Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్త రెస్ట్ తీసుకున్న కరోనా వైరస్ శక్తి పంజుకొని మరల దాడులు ప్రారంభిస్తోంది. ఒమిక్రాన్ బి1, బి2 రకాల్లో మారి వేషం మార్చి ప్రజల మీదకు వస్తోంది. ఇజ్రాయిల్, దక్షిణ కొరియాల్లో ఒమిక్రాన్ యుద్ధభేరి మోగించింది. దక్షిణ కొరియాలో ఒక్కరోజులో 6 లక్షల మందిని ఒమిక్రాన్ వైరస్ ఆక్రమించింది. దక్షిణ కొరియాలో రోగుల సంఖ్య పెరిగి పోతుంటే వైద్య వ్యవస్థ ఆందోళనలో పడుతోంది. ఒకేసారి రోగుల సంఖ్య పెరగటం వలన వైద్యులు సరిపోక ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలైనాయి. ప్రతి దేశమూ వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి పెడుతున్నది. మన దేశంలో కూడా పిల్లలకు వ్యాక్సినేషన్ వేస్తున్నారు. 12 నుంచి 14 ఏండ్ల వయసు మధ్యలోగల పిల్లలకు ఢిల్లీలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టాగా తొలి రోజున మూడు లక్షల టీకాలు వేశారు. నాలుగు కోట్ల మంది దేశ వ్యాప్తంగా పిల్లలందరూ దాదాపు రెండు కోట్ల మందికి పైగా టీకాలు వేశారు. మార్చి నెల రెండవ వారంలో కరోనా కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ లెక్కన మే, జూన్లలో తీవ్రరూపం దాల్చవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తున్నది. చైనాలోని కొన్ని ప్రాంతాలు లాక్డౌన్లో ఉన్నాయి. మనము ఆ పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటిద్దాం. క్షేమంగా ఉందాం!
వేపాకులతో...
వేప, మర్రి, రావి వంటి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని పిల్లలతో జీవనం సాగించే పిచ్చుకను ఈ రోజు ఆ చెట్టు ఆలకులతోనే చేశాను. పిచ్చుకలు మృగ్యమైపోతున్న నేటి యుగంలో ఆకుపచ్చగా ఎప్పటికీ సజీవంగా ఉండాలనే ఆలోచనతో వేపాకుల పిచ్చుకను చేశాను. అసలు పిచ్చుకల్ని ఎందుకు చేయాలి. మార్చి 20వ తేదీ 'పిచ్చుకల దినోత్సవం' జరుపుకున్నాం. మన చిన్నతనంలో ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించామా! ఇంటి చూరులో, ధాన్యపు గాదెల దగ్గరగా, ఇంటి ముంగిళ్ళలోని చెట్ల మీదా గిరగిర తిరుగుతూ కన్పించే పిచ్చుకలు మాయమైపోతాయని ఎప్పుడైనా అనుకున్నామా! ఇంట్లోని అద్దాల దగ్గర కూర్చొని ముక్కుతో అద్దంలోని ప్రతిబింబాన్ని పొడుస్తూ కిచకిచ మంటూ తిరిగే పిచ్చుకల్ని చివరికి 'జూ'లలో చూడాల్సి వస్తుందని కలలో నైనా అనుకోలేదు. అడవుల కొట్టివేత, నదుల పూడ్చివేతల కారణంగా పక్షులకు నిలవనీడ, తాగడానికి నీరు కరువై చనిపోతున్నాయి అంతే కాకుండా ప్రస్తుతమున్న సెల్‌ఫోన్ టవర్ల మూలంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. సెల్‌ఫోన్ టవర్ల ద్వారా వచ్చే తరంగాల వలన పిచ్చుకలు బతక లేకపోతున్నాయి. టెక్నాలజీ పెరగడం అనేది పిచ్చుకల పాలిట శాపంగా మారుతున్నది.
లవంగాలతో...
ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన పిచ్చుకల దినోత్సవాన్ని జరుపు కోవాలని నిశ్చయించుకున్నాయి. జనావాసాల మధ్య నివసించే పిచ్చుకకు ప్రమాదం ఏర్పడితే మానవ మనుగడకు కూడా ప్రమాదమేర్పడుతుందని గుర్తించారు. అందువలననే ''ప్రపంచ పిచ్చుకల దినోత్సవం'' జరపాలని నిర్ణయించాయి. ఈ దినోత్సవం రోజున పిచ్చుకలు మనుగడకు అవసరమైన అంశాలపై చర్చించి దానికవసరమైన చర్యలు చేపట్టాలని అనుకున్నారు. భారత ప్రభుత్వ తపాలా శాఖ కూడా పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించి ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. అంతేకాకుండా పిచ్చుకల సంరక్షణ కొరకు పిచ్చుకల అవార్డులను కూడా ప్రవేశపెట్టారు. మొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్‌లో ఎన్ఎఫ్ఎస్ అనే సంస్థ ఈ పిచ్చుకల అవార్డును 2011వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. నేనీరోజు ఈ జుజ్జి పిచ్చుకను సుగంధ ద్రవ్యాలైన లవంగాలతో చేశాను. లవంగాలు 'మిర్టేసి' కుటుంబానికి చెందిన మసాలా దినుసు చెట్టు. చెట్టులోని పూ మొగ్గల్నే మనం లవంగాలు అంటాము. దీని శాస్త్రీయనామం 'షైజీజియం ఏరోమేటికమ్''. ఈ లవంగాలలో ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.
