Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ పూర్తిగా రూపుమాసిపోయేలా లేదు. జనంతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నది కరోనా వైరస్. అయితే ఇంతకు ముందు ఉన్నంత ప్రమాదకరంగా లేదు కాబట్టి మనమూ భయపడాల్సిన పని లేదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కగా తీసుకొని పాటిస్తే బాగుంటుంది. ఇలాగే ఈ వైరస్ బలహీనంగా మారిపోయి మనల్ని వదిలేస్తే హాయిగా ఉంటుంది. మనందరం కాస్త బయట ప్రపంచం చూడవచ్చు. ఎప్పుడెప్పుడు కరోనా వైరస్ లేదని చెప్తారా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు జాగ్రత్తలు పాటిద్దాం. ప్రస్తుతం పాజిటివ్‌గా ఉన్న వాళ్ళు అందరూ తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా మారాలి. కొత్తగా రాకుండా మాస్క్, భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి. ఎవరూ ఎవర్ని ఇళ్ళకు రమ్మని పిలవటం లేదు. కరోనాకు పూర్వం జరిగినట్టుగా పార్టీలూ, ఫంక్షన్లూ జరగడం లేదు. మనసులో ఉన్న భయాలు పోయి స్వేచ్ఛగా హాయిగా తిరగగలిగే రోజు రావాలి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం! ఆరోగ్యంగా ఉందాం!
చింతగింజలతో...
'భారత దేశపు ఖర్జూరం' అని పేరు పడిన చింత చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది. దీన్ని శాస్త్రీయనామంలో 'టామరెండన్ ఇండికా' అంటారు. చింతచెట్టుకు కాసే కాయలు, పండ్లు ప్రపంచ వ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగిస్తారు. చింతపండు లేని పప్పులు, పప్పుచార్లు ఉంటాయా! చింత కాయలతో పెట్టే నిల్వ పచ్చడి తెలుగు వారి ఇళ్ళలోని జాడీల్లో మాగుతూ ఉంటుంది. చింతకాయతో పులిహౌర చేసుకుంటారు. ఫిలిప్పీన్స్‌లో చింతాకుతో చేసే టీని మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింతాకు, చింత చిగురు, చింత పువ్వులను పప్పులలో వేసుకుంటారు. పూర్వకాలంలో చింత చెట్టుల్ని రహదారి కిరువైపులా నీడ కోసం పెంచుతారు. చింతకొమ్మలను బొగ్గుగా చేసి బొమ్మలు వేయడానికి ఉపయోగిస్తారు. చింత కలప ఎర్రగా ధృఢంగా ఉండటం వల్ల ఇళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తారు. చింతపండు రసాన్ని ఫ్రిజ్‌లో ఉంచి కూల్ డ్రింక్‌లుగా ఈజిప్టులో తాగుతారు. అలాగే థాయిలాండ్‌లో ఒక రకమైన చింతపండును ఇష్టంగా తింటారు. మనకూ ఇప్పుడు 'స్వీట్ టామరిండ్' అని కొద్దిగా తీపిదనంతో ఉండే చింతపండు కొత్తగా లభిస్తోంది. ఆ కాయల్ని పెండిండ్లలో ఒక వెరైటీ రకంగా అందిస్తున్నారు. చింత పిక్కలతో పూర్వం పచ్చీస్ ఆట ఆడుకునేవారు. ఇప్పుడు చింత గింజలతో నేను గుడ్ల గూబను తయారు చేశాను. గుడ్ల గూబను అపశకునంగా భావిస్తారు. గుడ్లగూబల గురించిన విశేషాలు తెలియజేద్దామని ఈరోజు గుడ్లగూబల్ని అంశంగా తీసుకున్నాను. గుడ్లగూబ కూడా ఒక జంతువు మాత్రమే. అపశకునం కాదు.
క్రోటన్ ఆకులతో...
ఒక రోజు పెండ్లికి వెళ్ళాం. అక్కడ ఫంక్షన్ హాల్ గార్డెన్లో బోలెడు చెట్లున్నాయి. అందులో రంగు రంగుల ఆకులు గల క్రోటన్ చెట్లున్నాయి. పసుపు, ఆకుపచ్చ, బ్రౌన్, ఎరుపు, ఆరెంజ్ రంగులన్నీ కలిసిన ఆకులు చెట్టుకు ఆభరణాల పువ్వుల్లా అమరి ఉన్నాయి. ఈ క్రోటన్ మొక్కల్ని అలంకరణ కోసం పెంచుకుంటారు. గార్డెన్ క్రోటన్, రెడ్ క్రోటన్, పెట్రా క్రోటన్, జోసఫ్స్ కోట్, కోడీలియమ్ పాటెడ్ ప్లాంట్స్, లష్ గ్రీన్ క్రోటన్, కోడీయమ్ వారిగేటమ్, గోల్డ్ డస్ట్ క్రోటన్ అని ఇలా ఎన్నో రకాలున్నాయి. దాదాపుగా పువ్వులు కనిపించవు. కానీ ఆకులే పువ్వుల్లా రంగురంగుల్లో అలకరిస్తుంటారు. ఇలాంటి క్రోటన్ ఆకులతో నేను గుడ్లగూబను తయారు చేశాను. చెట్టు మీద కూర్చుని తీక్షణమైన చూపులతో చూస్తున్న గుడ్ల గూబను సృష్టించాను. గుడ్లగూబ రాత్రి పూట తిరిగే పక్షి. దీని కంటి చూపు నిశితంగా ఉంటుంది. ఈ పక్షి అంద వికారంగా ఉంటుంది. ఇవి 'స్ట్రెగిఫార్మిస్' క్రమానికి చెందినటువంటివి. స్ట్రైగిడే, టైటానిడే అనే కుటుంబాలకు చెందిన పక్షులు. వీటి శాస్త్రీయనామం ''స్ట్రైక్స్ ఆక్సిడెంటాలిస్ కారినా'' అంటారు. గుడ్ల గూబలన్నీ కలిసి రెండు వందల జాతులుగా ఉన్నాయి. సామాన్యమైన గుడ్లగూబలన్నీ 'స్ట్రైగిడే' కుటుంబంలోనూ, బార్న్ గుడ్లగూబలన్నీ కూడా 'టైటానిడే' కుటుంబంలోనూ ఉన్నాయి. ప్రస్తుతం బతికి ఉన్న గుడ్ల గూబలన్నీ కూడా ఈ రెండు కుటుంబాలలోనే వివరించబడ్డాయి.
