Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా... ఇవేనా... ఈ రోజు ఏదైనా వెరైటీగా చేయొచ్చుగా అని ఇంట్లో పిల్లల నుండి సాధారణంగా వినపడే మాటలు. మనకూ వాటిని తినీ తినీ బోర్ కొడుతుంది. కాబట్టి కాస్త కొత్తగా ట్రై చేయాలనుకునే వారి కోసం వెరైటీ అల్పాహారం...
లాచా పరోట
కావల్సిన పదార్థాలు: గోధుమపిండి - రెండు కప్పులు, నెయ్యి - సరిపడా, ఉప్పు - రుచికి సరిపడ, నూనె - టేబుల్ స్పూను.
తయారు చేసే పద్ధతి: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నూనె, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చేసి తడిబట్ట కప్పి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని ఉండలుగా చేసి ఐదారు అంగుళాల చపాతీలు చేయాలి. ఇప్పుడు కరిగించి నెయ్యిని చపాతీ మీద మొత్తంగా రాయాలి. తర్వాత చాకుతో రెండున్నర అంగుళాల వెడల్పుతో పొడవుగా కోయాలి. వీటన్నింటినీ ఒకదాని మీద ఒకటి పరచాలి. అలా పరిచేటప్పుడు ప్రతీ దానిమీద నెయ్యి రాయాలి. ఇలా పరిచిన దానిని ఒకవైపు నుండి గుండ్రంగా చుట్టాలి. ఇప్పుడు దీన్ని కర్రతో పరాటాల్లా వత్తాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వెన్న వేస్తూ తక్కువ మంటతో రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే, లాచా పరాటా రెడీ.
మోరంగడ్డ పూరీ
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డ - పావుకిలో (ఉడికించి తొక్క తీసి బాగా మెదపాలి), బెల్లం తురుము - పావుకప్పు, గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, యాలకుల పొడి - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత.
తయారీ పద్ధతి: ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లం తురుము వేసి గరిటెతో కలిపి కరిగించి వడకట్టాలి. అదే పాత్రలో మెత్తగా చేసిన మోరంగడ్డ ముద్ద, యాలకుల పొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి. తగినంత నీరు జతచేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీయాలి. తియ్యతియ్యని చిలకడదుంప పూరీలు రెడీ.
పన్నీర్ కుల్చా
కావల్సిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, పాలు - అరకప్పు, పెరుగు - పావుకప్పు, పంచదార - అర టీ స్పూను, బేకింగ్ పౌడర్ - ముప్పావు టీ స్పూను, నువ్వులు - మూడు టీ స్పూన్లు, నెయ్యి - రెండు స్పూన్లు, తురిమిన పన్నీర్ - పావు కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, చాట్‌మసాలా - ఒక టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: పాలు వేడి చేసి చల్లార్చుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో పంచదార, చల్లని పాలు, పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనిప ఒక మెత్తని వస్త్రం కప్పి రెండు గంటల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, చాట్ మసాలా వేసి కలపాలి. ఇప్పుడు మైదాను తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి. దీంట్లో పన్నీరు మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ చిన్న ముద్దల్లా చేయాలి. మళ్ళీ కొద్దిగా పిండి, నువ్వులు వేస్తూ చపాతీల్లా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తూ సన్నని మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. వేడి వేడి పన్నీర్ కుల్చా రెడీ. వీటిని బఠానీతో చేసిన ఏ కూరతోనైనా లాగించేయొచ్చు.
సొరకాయ తెప్లా
కావల్సిన పదార్థాలు: సొరకాయ తురుము - ఒక కప్పు, గోధుమపిండి - ఒక కప్పు, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - ఒక టీ స్పూను, కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూను, కసూరీ మేధీ - ఒక టేబుల్ స్పూను, కారం - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, చాట్‌మసాలా - పావు టీ స్పూను, నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు (తెప్లా పైన పూసేందుకు).
తయారు చేసే విధానం: గోధుమ పిండిలో సొరకాయ తురుము, ఉప్పు పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరీమేధీ, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి. సొరకాయలో నీళ్ళు ఉంటాయి. కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్ళు పోయనక్కర్లేదు. ఒకవేళ పిండి మరీ జారుగా అయితే మరికొంచెం గోధుమపిండి కలపండి. మెత్తటి ముద్ద తయారు చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేయాలి. ఆ తర్వాత రొట్టెల పెనాన్ని వేడి చే యాలి. అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి. వీటిని వేడెక్కిని పెనం మీద వేసి కాల్చాలి. పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండోవైపు కూడా చేయాలి. రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు.