష్టపడాల్సి వచ్చేది. నా భర్త అస్సలు పని చేసేవాడు కాదు. నగరం మా ఇద్దరికీ సంపాదన అవకాశాలను ఇస్తుందని భావించి మేము ఇక్కడికి మారాము. కానీ నగరంలో కూడా నా ఉద్యోగం చేయలేదు. నేను ఇప్పుడు ముంబైలోని థానేలో నా ఇద్దరు పిల్లలతో ఒక పడకగది ఫ్లాట్‌లో నివసిస్తున్నాను'' ఆమె చెప్పింది.
నాకు నేనే యజమాని కావాలని
ఆటో నడపడానికి ముందు మమత బ్యూటీ పార్లర్లో చేసింది. వంట మనిషిగా కూడా పనిచేసింది. వేర్వేరు ఇళ్లలో వంట చేయడం కోసం ఆమె సెలూన్‌లోని ఉద్యోగాన్ని వదులుకుంది. ''మహమ్మారి వచ్చే వరకు నేను 5-6 సంవత్సరాలు ఇలాగే చేసాను. నా వంటతో ప్రజలను సంతోషపెట్టడం ఆనందంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంటి యజమానుల దయతో బతకాలి. అయితే నాకు నేనే యజమానిగా ఉండాలని కోరిక. అందుకే లాక్డౌన్ సమయంలో డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నాను. నా ప్రేరణ నా ఇంటి యజమాని. ఆమె కూడా ఒక మహిళ. ఆటో కూడా నడుపుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవడంలో ఆమె నాకు సహాయం చేసింది. నేను ఎనిమిది నెలల కిందట ఉబెర్‌లో చేరాను'' అని ఆమె చెప్పింది.
ఇప్పుడు నిబంధనలు లేవు
మమత ఆటోను నడుపుతున్నప్పుడు తానే తన యజమాని అని టైమింగ్స్ లేదా తను ఎక్కడ డ్రైవ్ చేయాలో నిర్ణయించుకుంటానని చెప్పింది. ''ఇప్పుడు నాకు నిబంధనలను ఎవరూ నిర్దేశించరు. ఇది ఉత్తమమైన, అత్యంత స్వేచ్ఛా భాగం. లాక్డౌన్ ఎత్తివేయబడిన తర్వాత వంట చేసిన ఇంటి యజమానులు నన్ను తిరిగి పిలిచారు. కానీ నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేను ఇప్పుడు ఉబెర్ ఆటో నడుపుతున్నానని వారికి చెప్పాను. వారందరూ నా నమ్మకాన్ని ఎంతో మెచ్చుకున్నారు'' అని ఆమె జతచేస్తుంది.
నువ్వు అద్భుతం అంటున్నారు
ఆమె ఇప్పుడు ముంబై అంతా తిరుగుతుంది. కుర్లా నుండి కళ్యాణ్ వరకు డ్రైవ్ చేస్తుంది. తన వేలికొనలకు ప్రతి రూట్ తెలుసునని పేర్కొంది. ''నేను ఉబెర్ ఆటో నడపడం చూసినప్పుడల్లా వారు 'ఆప్ గజబ్ హో' (నువ్వు అద్భుతం), 'ఆప్కీ హిమ్మత్ కి దాత్ దేతే హై' (మీ ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము) అని అంటారు. కొన్నిసార్లు మహిళా ప్రయాణికులు తమ ఇంట్లో రాత్రి 9 గంటల తర్వాత బయటకు వెళ్లడానికి అనుమతించబడరని నాతో చెప్పారు. అయితే నేను 12:30-1 గంటల వరకు ముంబై అంతా డ్రైవింగ్ చేయడం చూసి వారు కూడా దీన్ని చేయగలరనే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మహిళా ప్రయాణికులు నాతో రైడింగ్ చేస్తున్నప్పుడు సుఖంగా ఉంటారు. మన దేశంలోని మహిళలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేలా చేయడంలో నేనూ నా వంతు పాత్ర పోషిస్తున్నందుకు గర్వపడుతున్నాను'' అని మమత చెప్పింది.
పిల్లలు అంగీకరించలేదు
భద్రత దృష్ట్యా మమత ఉబెర్ ఆటో నడపడంపై మొదట్లో ఆమె ఇద్దరు కొడుకులు అనుమానం వ్యక్తం చేశారు. కాలక్రమేణా ఆమె వారి విశ్వాసాన్ని పొందింది. వారు ఇప్పుడు తల్లిని చూసి గర్వపడుతున్నారు. ఆమె ఇంటికి తిరిగి రావడంతో ఆలస్యమైతే తన పెద్ద కొడుకు ప్రతి రాత్రి వారికి భోజనం కూడా వండుతాడని మమత పంచుకుంటుంది.
ఇంట్లో లింగ నిబంధనలు లేవు
''నా ఇంటిని ఎటువంటి లింగ నిబంధనలు బంధించవు. ప్రతి ఒక్కరూ అందరికీ సహాయం చేస్తారు. ఒకరికొకరు మద్దతు ఇవ్వడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ప్రపంచానికి వ్యతిరేకంగా మేము ముగ్గురం'' అని ఆమె జతచేస్తుంది. మమత వారంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటల నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు పని చేస్తుంది. ఆమె ఒక్క రోజు కూడా సెలవు తీసుకోదు. ఎందుకంటే ఆమెకు ఇంటి అద్దె, బ్యాంకు రుణం, ఆటో అద్దె, కుటుంబ పోషణకు డబ్బులు కావాలి. ఆమె పెద్ద కుమారుడు అజరు పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల తర్వాత రిక్షా గ్యారేజీలో పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసిన తన చిన్న కొడుకు కూడా మోటార్‌సైకిల్ గ్యారేజీలో పనిచేస్తున్నాడని ఆమె ఆందోళన చెందుతోంది. ''నా కొడుకులు మంచి మనుషులుగా ఉండాలని, వారు కోరుకున్నది సాధించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి దశలో వారికి మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను'' ఆమె చెప్పింది.