Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్లు స్వరాజ్యం... గొప్ప సాహస యోధురాలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకి పట్టిన ధిశాలి. నిర్మొహమాటానికి, ధైర్యానికి మారుపేరు. తన సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటు. పీడితుల పట్ల సాహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర. రెండు వతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు. ''నా గొంతే నాకు తుపాకి తూటా'' అంటూ ధైర్యంగా చెప్పే యోధురాలు 91 ఏండ్ల వయసులో ఈ నెల 19వ తేదీన తుదిశ్వాస విడిచారు. తెలుగురాష్ట్ర ప్రజలను శోకసంద్రంలో ముంచేశారు.
1930-31 ప్రాంతంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు మల్లు స్వరాజ్యం. ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలంలో కొత్తగూడెం అనే చిన్న గ్రామం ఆమెది. తల్లి చొక్కమ్మ, తండ్రి రామిరెడ్డి. తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. దాంతో తల్లి ప్రభావం స్వరాజ్యంపై తీవ్రంగా ఉండేది. చొక్కమ్మ మేనమామ కొడుకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన ఆ ఉద్యమం గురించి, గాంధీజి గురించి చెప్పిన విషయాలకు స్ఫూర్తి పొంది కూతురికి ఆ తల్లి స్వరాజ్యం అని పేరు పెట్టుకున్నది. స్వరాజ్యం ధనిక కుటుంబంలో పుట్టినా సామాన్యుల వెతలను అర్థం చేసుకుంటూ పెరిగారు. చిన్నతనం నుండే ధైర్యంగా మాట్లాడేవారు. మగ ఆడా తేడాను అప్పుడే ప్రశ్నించేవారు.
అన్న ప్రభావంతో...
స్వరాజ్యం అన్నయ్య హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో ఆంధ్రమహాసభలో పనిచేసేవారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూనే ఆ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఊరిలో ఉద్యమాన్ని ప్రచారం చేసేవారు. ఆంధ్రమహాసభ గురించి అన్న చెప్పే విషయాలను వింటూ ఎంతో ప్రభావితం చెందారు స్వరాజ్యం. ఆమె అక్క భర్త కూడా ఆ ఉద్యమంలో పాల్గొనేవారుతా ప్రభావంతోనే బాలల సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆమె ఎంతో ఉత్సాహంగా పని చేసేవారు.
పదకొండేండ్ల వయసులో...
1943లో పదకొండేండ్ల వయసులో స్వరాజ్యం విజయవాడలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. అక్కడే కమ్యూనిస్టు రాజకీయాలు, గెరిల్లా యుద్ధ శిక్షణ, ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకున్నారు. తల్లి ద్వారా వామపక్ష సాహిత్యం చదివేవారు. అదే సమయంలో మాక్సిమ్ గోర్కి అమ్మ నవల ఆమెపై గొప్ప ప్రభావం చూపింది. అలా బాల్యంలో ఆమెకు కలిగిన ప్రేరణనూ, ఆలోచననూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఆమెను ఉద్యమాల్లోకి నడిపింది.
మహిళా హక్కులకై...
హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభకు అన్నతో కలిసి స్వరాజ్యం హాజరయ్యారు. దేశ స్వాతంత్రం, చదువు, హకులు, అందులో మైనర్ హక్కల గురించి విన్నారు. అక్కడే కమలాదేవిని కలిశారు. అక్కడే మహిళలకు పర్దా పద్ధతిని వ్యతిరేకించాలని, మహిళలకు ప్రత్యేక హాస్పిటల్ కోసం పోరాటం చేయాలని, మగవాళ్ళతో సమానంగా చదువుకునే హక్కుండాలని ఇలా ఎన్నో విషయాలపై ఆ సభలో చర్చజరిగింది. తర్వాత కాలంలో ఈ ఉద్యమంలో గ్రామాల్లోకి ప్రవేశించింది. దాంతో భూస్వామ్య వ్యతిరేకంగా మారిపోయింది. కూలి పెంచాలని ఉద్యమం చేశారు. వెట్టిచాకిరి ఎత్తెయ్యాలని కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు. తుంగతుర్తిలో కూడా ఈ పోరాటం జరిగింది.
కూలీల సమ్మెలో...
