Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లంబర్ వర్క అంటే సాధారణంగా మగవారు మాత్రమే చేసే పని. శిక్షణ కూడా మగవారే ఇస్తారు. అలాంటిది ఒడిశాకు చెందిన 27 ఏండ్ల యువతి 750 మంది ప్లంబర్లకు శిక్షణ ఇచ్చింది. సతాబ్ది సాహూ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ముందు ఆమె ప్లంబర్‌గా శిక్షణ పొందింది. ఆ తర్వాత తాను శిక్షణ ఇచ్చి సుమారు 600 మందికి పైగా ఉద్యోగాలు పొందేలా సహాయం చేసిన ఆమె గురించి మరిన్ని వివరాలు మానవి పాఠకుల కోసం...
సతాబ్ది సుభాస్మిత సాహూ... పదవ తరగతి ఫెయిల్ అయిన అబ్బాయిలకు ప్లంబింగ్ ట్రేడ్‌లో శిక్షణ ఇప్పిస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. తద్వారా వారికి ఉపాధి దొరుకుతుందని ఆమె ఆలోచన. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు ఆమోదించారు. నీ మనసుకు నచ్చింది చేయమంటూ ఆమెకు వారు మద్దతిచ్చారు. ఇది జరిగి ఎనిమిదేండ్లు అవుతుంది. అప్పటి 20 ఏండ్ల కూతురు. తనపై తాను గట్టి నమ్మకంతో వుంది. ప్రస్తుతం ఆమె భువనేశ్వర్‌కు చెందిన పోస్ట్ మాస్టర్ గృహిణి. ఎనిమిదేండ్ల నుండి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పటి వరకు ఆమె 20 బ్యాచ్‌లకు పైగా పాఠశాల డ్రాపౌట్లకు శిక్షణ ఇచ్చారు.
డిప్లొమా పూర్తి చేసి
''నేను 2015లో సివిల్ ఇంజినీరింగ్‌లో నా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీనీ, 2013లో సివిల్ ట్రేడ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం వెతకాలని నిర్ణయించుకున్నాను'' అని సతాబ్ది చెప్పారు. అయితే ఆమె స్కిల్ డెవలప్మెంట్ ఇండియా ద్వారా పోస్ట్ చేసిన వార్తాపత్రికలో ప్లంబింగ్, వైర్ బెండింగ్‌ను ట్రేడ్‌గా నేర్పడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం వెతుకుతున్న ఒక ప్రకటనను చూసింది. రెండింటికీ అర్హత ఉండడంతో ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
నేను సిద్ధంగా ఉన్నాను
''నేను ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు వారు నన్ను అడిగిన వాటిలో ఒకటి నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానా. నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. ఎంపికైన అభ్యర్థి ఇండియన్ ప్లంబింగ్ స్కిల్స్ కౌన్సిల్ (స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో) ద్వారా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్‌ను పొందవలసి ఉంటుంది. ఈ రోజు నేను దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (ణణఖ+ఖ్) కింద రాష్ట్ర శిక్షణా రిక్రూట్‌లలో వివిధ గ్రామాల బ్లాకులను పర్యటిస్తున్నాను'' అని ఆమె చెప్పారు. ణణఖ+ఖ్ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (చీ=ూవీ) లో భాగంగా ఉంది. ఇది స్కిల్ ఇండియా చొరవ కింద గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం, గ్రామీణ పేదల ఆదాయాలను వైవిధ్యపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
మధ్యలోనే చదువు ఆపేసిన వారి కోసం
సతాబ్ది విద్యను ప్రోత్సహించే కుటుంబం నుండి వచ్చింది. ఆమె చెల్లెలు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, తమ్ముడు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చదువుతున్నారు. అందుకే ఆమె తన తరగతిలోని అబ్బాయిల సహృదయంతో ఉంటారు. వీరిలో చాలా మంది చదువుకు ప్రోత్సాహం లేని ఇళ్ల నుండి వచ్చారు. ఆర్థిక ఇబ్బందులు వల్ల వారు పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేకపోతున్నారని ఆమె గ్రహించారు.
అదనపు ప్రయత్నం చేశా
''విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సవాలుగా ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు చాలా చిన్నవారు. వినడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి వారికి నేర్పించడం అనేది చాలా కష్టం. కానీ నేను ఆ అబ్బాయిలకు శిక్షణ ఇచ్చేందుకు అదనపు ప్రయత్నం చేస్తాను. అయితే నేను ఓ అమ్మాయిని. పైగా నేనూ వయసులో చిన్నదాన్నే. అయినప్పటికీ ఎవరూ నాతో అగౌరవంగా ప్రవర్తించలేదు'' అని సతాబ్ది చెప్పారు.
ఎక్కువ మంది ఉద్యోగం పొందారు
తన వద్ద శిక్షణ పొందుతున్న అబ్బాయిలు జీవనోపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవడమే తనకు ఉన్న అతి పెద్ద సంతృప్తి అని ఆమె చెప్పారు. ''ఇప్పటి వరకు నా వద్ద ప్రతి బ్యాచ్‌లో 35 మంది విద్యార్థులతో 20 బ్యాచ్‌లకు పైగా శిక్షణ పొందారు. వారిలో ఒక్కో బ్యాచ్‌లో 30 మందికి పని దొరికింది. ఉద్యోగం కోసం ఇంటిని, తమ గ్రామాన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక కొందరు ఆగిపోయారు. వారి కుటుంబాల్లో కూడా వారికి కావల్సిన ప్రోత్సాహం దొరకలేదు. అందుకే ఉద్యోగం చేయలేకపోయారు.
నీవల్లే ఉద్యోగం వచ్చిందంటారు
ఆమె ట్రైనీల కోసం అతిపెద్ద యజమానులలో ఒకరు ముంబైలోని మహానగర్ గ్యాస్ లిమిటెడ్. వారు గ్యాస్ లైన్లు వేయడానికి నైపుణ్యం కలిగిన ప్లంబర్లను నియమించుకున్నారు. ''ఇతరులను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కార్పొరేషన్ లేదా ప్రభుత్వ సౌకర్యాలలో ప్లంబర్లుగా పని చేయడానికి నియమించబడ్డారు. వారిలో కొందరు ఒడిశాలో పనిచేస్తున్నారు. అయితే చాలా మంది ఉద్యోగాలు పొందిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టారు. వారంతా నెలకు దాదాపు రూ.5,000- రూ.8,000 సంపాదిస్తున్నారు. చాలా మంది ఒకట్రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళందరూ నా దగ్గరకు వెచ్చి 'నీ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది' అంటారు'' అని సతాబ్ది చెప్పారు.
శిక్షణ ఇస్తూనే ఉంటాను
భవిష్యత్‌లో తన శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. ''దీన్ని వదులుకోవాలంటే నాకు మరింత మెరుగైన అవకాశం రావాలి. నేను ఇతరులను ప్రోత్సహించాలనుకుంటున్నాను. ముఖ్యంగా నాలాంటి అమ్మాయిలకు శిక్షణ ఇవ్వడానికి, వారికి ఉద్యోగం దొరికేలా సహాయపడటానికి అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు సహకరించాలి. ప్రతి ఒక్కరూ ఎదగడానికి ఉద్యోగమే మార్గం'' అన్నారు సతాబ్ది.