Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ సిలిండర్‌పై రూ.50 పెరగడంతో.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలెండర్ ధర రూ.1002కి చేరింది. ధరలు పెరుగుదలతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్యాస్ ఆదా చేసే మార్గాలు కొన్ని ఉన్నాయి. అయితే గ్యాస్ ఆదా చేసే బాధ్యత కేవలం మహిళలది మాత్రమే కాదు. కుటుంబ సభ్యులందరూ బాధ్యత తీసుకోవాలి. భర్త, పిల్లలు అందరూ సహకరించాలి. అప్పుడే గ్యాస్‌ను ఆదా చేసుకోగలుగుతారు. ఇంట్లో వంట గ్యాస్‌ను ఆదా చేసుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.
- ఏదైనా పప్పును కర్రీగా చేసేటప్పుడు నేరుగా చేయకూడదు. అది ఏ పప్పు అయినా కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాతే కూర చేయాలి. ఇలా చేస్తే మీ గ్యాస్ ఆదా అవుతుంది. లేదంటే ఆ పప్పులు ఉడికేందుకు ఎక్కువ సమయం పట్టి గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుంది.
- ఏదైనా కూర చేసేటప్పుడు దానికి అవసరమైన పదార్థాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేగానీ ఫ్రిజ్ నుంచి టమోటా ఒకసారి, పచ్చి మిర్చి ఒకసారి.. తీసుకురాకూడదు. ఇలా చేస్తే మీకు తెలియకుండానే ఎక్కువ సమయం పాటు గ్యాస్ ఖర్చవుతుంది. అందుకే ఏదైనా వంట చేసే ముందు దానికి అవసరమయ్యే పదార్థాలన్నింటినీ ముందే సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
- కూరలను కడాయి, ప్యాన్, గిన్నెల్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో చేసేందుకు ప్రయత్నించండి. కుక్కర్లో వండడం వల్ల తక్కువ సమయంలోనే కూర సిద్ధమవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
- ఏదైనా వంటకం పొయ్యిపై ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు పోయడం చాలా మంది చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. అలా నీటిని పోయడం వల్ల కూరగాయలు ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది.
- మరికొందరికి ఇంకో అలవాటు ఉంటుంది. కూర ఎంత వరకు ఉడికింది? అని తెలుసుకునేందుకు పదే పదే మూత తీస్తుంటారు. అలా చేయకూడదు. పొయ్యిపై ఏదైనా వంటకాన్ని వండేటప్పుడు పైన కచ్చితంగా మూత ఉండేలా చూసుకోవాలి. దాన్ని పదే పదే తీయకూడదు.
- వంట త్వరగా కావాలని చాలా మంది పెద్ద మంటపైనే ఉడికిస్తారు. కానీ అలా చేస్తే ఎక్కువ గ్యాస్ వృథా అవుతుంది. మీడియం మంటపై వంటలను చేసుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది.
- కూరగాయలను నేరుగా ఫ్రిజ్ నుంచి చల్లచల్లగా తీసుకొచ్చి వంట చేయకూడదు. గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాతే వంట చేయాలి. లేదంటే అవి ఉడికేందుకు ఎక్కువ సమయం పట్టి.. గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే సాధారణంగా నాలుగు నెలలు వచ్చే గ్యాస్ ఆరు నెలల వరకు వస్తుంది.