ఇంజక్షన్ మూతలతో...
ఇంజక్షన్ సీసాలకు రంగురంగుల ప్లాస్టిక్ మూతలుంటాయి. ఈ రంగురంగుల మూతలతో రంగురంగుల గుడ్లగూబను తయారు చేశాం. ప్లాస్టిక్ వ్యర్థాల నేలలో కలవకుండా భూమికి ఊపిరాడకుండా చేస్తుంటాయి. నేలలో కుళ్ళటానికి లక్షల సంవత్సరాలు పడతాయని తెలుసుకదా! ప్లాస్టిక్ తయారీలో కాడ్మియం, సీసం వంటి విషపూరిత పదార్థాలు ఉండటం వలన ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. 'సీసం' ఎక్కువ కాలం శరీరం లోనికి వెళితే మెదడు టిష్యూలు నశించి పోతాయి. అలాగే కాడ్మియం గనుక దేహ కణజాలాల లోనికి ప్రవేశిస్తే గుండె పని తీరుపై ప్రభావం చూపిస్తుంది, వాంతులను కలగజేస్తుంది. ప్లాస్టిక్‌లో ఉండే విష పదార్థాల వలన మనిషికి హానిజరుగుతుంది. మా రంగుల గుడ్లగూబ అపశకునాన్ని ఇచ్చే పక్షి కాదు. ఇవి ధృవ ప్రాంతాలలో జీవించలేవు. మిగతా ప్రపంచమంతా గుడ్లగూబలు వ్యాపించి ఉన్నాయి. రెండు కుటుంబాలు తప్ప మిగిలినవన్నీ విలుప్తమైపోయాయి.
పిస్తా షెల్స్, అవిశగింజలతో...
పిస్తా పప్పులపైన ఉండే గట్టి పెంకు లాంటి షెల్స్ చాలా అందంగా ఉంటాయి. లేత బిస్కెట్ రంగులో, నున్నగా పాలిష్ చేసినట్టుగా ఉండే చెక్కలాంటి పదార్థం. వడ్రంగి నైపుణ్యంతో చెక్కినట్టుగా ఉంటాయి. అందుకే వీటితో ఏ బొమ్మను చేసినా ఇమిడిపోతాయి. ఈ రోజు గుడ్లగూబ తయారయ్యింది. గుడ్లగూబ పర్యావరణ సమతుల్యతను కాపాడేటటువంటి పక్షి. ఎందుకంటే పంటలను నాశనం చేసే చిన్న చిన్న పురుగులను, కీటకాలను తింటుంది. అందువల్లనే గుడ్లగూబలు ఉంటే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. స్ట్రైగిడే లోని గుడ్లగూబలు పెద్దవిగా ఉంటాయి. ఇందులో 190 జాతులు ఉన్నాయి. ఈ గుడ్లగూబల అంతర్నిర్మాణం అంతా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువగా అడవుల్లో నివసిస్తాయి. చాలా గుడ్లగూబలు వలస వెళ్ళవు. ఎక్కడ ఉంటే అక్కడే చివర వరకు నివసిస్తాయి. కొన్ని జాతులు మాత్రం వాటి ఆవాసాన్ని మారుస్తూ ఉంటాయి.
పెడిగ్రీతో...
కుక్కల బలవర్థకమైన ఆహారం 'పెడిగ్రీ'తో కూడా నేను బొమ్మలు చేస్తున్నాను. ఈ పెడిగ్రీ రకరకాల ఆకారాల్లో ఉంటుంది. ఈ సారి కొద్దిగా పెద్దగా ఉండల ఆకారంలో ఉన్నది. దీంతో గుడ్లగూబను చేశాను. మిడిగుడ్లేసుకుని చూస్తున్న గుడ్లగూడ తయారయింది. గుడ్లగూడల ముఖాల ఆకారంలో కొన్ని గుండ్రంగానూ, కొన్ని గుండె ఆకారంలోనూ ఉంటాయి. ఇవి బరువులో 40 గ్రాములు నుంచి 4 కేజీల వరకూ ఉంటాయి. పెద్దతల, పెద్ద కళ్ళు, కిందకు వంగి ఉన్న ముక్కు, సన్నని వెంట్రుకలతో కప్పబడి ఉన్న కాళ్ళు ఉంటాయి. చిన్న కాళ్ళు, పొడుగు రెక్కలు ఉంటాయి. కొన్ని గుడ్లగూబలు, చేపల్ని గబ్బిలాలను, చిన్న పక్షుల్ని కూడా తింటాయి. చిన్న జింకలు, నక్కలు యుద్ధానికి వచ్చినపుడు బెదరక వాటితో గుడ్లగూబలు పోరాడుతుంటాయి.