Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుమూల పల్లెటూరికి చెందిన ఓ అమ్మాయి. ఇప్పుడు జర్మన్ ఎంఎన్‌సిలో ఉద్యోగం చేస్తుంది. దీని కోసం ఎంతో పోరాటం చేసింది. తన సోదరి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆర్థిక స్వతంత్ర సాధించేందుకు సామాజిక వివక్షను అధిగమించింది. ఆమే రాధికా బెహరా... ఆమె చేసిన స్ఫూర్తిదాయక పోరాట విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం...
రాధిక బెహరాకు అప్పుడు నాలుగేండ్లు ఉంటాయి. ఒడిశాలోని గజపతి జిల్లాకు సమీపంలో ఉన్న జరదా గ్రామంలోని హాస్టల్‌కు చదివేందుకు పంపారు. అక్కడే ఆమె నేర్చుకోవడం పట్ల చాలా ఆసక్తిని పెంచుకుంది. తన గ్రామంలోని ఇతర అమ్మాయిల్లా కాకుండా చదువుకోవాలని, ప్రపంచంలో తనదైన ఓ మార్గాన్ని రూపొందించుకోవాలని స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకుంది.
చదివించే స్థోమత లేక
ఎనిమిదవ తరగతి పూర్తయ్యాక చదువుకు స్వస్తి చెప్పి ఇంటికి రావాలని కుటుంబసభ్యులు అనడంతో ఆ కల అక్కడితే ఆగిపోయింది. పెండ్లి చేసుకుని అక్కలా ఇంట్లోనే ఉండిపోమని చెప్పారు. ''మా నాన్న రైతు. మేము పేదరికంలో పెరిగాము. ముఖ్యంగా నేను ఆడపిల్ల కాబట్టి నన్ను చదివించే స్థోమత తమకు లేదని నాన్న చెప్పారు'' అని చెప్పింది రాధిక.
అక్క ఇచ్చిన ధైర్యంతో
''మా అక్కకు అప్పటికే పెండ్లయింది. 22 సంవత్సరాల వయసులో ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. పేదరికం తనకు చదువుకునే అవకాశం లేకుండా చేసినప్పటికీ, నా కలను నిజం చేసుకునేందుకు అనుమతించాలని మా అక్క మా తల్లిదండ్రులను అభ్యర్థించింది. 'ఎవరైనా అభ్యంతరం చెబితే నేను నీకు తోడుగా ఉంటా' అని మా అక్క నాకు ధైర్యం చెప్పింది'' అని రాధిక చెప్పింది.
చదువు పట్ల ఆసక్తిని గమనించి
పెద్ద కూతురి మాటలతో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. రాధిక హైస్కూల్ చదువు పూర్తి చేయడానికి అంగీ కరించారు. బెహ్రంపూర్లోని హాస్టల్లో చేరేంఉదకు అనుమతించారు. రాధిక మళ్ళీ తన చదువునను కొనసాగించింది. ఆమెకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన సంతోష్ మోహపాత్ర అనే ఉపాధ్యాయుడు రాధికను ప్రోత్సహించారు. అయితే 10వ తరగతి పూర్తి కాగానే ఆమె తల్లిదండ్రులు మళ్ళీ ఇంటికి వచ్చేయమని పట్టుబట్టారు.
మగవారితో కలిసి పని చేస్తానని
''నేను ఎలక్ట్రీషియన్‌గా శిక్షణ పొందేందుకు బెహ్రామ్పూర్లోని ఇండిస్టియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లాలనుకుంటున్నానని వారికి చెప్పాను. వారు నన్ను వెళ్లనివ్వడానికి నిరాకరించారు. నాకు పనిలో శిక్షణ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని, అక్కడ నేను మగవారితో కలిసి పనిచేస్తానని గ్రామస్థులు వారికి చెప్పారు. కానీ సంతోష్ సర్ నాకు అవకాశం ఇవ్వమని మా తల్లిదండ్రులను ఒప్పించారు'' అని రాధిక చెప్పింది. అయితే ఆమె చదువుకు అయ్యే ఖర్చు భరించడం ఇంట్లో వాళ్ళకు పెద్ద ఆందోళన కలిగించింది.