చేమంతి పూలతో...
పూల పిచ్చుకను తయారు చేశాను. మా ఇంట్లోని కుండీల్లో నాలుగు రకాల చేమంతులు ఉన్నాయి. వాటిలో సాధారణ రకమైన చేమంతులతో నేనీ పిచ్చుకను చేశాను. కొద్దిగా వాడటం మొదలైనాక చేమంతుల గుత్తుల్ని కోసి పిచ్చుకగా మలిచాను. ఆకుల పిచ్చుక, మసాల దినుసుల పిచ్చుక, పూల పిచ్చుక అంటూ రకరకాలు తయారౌతున్నాయి. చిన్నప్పుడు పొలాలలో ధాన్యాన్ని పిచ్చుకలు తినకుండా దిష్టిబొమ్మలు పెట్టేవాళ్ళు. మా రైస్‌మిల్లులో ఎప్పుడూ కిచకిచమంటూ పిచ్చుకల మందలు తిరుగుతుండేవి. వడ్లు, బియ్యం కోసం నిరంతరం వచ్చే పిచ్చుకల్ని చూస్తూ బాల్యాన్ని గడిపిన వాళ్ళం. వడిశెల రాళ్ళు, దిష్టి బొమ్మలతో పిచ్చుకల గుంపుల్ని తరిమేవాళ్ళు వడ్ల బస్తాలకు ముక్కుతో కన్నాలు చేస్తూ గింజల్ని తింటుండేవి. వాటి పొట్ట ఎంతలే అనుకుంటే వారం రోజుల్లో బస్తా సగమయ్యేది. అందుకే వాటిని తోలే వాళ్ళు. వెంటిలేటర్ గూళ్ళలో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకునేవి. పిల్లల కోసం ఆహారం తెచ్చి వాటి నోటి కందించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఎర్రని నోళ్ళు తెరిచి తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురుచూసే పిల్లల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.
పారి జాతాల విత్తనాలతో...
ఎంతో అందంగా కనిపించే పారిజాతం చెట్టు విత్తనాలతో పిచ్చుకను సృష్టించాను. పొట్టిగా ఉండే సింధూర వర్ణపు కాడ, తెల్లని రెక్కలతో ఉండే పారిజాతం పువ్వు చూడటానికి అందంగా ఉంటుంది. ఈ చెట్టు ఎక్కువగా దేవా లయాలలో పెంచు తారు. ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. ఈ పూలు రాత్రిపూట వికసించి తెల్లారేసరికి నేల మీదకు రాలిపోతున్నాయి. అక్టోబరు, నవంబరు, డిశెంబరు నెలల్లో ఎక్కువగా పూస్తాయి. ఆకుపచ్చని బిళ్ళల ఆకారంలో విత్తనాలుంటాయి. ఈ విత్తనాలను సేకరించి నేను బెంగుళూరు నుండి తెచ్చుకువచ్చాను. ఎయిర్ పోర్టులో వీటి గురించి అడిగారు. అంత కష్టపడి తెచ్చుకున్న పారిజాత విత్తనాల పిచ్చుక గులాబీ రెక్కల శరీరంతో తయారైంది. ఒకప్పుడు ఇళ్ళలో వడ్ల బస్తాలుండేవి. పొలంలో పండిన వడ్లను సంవత్సరమంతా తినటానికి ఇళ్ళలో దాచేవారు. ఆ వడ్ల కోసం పిచ్చుకలు నిత్యం ఇంట్లో సందడి చేసేవి. ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు ఊహలకే పరిమితం.
కుక్క బిస్కెట్లతో...
కుక్కలు తినే ఆహారం రాయల్కెనైన్ బిస్కెట్లతో పిచ్చుకనకు రూపొందించాను. దీని శరీరాన్ని లేత పింక్ రంగు పూలతో నింపాను. నేల మీద పరిచినట్లుండే అకులను గుత్తులుగా పూలు పూసే చెట్టుంది మా ఇంట్లో. ఈ గుత్తికి దాదాపు 20నుంచి 30 పూలు పూస్తాయి. నాకు పేరు తెలీదు. ఈ పూలను తెంపి పిచ్చుక శరీరంగా నింపాను. పొడుగు కాడ, పొట్టి చిన్ని రెక్కలుంటాయి. డా|| సలీమ్ అలీ పక్షి ప్రేమికుడు. ఆయన రూపొందించిన 'రంగన్నతిట్టు పక్షి ధామాన్ని' నేను సందర్శించి పిల్లల కోసం ఒక వ్యాసాన్ని రాశాను. అంతే కాకుండా విలుప్తమయ్యే దశలోకి పోతున్న పిచ్చుకల చిత్రాలతో చాలా ఛార్టులు తయారు చేశాను. దాదాపు 70 చార్టులను పక్షులను కేంద్రంగా చేసుకొని కవితలను జోడించి తయారు చేశాను.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్