Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బచేంద్రి పాల్... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 68 ఏండ్ల వయసులో ఉన్న ఆమె 50 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలను మొదటి సాహసయాత్రకు సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నారు. దానికోసం ఆమె ఇప్పటికీ ప్రతిరోజూ 25 కి.మీ. పరిగెడుతున్నారు. అలాంటి సీనియర్ మహిళా సాహసయాత్రికురాలు బాల్యం నుండి ఇప్పటి వరకు తన ప్రయాణాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.
బచేంద్రి పాల్ యుక్తవయసులో ఉన్నప్పుడు కట్టెలు సేకరించడానికి, మేకలను మేపడానికి పర్వతాలు ఎక్కేవారు. ఆమె రోజువారీ పని ఇది. అలాంటి ఆమె 1984లో వేసవి కాలంలో ఓ రోజు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అలా చేసిన మొదటి భారతీయ మహిళగా ఘనతను సాధిస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. పద్మభూషణ్ అవార్డు సైతం అందుకున్నారు. ఈరోజు 68 ఏండ్ల వయసులో 12 మంది సీనియర్ మహిళల బృందానికి 'ఫిట్ఏ50' పేరుతో తూర్పు నుండి పడమర వరకు హిమాలయాలను దాటే అసాధారణ యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు.
చదువుకునే అవకాశం లేదు
''ఆ రోజుల్లో అమ్మాయిలను చదువుకోవడానికి కూడా అనుమతించే వారు కాదు. అబ్బాయిలను మాత్రమే చదివించేవారు. అబ్బాయిలైతే పెరిగిపెద్దవారై తమ కుటుంబాన్ని పోషించగలరని వారి నమ్మకం. చిన్నప్పటి నుంచి చదివి డాక్టర్ కావాలనుకున్నాను. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చాను. మాకు చదువుకునే స్తోమత లేదు. కానీ నేను చదువుకోవాలనే పట్టుదలతో కష్టపడి చదువుకున్నాను. అయితే పాఠశాలకు, కళాశాలకు వెళ్లకుండా ప్రైవేట్‌గా చదివాను. నేను 10వ తరగతి వరకు మాత్రమే చదువుతానని మా తల్లిదండ్రులు భావించారు. కానీ చదువులో నేను బాగా రాణించాను. అందుకే నా చదువును కొనసాగించమని మా పాఠశాల ప్రిన్సిపాల్ మా నాన్నకు ఉత్తరం పంపారు.
వారి లక్ష్యం పట్ల ఆకర్షితురాలై
60వ దశకం చివరిలో నకూరి అనే మారుమూల గ్రామంలో హిమాలయాల దిగువ ప్రాంతంలో పెరిగిన బచేంద్రి తరచుగా ట్రెక్కర్లు భారీ బ్యాక్‌ప్యాక్‌లతో ప్రయాణిస్తూ, ఉత్సాహంగా పర్వతాల వైపు వెళ్లడం చూసేవారు. ఆ గ్రామంలోని చాలా మంది పర్వతారోహకులను సీరియస్‌గా తీసుకునేవారు కాదు. పైగా దీనిని రోజువారీ దినచర్యగా కొట్టిపారేశారు. అయితే బచేంద్రి మాత్రం వారి పట్ల, వారి లక్ష్యం పట్ల, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం పట్ల ఆకర్షితురాలయ్యారు.
ఏకైక మార్గం విద్యనే
పర్వతాలపై ఆమెకు ఆసక్తి ఉన్నప్పటికీ మొదట తన చదువును పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే తన కుటుంబం పేదరికం నుండి బయటపడే ఏకైక మార్గం విద్య అని గట్టిగా నమ్మింది. డెహ్రాడూన్‌లోని డీఏవీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ నుండి ఎమ్మె, బి.ఎడ్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తుండగా తన గ్రామం పక్కనే ఉన్న నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) ప్రిన్సిపాల్‌తో పరిచయం ఆమె జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది.
పర్వతారోహణ మేలు అర్థం చేసుకున్నా
''అతను నాకు పర్వతారోహణ గురించి చెప్పాడు. ఎన్ఐఎంలో ఒక కోర్సులో చేరమని నన్ను ప్రోత్సహించాడు. నేను చదువుకున్న మహిళను కాబట్టి పర్వతారోహణ మానవాళికి ఎంత మేలు చేస్తుందో అర్థం చేసుకున్నాను. కృషి, పట్టుదల, సంకల్పంతో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానిని సాధించడం ఎలాగో తెలుసుకున్నాను. చాలా ప్రేరణ పొందాను. ఎన్ఐఎంలో చేరడానికి ఒక దరఖాస్తును పంపాను. కోర్సుకు ఎంపికయ్యాను.
ఆమె పేరు సిఫార్సు చేశారు
బచేంద్రి అప్పటికే ఒక పర్వత గ్రామం నుండి వచ్చారు కాబట్టి కోర్సులో ఆమెకు అది బాగా సహాయపడింది. కోర్సులో అద్భుతమైన రీతిలో ఉత్తీర్ణత సాధించారు. ఆ సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని స్కేల్ చేయడానికి ''మిశ్రమ జట్టు'' కోసం ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. ఎన్ఐఎం అడ్మినిస్ట్రేషన్ నుండి ఎవరో ఆమె పేరును సిఫార్సు చేసారు. అలా ఆమె దానికి ఎంపిక చేయబడింది.