స్కాలర్షిప్ పొందాను
'సాంకేతిక విద్య చదవాలని భావించే బాలికల కోసం ఒడిశా ప్రభుత్వం సుదాఖ్య పథకం గురించి సంతోష్ సార్ నాకు చెప్పారు. దరఖాస్తు చేసి స్కాలర్షిప్ పొందాను'' అని రాధిక చెబుతోంది. స్కాలర్షిప్లో భాగంగా వారు రాధిక అడ్మిషన్, హాస్టల్ ఫీజు చెల్లించారు. నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇచ్చారు. ''వారు నా యూనిఫాం కోసం చెల్లించారు. నా శిక్షణ పూర్తి చేసిన తర్వాత నా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయడానికి నాకు భత్యం కూడా ఇచ్చారు'' అంటుంది రాధిక.
ఉద్యోగం రాలేదు
''ఇప్పటికి నా ఆత్మవిశ్వాసం పెరిగింది. కటక్‌లోని ఒక కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం కోసం దరఖాస్తు చేయవచ్చా అని నా తల్లిదండ్రులను అడిగాను. వారు నాకు అనుమతి ఇచ్చారు. నేను ఇంటర్వ్యూను క్లియర్ చేసాను. అయినప్పటికీ కంపెనీ నాకు ఎప్పుడూ ఉత్తరం పంపలేదు. దాంతో నేను నా అవకాశాన్ని కోల్పోయానని అనుకున్నాను'' అంటూ ఆమె బాధపడింది.
చాలా దూరం వెళ్ళాలి
అప్పుడు ఐఐటిలో ఒక ఉపాధ్యాయుడు ఫోన్ చేసి జర్మన్ బహుళజాతి సంస్థ ఫ్రూడెన్బర్గ్ తమ చెన్నై ఆఫీసు కోసం వ్యక్తులను నియమించుకుంటున్నట్టు ఆమెకు చెప్పారు. ఆమె ఇంటర్వ్యూను క్లియర్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె ఉద్యోగం కోసం చాలా దూరం వెళ్ళాలి. దీని గురించి తల్లిదండ్రులకు చెప్పడం, వారి అనుమతి తీసుకోవడం ఆమెకు చాలా కష్టమైన సవాల్.
ఆవేదన వ్యక్తం చేశారు
''మా అమ్మ చాలా బాధపడింది. నేను నాలుగు సంవత్సరాల వయసు నుండి ఇంటికి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు అసలు ఏమీ తెలియని కొత్త ప్రదేశానికి వెళుతున్నాను. అక్కడ నా బాగోగులు చూసే వారు ఎవరూ లేరని మా నాన్న ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. చివరకు వాళ్ళు ఒప్పుకున్నారు' అని రాధిక చెప్పింది.
సొంత నిర్ణయాలతో...
ప్రస్తుతం 21 ఏండ్ల రాధిక అదే కంపెనీలో ఏడాదిగా పనిచేస్తోంది. పర్మినెంట్ ఉద్యోగిని కావాలని ఆమె ఆశ. ''గత సంవత్సరం నాకు అత్యంత బాధకరమైనది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మ గత నెలలో మరణించారు. ఒక పెద్ద నగరంలో ఒంటరిగా జీవించడం సవాళ్లతో కూడిన అంశం. నా అవసరాలను తీర్చుకోవడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. కానీ నేను నా సొంత అభిప్రాయాల ప్రకారం చేస్తున్నాను'' అని ఆమె చెప్పింది.
ఇంట్లో కూర్చోవద్దు
''నన్ను చదువుకునేలా పురికొల్పిన సంతోష్ సార్ లాంటి వాళ్లకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఆయన ఇప్పటికీ యువతులను స్వతంత్రంగా ఉండమని, వారి కలలను నిజం చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. నేను కూడా నాలాంటి మంచి జీవితం గురించి కలలు కనే అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నాను. చదువులేకుండా ఇంట్లో కూర్చోవద్దు. సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకుని సంపాదించడం ప్రారంభించండి. మీకు మొదట్లో పెద్దగా జీతం లేకపోవచ్చు. కానీ మీరు స్వతంత్రంగా ఉంటారు. మీరు కోరుకున్నట్టు జీవితాన్ని గడుపుతారు'' అంటుంది రాధిక.