తమ గ్రామంలో జరిగిన కూలీల సమ్మె తన జీవితంలో పెద్ద మలుపు అంటారు స్వరాజ్యం. ఆ సమయంలో సిద్ధాంతం అంటే ఏమిటో ఆమెకు తెలియదు. అన్న మార్గంలో నడవడం తప్ప. పేద ప్రజలను ఏకమైన భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడాలని, రష్యాలోలాగా సోషలిస్టు సమాజం రావాలని ఆమె గ్రహించారు. దాంతో కూలీ సమ్మెలో చురుగ్గా పాల్గొన్నారు. దాంతో స్వరాజ్యంను తల్లి మేనత్త ఇంటికి పంపించారు. పెండ్లి కాని పిల్ల ఇలా తిరుగుతుంటే ఎలా అని ఆమె భయం. అక్కడ కూడా స్వరాజ్యం పాటలు పాడి అందరికీ దగ్గరయ్యారు. గ్రామంలో జరిగే సమావేశాల్లో ఆమెతో పాటలు పాడించుకునేవారు.
మహిళల్లో ధైర్యం నింపి
తర్వాత కాలంలో జరిగిన ఎన్నో ఉద్యమాలకు స్వరాజ్యం నాయకత్వం వహించారు. పోలీసలు గ్రామాలపై పడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు. ఆ సమయంలో పార్టీ నిర్ణయం మేరకు మహిళల్లో ధైర్యం నింపి పోలీసుల కండ్లల్లో కారం కొట్టి తుపాకులు లాక్కునేలా వారికి తర్ఫీదు ఇచ్చేవారు. అలాంటి పది, పదిహేను పోరాటాలు స్వరాజ్యం నాయకత్వంలో జరిగాయి. సూర్యాపేట, మల్లారెడ్డి గూడెం, ఆకునూరు, మాచిరెడ్డి పల్లి ఇలా చాలా పోరాటాల్లో ఆమె తుపాకి పట్టి తన దళంతో సహా పాల్గొన్నారు.
తెలివిగా వ్యవహరించి
ఓసారి వరంగల్‌ను ఆనుకుని ఉన్న అడవుల్లో ఓ గిరిజన గ్రామం నుంచి తిరిగొస్తున్నారు స్వరాజ్యం. కొంతమంది గిరిజనులు కూడా ఆమెతో వచ్చారు. తుప్పల్ని దాటుకుని ఇరుకైన రోడ్డులోకి వచ్చారు. దారికి రెండువైపులా కొండలు. సరిగ్గా ఆ సమయంలోనే దలసభ్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి నలుగురు పోలీసులు వస్తున్నారని చెప్పాడు. కొండల పక్కనే దాక్కొని, రాళ్లు సిద్ధం చేసుకోమని గిరిజనులకు చెప్పారు. స్వరాజ్యం పక్కన ఓ గూడెం మహిళ ఉంది. ఇద్దరూ చీకట్లో దాక్కున్నారు. పోలీసులు దగ్గరకు వచ్చారు. ఆమె పక్కనున్న మహిళ తొందరపడి స్వరాజ్యం దగ్గరున్న తుపాకీ లాక్కొని పోలీసులపై గురిపెట్టి కాల్చింది. వెంటనే పోలీసులు పొజిషన్ తీసుకొని లొంగిపొమ్మంటూ హెచ్చరించారు. వాళ్ళ దగ్గర ఒకే తుపాకీ ఉంది. అయినా స్వరాజ్యం కాస్త తెలివిగా ఆలోచించి 'మీరే లొంగిపోండి. మీరు నలుగురే ఉన్నారు. మా దళమంతా దాడికి సిద్ధంగా ఉంది' అని హెచ్చరించారు. దాంతో పోలీసులు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు.
మల్లు వెంకట నర్సింహారెడ్డితో వివాహం
ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం నుండి నిర్ధిష్టమైన హామీలు రావడంతో దళాలు అడవుల నుంచి బయటకు వచ్చాయి. స్వరాజ్యం ఏడేండ్ల పాటు పోరాటమే ఊపిరిగా బతికారు. బయటికొచ్చాక పార్టీ మధ్యవర్తిత్వంతో 1954 మే నెలలో మల్లు వెంకటనర్సింహారెడ్డితో ఆమె వివాహమయింది. ఆయన అండర్ గ్రౌండ్ పోరీటంలో స్వరాజ్యం సహచరుడు. ఏరియా దళకమాండర్‌గా పని చేసేవారు. పెండ్లి తర్వాత పూర్తి సమయం పార్టీకే కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. సూర్యాపేటలో స్వరాజ్యం దంపతులు కాపురం పెట్టారు. ఆ గ్రామంలో తల్లి ఇచ్చిన పొలాన్ని అమ్ముకుని ఆ డబ్బుతో సూర్యాపేట సమీపంలోని రాయినిగూడెంలో పొలం కొన్నారు.
