Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు పెరుగు ఇష్టంగా తింటారు.. సంపూర్ణ భోజనామృతం అంటే చివరన పెరుగుతో తింటేనే అని చాలామంది అలానే ఫాలో అవుతారు. కాని కొందరికి పెరుగు అసలు పడదు. ఈకాలం చిన్న పిల్లలు పెరుగుని దగ్గరకు కూడా రానివ్వరు. ఎలాగోలా బుజ్జగించి పెరుగుని అలవాటు చేయాలి. పెరుగులో కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల ఎముకలు గట్టి పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు రోజు కప్పు పెరుగుతు తింటే రక్తపోటు సమస్యని కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు. జబులు చేస్తే పెరుగు తినకూడదని అంటారు కాని పెరుగులో మిరియాల పొడి, బెల్లం వేసుకుని తీసుకుంటే జబులు తగ్గుముఖం పడుతుంది. పెరుగు ఇష్టం లేని వారు మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. వేసవి కాలంలో మజ్జిక డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా చేస్తుంది. పెరుగు విరేచినాలకు మంచి ఔషదమని అంటారు. వేడి వేడి అన్నంలో పెరుగు తింటే మోషన్స్ కంట్రోల్ అవుతాయని డాక్టర్స్ చెబుతున్నారు. వాతం తగ్గించడమే కాదు పెరుగులో కాస్త ఉప్పు వేసుకుని తింటే అజీరి సమస్య తగ్గుతుంది. ఇంకా పెరుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి పెరుగుని తప్పకుండా రోజు ఆహారంలో తీసుకుంటే మంచిది.
దహీ బ్రెడ్ వడ
కావలసిన పదార్థాలు: బ్రెడ్ ప్యాకెట్ - ఒకటి, పెరుగు - అరలీటరు, నూనె - సరిపడా, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, జీలకర్రపొడి - అరటీస్పూను, కారం - అరటీస్పూను.
తయారుచేసే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలను మెత్తగా చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్దలా కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగాక బ్రెడ్ మిశ్రమంను చిన్నచిన్న ఉండలు తీసుకుని వడలుగా వత్తిన నూనెలో వేసి వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పెరుగు బాగా చిలికి ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలిపి వేయించిన వడను పెరుగులో వేసి కాసేపు నానాక సర్వ్ చేసుకోవాలి.
పెరుగు ఆవడ
కావల్సి నపదార్థాలు: మినపప్పు - అరకేజీ, పెరుగు - లీటరు, ఉప్పు - సరిపడా, నూనె - అర కేజీ, పోపు దినుసులు - టీ స్పూను, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు - చిటికెడు, వంటసోడ - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు నాలుగు గంటలు ముందు నానబెట్టుకోవాలి. నానిన పప్పును శుభ్రంగా కడిగి మెత్తగా గట్టిగా రుబ్బాలి. దీనిలో ఉప్పు కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి పోపు దినుసులు వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దించి పెరుగు తాలింపు పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచేసి నూనె కాగిన పిండితో గారెలు వేసుకుని నూనెలో దోరగా వేయించి తీసి, తాలింపు పెరుగులో వేసి అరగంట నానిన తరువాత సర్వ్ చేసుకోవాలి.
పెరుగన్న సద్ది
కావల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కప్పు, పెరుగు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండుమిర్చి - రెండు, సొంటి - కొద్దిగా, శెనగపప్పు - ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు - పది, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేయు విధానం: అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి పోసి కాగాక జీడిపప్పులు వేసి వేగించి తీసేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, సొంటి వేసి వేగించి తించేయాలి. దీన్ని అన్నంలో కలపాలి. తర్వాత ఇందులో పెరుగు తగినంత ఉప్పు వేసి కలపాలి.
వెజ్జీ కర్డ్ టార్ట్స్
కావల్సిన పదార్థాలు
టార్ట్స్ కోసం: మైదా - కప్పు, వెన్న - పావు కప్పు కన్నా తక్కువగా, యాలకుల పొడి - అరచెంచా, జాజికాయలపొడి - అరచెంచా, చక్కెర పొడి - రెండు చెంచాలు.
ఫిల్లింగ్ కోసం కావల్సినవి: గడ్డ పెరుగు - అరకప్పు, నీళ్లు నింపేసిన కీరదోస, సొరసాయ, క్యారెట్ తురుము - పావుకప్పు చొప్పున, పుదీనా, కొత్తి మీర తరుగు - పావుకప్పు, గింజల్లేని టొమాటో తరుగు - పావుకప్పు, చక్కెర, కారం - పావుచెంచా, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారు చేసే విధానం: టార్ట్స్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. తర్వాత నీళ్లతో గట్టిగా ముద్దలా వచ్చేలా కలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్నచిన్న కప్పుల్లా చేసుకోవాలి. వీటిని వేడి పెనంపై ఉంచి పైనుంచి పెద్ద గిన్నెను తిరగేసి బోర్లించాలి. మంట తగ్గించి ఉంచితే... పది, పదిహేను నిమిషాలకు ఇవి వేగి, కరకరలాడతాయి. అప్పుడు తీసేయాలి. ఫిల్లింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ బాగా కలిపి ఈ టార్ట్స్లో నింపితే సరిపోతుంది. వెజ్జీ కర్డ్ టార్ట్స్ సిద్ధం.