ఆశ్చర్యంతో స్పందించలేదు
''ఎవరెస్ట్ శిఖరాన్ని స్కేల్ చేయడానికి నేను జట్టులో ఎంపికయ్యానని ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ నుండి నాకు లేఖ వచ్చింది. దాన్ని అధికారికం చేస్తూ నేను సుముఖత లేఖను పంపవలసి వచ్చింది'' అని ఆమె చెప్పారు. అయితే ఆమె ఆశ్చర్యంతో ఆ లేఖకు వెంటనే స్పందించలేకపోయారు. ''ఇది జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశం. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ సాహసయాత్ర వెనుక బలమైన శక్తిగా ఉన్నారు. తను మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు'' అని బచేంద్రి చెప్పారు.
ఉద్యోగం దొరకలేదు
సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 31 సంవత్సరాల తర్వాత తన 30వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు బచేంద్రి పాల్ స్కేల్ చేసిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు. పర్వతారోహణ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంతటి సాహసం చేసిన తర్వాత కూడా బచేంద్రికి ఉద్యోగం దొరక లేదు. ఉద్యోగం ఇవ్వలేని ఇదేమి చారిత్రాత్మక విజయమంటూ గ్రామ ప్రజలు హేళనగా మాట్లాడారు.
స్పోర్ట్స్ అసిస్టెంట్‌గా అవకాశం
కొంతకాలం తర్వాత టాటా స్టీల్ నుండి టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ అసిస్టెంట్‌గా చేరడానికి ఆమెకు ఆఫర్ వచ్చింది. ''నాకు టాటా స్టీల్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు పర్వతాలను స్కేలింగ్ చేయడం వల్ల టాటా స్టీల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉద్యోగం కూడా లభిస్తుందని మా గ్రామ ప్రజలు భావించారు. జాబ్ ఆఫర్‌కు ముందు నేను ఒంటరి పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాను. ఎందుకంటే మా గ్రామంలోని ప్రజలు వారి అమ్మాయిలను నాతో మాట్లాడటానికి అనుమతించరు. అంతేకాదు అన్ని విద్యలు ఉన్నప్పటికీ ఇంట్లో కూర్చున్నందుకు వారు నన్ను వెక్కిరించేవారు'' ఆమె చెప్పింది.
ఫిట్ ఏ 50
ఇప్పుడు మూడు దశాబ్దాలుగా బచేంద్రి టాటా స్టీల్‌లో భాగంగా ఉన్నారు. అక్కడ ఆమె పర్వతారోహణలో మహిళలు సాధికారత ప్రారంభించడానికి అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. బచేంద్రి చేసిన తాజా చొరవ 'ఫిట్ఏ50'. ఆమె 2019లో టాటా స్టీల్ నుండి రిటైర్ అవుతున్నప్పుడు ఆమె సొంత అనుభవం నుండి ఫిట్ఏ50 ఉద్భవించింది. ''ఫిట్‌గా ఉన్నప్పుడే ఎందుకు పదవీ విరమణ చేయాలి'' అని ఆమె ఆలోచించారు.
భారతదేశంలో ఇదే తొలిసారి
''50 ఏండ్ల అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళల యాత్ర కంటే మెరుగైనది ఏమిటని నేను అనుకున్నాను. ఇది ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమంతో కూడా ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి నేను ఈ ఆలోచనను టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. భారతదేశంలో ఇలాంటి యాత్ర జరగడం ఇదే తొలిసారి. యాత్ర గురించి బచేంద్రి ఉత్సాహంగా ఉన్నారు. యాత్రకు సన్నాహకంగా తన ఫిట్నెస్ విధానం ఇప్పుడు ప్రతిరోజూ 25 కి.మీల పరుగెత్తుతుందని పంచుకున్నారు.
రిస్క్ తీసుకునే ధైర్యం ఇచ్చింది
''జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ అని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఇది రిస్క్‌లు తీసుకోవడానికి, అనేక యాత్రలకు నాయకత్వం వహించడానికి, అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రయాణాన్ని కొనసాగించడానికి నాకు ధైర్యం ఇచ్చింది. అదే నమ్మకంతో 12 మంది మహిళల బృందంతో ఐదు నెలల సుదీర్ఘ హిమాలయ యాత్రను చేపట్టేలా చేసింది. ఈసారి అతిపెద్ద సవాలు వయసు'' అని ఆమె చెప్పారు.
మహిళలందరికీ ఓ ఉదాహరణగా...
''నా బృంద సభ్యులందరూ 50 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు గలవారు. యాత్ర సుదీర్ఘ వ్యవధి, భావోద్వేగ, సామాజిక, మానసిక కారకాలు, అలసట, వాతావరణ పరిమితులు వంటి అనేక ఇతర సవాళ్లు దీనిని ఒక ప్రత్యేకమైన చొరవగా మార్చాయి. కానీ మేము మహిళలందరికీ ఒక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాము. పెద్ద వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుందనే ఆశను పెంచుతాము'' అని ఆమె ధృవీకరించారు.
37 పర్వతాలు దాటుకుంటూ...
ఐదు నెలల పాటు సాగే ఈ యాత్రలో హిమాలయాలను తూర్పు నుండి పడమర వరకు - అరుణాచల్ నుండి లడఖ్ వరకు - 4,977 కిలోమీటర్లకు పైగా కవర్ చేసి 37 పర్వత మార్గాలను దాటుతుంది. ఈ బృందం మార్చి 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నేపాల్, కుమావోన్, గర్వాల్, హిమాచల్ ప్రదేశ్, స్పితి,లేహ్ , లడఖ్ మీదుగా వారి గమ్యస్థానానికి చేరుకుంటుంది.