పార్టీని అంటిపెట్టుకొని
భర్త పార్టీ పనుల్లో తిరుగుతుంటే స్వరాజ్యం వ్యవసాయం చేసేవారు. కొడవలి పట్టి వరి కోశారు. పిల్లాణ్ని చంకనేసుకొని కుప్పలు నూర్చారు. రెండో సంవత్సరం పొలం పండలేదు. తిండికి కూడా ఇబ్బంది అయింది. మల్లు నర్సిహారెడ్డి స్నేహితలు ట్రాక్టర్ ఏజెన్సీ ఇస్తామన్నా ఆ వ్యాపారం చేయడం వీరిద్దరికీ ఇష్టం లేదు. అలాగే నెట్టుకొచ్చారు. పెండ్లయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా స్వరాజ్యం పార్టీకి దూరం కాలేదు. ఎక్కడ సభ జరిగినా వెళ్ళేవారు. నిర్భయంగా మాట్లాడేవారు. ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి పుట్టారు. అదే గుడిసే, అదే వ్యవసాయం.
ఎమ్మెల్యేగానే పోరాటం
ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయం మేరకు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికయ్యాక అదీ పోరాటమే అయ్యింది. 900 ఎకరాల భూదానోద్యమ భూమిని ఆక్రమించుకున్న భూస్వామి ఇంటి ముందే దీక్షకు దిగారు. చచ్చినట్టు దిగివచ్చాడు. ఎమ్మెల్యే అయ్యాక వీరి కుటుంబం హైదరాబాద్ మారింది. పార్టీ తరఫున ఆమెను ఢిల్లీ పంపారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సరికి నర్సింహారెడ్డి ఆరోగ్యం దెబ్బతింది. నిమ్స్‌కు తీసుకెళ్ళారు. ఆమె వేసుకున్న బట్టలను చూసి వార్డుబారు కూడా లెక్క చేయలేదు. ఆమెకు చిర్రెత్తుకొచ్చి కడిగిపారేశారు. అప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లూ చేశారు. వెన్నుకు అపరేషన్ చేసి గుండె సమస్య ఉందన్నారు. కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ మూడు నెలలు ఉన్నారు. ఎలాగైనా ఆయన్ని బతికించుకోవాలని తపించారు. కానీ లాభం లేకపోయింది. 2004 డిసెంబర్ 4న ఆయన మరణించారు.
అసెంబ్లీలోకి వెళ్ళనీయలేదు
ఎమ్మెల్యేగా గెలిచిన స్వరాజ్యం... అసెంబ్లీలో తనకు ఎదురైన ఘటన గురించి ఓ సందర్భంలో ఇలా చెప్పారు. 'అప్పటి మా పార్టీకి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌తో కలిసి తొలిసారి అసెంబ్లీకి వెళ్లాను. ఓంకార్ కొంచెం ముందుగా అసెంబ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నన్ను గేటు దగ్గర బంట్రోతు నిలిపివేశారు. నేను ఎమ్మెల్యే అని చెప్పినా నమ్మలేదు. ఓ ఉద్యమంలో పాల్గొని నేరుగా అసెంబ్లీకి వచ్చిన నా అవతారం చూసి నన్ను ఎమ్మెల్యే అనుకోవం లేదతను. ఇంతలో ఓంకార్ వచ్చి నన్ను లోపలికి తీసుకుపోయాడు' అని చెప్పారు. 'నేను 12 రూపాయల కంట్రోల్ చీర కట్టుకుని వచ్చిన. ఎమ్మెల్యే అంటే ఖద్దరు వేసుకుంటరు కదా అనే ఆలోచనలో బంట్రోతు ఉన్నడు' అని ఆమె ఓ పుస్తకంలో పేర్కొన్నారు.
తుది వరకు ఉద్యమంలోనే
1978 నుండి 83 వరకు మొదటి దఫా, 1983లో రెండవ దఫా ఎమ్మెల్యేగా చేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. స్వరాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చరుగ్గా పాల్గొన్నారు. అఖిల 1993లో సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులిగా పని చేశారు. స్వరాజ్యం కూతురు పాదూరి కరుణ. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు మల్లు గౌతమ్ రెడ్డి ప్రస్తుతం నల్లగొండ పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈయనకు ఇద్దరు ఒక కొడుకు, ఒక కూతురు. చిన్న కొడుకు మల్లు నాగార్జున రెడ్డి. ఈయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. చిన్న కోడలు మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. స్వరాజ్యం ఇలా తనతో పాటు కుటుంబాన్ని కూడా పార్టీ బాటలో నడిపించారు. కడవరకు ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.